అపకారికి ఉపకారము.. (మినీ కథ)

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
04 Jan 2026
అపకారికి ఉపకారము.. (మినీ కథ)
-------------///---///----///-
అది ఒక పల్లెటూరు.ఆ ఊళ్ళో చిన్న పిల్లలకు కొత్త రకమైన వైరల్ జ్వరా లొచ్చి నలుగురైదురు చనిపోవడంతో అందరూ పిల్లల ఆరోగ్యం గూర్చి భయపడుతుండగా, ప్రక్క ఊళ్లోకి కొత్తగా వచ్చిన ఒక ఆయుర్వేద వైద్యుడు, తను తయారు చేసిన మందులతో పిల్లల జ్వరాలు తగ్గిస్తూ వాళ్లపాలిటి దేవుడయ్యాడు!
ఆ ఊళ్ళో ప్రెసిడెంటు గా ఉన్న బాబూరావు చిన్న కొడుకైన నాలుగేళ్ళ అబ్బాయికి కూడా వైరల్ జ్వరమొచ్చింది. ఊళ్ళో ఉన్న డాక్టర్ల వల్ల కాక పట్నంలో హాస్పటల్ లో కూడా చూపించి వచ్చారు .అయినా జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తున్నది.బాబూరావు భార్య బాబూరావుతో "అయ్యా! మన బుడ్డోడిని కూడా పక్క ఊళ్ళో ఉన్న డాక్టర్ గారికి చూపిద్దాం.ఆయన ఇచ్చే మందుకి పిల్లలకొచ్చే జ్వరాలు వెంటనే తగ్గుతున్నాయంట ఇప్పుడు ఆయన రోజూ మనూరికి కూడా వస్తున్నా డంటగా" అన్నది. దానికి బాబూరావు" ఆ డాక్టర్ ఎవరనుకున్నావే, ఆర్.ఎం.పి. డాక్టర్ గా కొత్తగా ఉద్యోగం మొదలుపెట్టిన మీ తమ్ముడి కి అడ్డుగా ఉన్నాడని మనం దొంగ కేసు బనాయించి ఊళ్ళోనుంచి వెళ్లగొట్టామే ఆ 'జోసెఫ్ ' ఈయనే. ఇన్నాళ్లూ ఎక్కడెక్కడో తిరిగి ఈ మధ్యనే మన పక్క ఊరికి వచ్చాడు. ఆయన మనోడికి మందియ్యమంటే ఎందుకిస్తాడే ?ఇంత విషమిస్తాడుగాని!"అన్న బాబూరావు మాటలు విని "అయ్యో ఇంక మన బుడ్డోడికి తగ్గేదెట్టయ్యా" అని బాబూరావు భార్య లబ లబ లాడుతుండగా, ఇంతలో "ప్రెసిడెంటు గారూ మీ చిన్న అబ్బాయికి కూడా జ్వరం వచ్చిందంటగా,ఇదుగో ఈ మందు మూడు పూటలా వేయండి తగ్గిపోతుంది " అంటూ ఆ జోసెఫ్ వాళ్ళింట్లోకి వచ్చి మందు పొట్లాలు వాళ్ళ చేతుల్లో పెట్టాడు.
ఆనందం ఆశ్చర్యాలతో నోట మాట రాని భార్యా భర్తలు ఇద్దరూ కాసేపటికి తెప్పరిల్లి, "మీకు కోటి దండాలు జోసెఫ్ గారూ!" అన్నారు.
బాబూరావు ఐతే,"జోసెఫ్ గారూ మేము మీకు చేసిన ద్రోహం గుర్తు పెట్టుకోకుండా మా ఇంటికి వచ్చి మా బుడ్డోడి ప్రాణాలు కాపాడడానికి మందు ఇస్తున్నారు.మీరు నిజంగా దేవుళ్ళయ్యా మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు" అని వంగి ఆ డాక్టర్ జోసెఫ్ కాళ్లకు దండం పెట్టబోయాడు.
జోసెఫ్ అతన్ని వారిస్తూ, " కృతజ్ఞతలు నాకెందుకండీ? 'నీకు ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారము చేయడం గొప్ప కాదు--అపకారికి ఉపకారము నెపమెన్నక చేయు వాడు నేర్పరి సుమతీ' అని ఏనాడో నీతి నేర్పిన శతక కారునికి , అంతకు ముందే ఎప్పుడో, 'నీకు హాని చేసిన వానికి ప్రతీకారము చేయక,ఒక చెంపై కొట్టిన వానికి రెండో చెంపను కూడా చూప'మంటూ, ఆపదలో ఉన్న శత్రువునైనా ఆదరించి చేయూత నివ్వాలని బోధించిన యేసుక్రీస్తు భగవానునికి కృతజ్ఞతలు చెబుతూ వాళ్ళ బోధనలను అందరం ఆచరిద్దాం" అంటూ బయటకు నడిచారు జోసెఫ్ గారు!
