క్రీస్తు బాల్యం - విశేషాలు

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
04 Dec 2025
ప్రశ్న :-
యేసుక్రీస్తు బాల్యము గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మందికి ఉంటుంది.అందుకు మనకు ఆధారాలు దొరుకుతాయా ?
సమాధానం:
ఆయన బాల్యం గురించి బైబిలులో వివరించిన విషయాలకంటే మనకు ఇంకేమి తెలియవు.అయితే ఈ విషయంపై వివిధ రచనలు కూడా ఉన్నాయి. వాటినే అప్రమాణిక రచనలు అన్నారు (Apocryphal Writings). యేసుక్రీస్తు పుట్టుక వృత్తాంతం మినహాయించి ఆయన బాల్యములో జరిగిన ఒకే ఒక సంఘటనను లూకా అక్షరాలలో చూపించాడు.అది బాలయేసు దేవాలయములో పండితులతో చర్చించడం (లూకా 2:41-52).ఈ సంఘటనలో కొన్ని చారిత్రక వాస్తవాలు కనుపిస్తాయి. ఆయన ఒక భక్తి గల కుటుంబంలో పెరిగాడు.యేసేపు మరియమ్మలు తమ మతాచారాలను బట్టి పాస్కా పండుగ దినములలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు.తమ వెంట బాలయేసును కూడా తీసుకువెళ్ళారు.ప్రతి యూదయ బాలుడు తన 13వ యేట యవ్వన ప్రాయంలో ప్రవేశించే సమయాన్ని వేడుకలా జరుపుకుంటారు.ఇది బాలుని అందుకు సిద్ధపరచేందుకు అయి ఉండవచ్చు.ఒక సాంప్రదాయకుటుంబం ఆచార వ్యవహారాలను ఆచరించటంలోని ఆసక్తిని గమనించాలి.ఆ తరువాత ఆ బాలుడు దేవాలయములో ఉండిపోవడంలో ఎటువంటి ఆకతాయితనమూ,అవిధేయత కనుపించవు.అప్పుడప్పుడే పరిపక్వత సాధిస్తున్న ఒక బాలునిలో కర్తవ్య పరాయణతో కూడిన నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.తన జ్ఞానంతో తలపండిన పండితులను ఆకట్టుకొన్నాడు.వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ తన జ్ఞాన సంపదను వారి ముందు చూపగలిగాడు.వారిని ప్రశ్నలడుగుతూ ఒక విద్యార్థిలా వారినుండి కూడా నేర్చుకున్నాడు. తన వయసుకు తగినట్లు పెద్దవారి ముందు నడచుకొన్నాడు.అప్పటి నుండి 30 సంవత్సరములు వచ్చేంత వరకూ ఆయన బాల్యం గురించి మనకేమి తెలియదు. అయితే లూకా ఒక వాక్యంలో ఆయన గురించి ఇలా వ్రాశాడు: "అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను.యేసు జ్ఞానమునందును, ప్రాయమునందును వర్థిల్లుచు దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను.. (లూకా 2:51-52). ఇంతకు మించి మనకు ఆయన బాల్యం గురించి తెలియదు.
