డిసెంబర్ 25 - క్రిస్మస్ పండుగ నేపథ్యం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

04 Dec 2025

యేసుక్రీస్తు ఏ తేదీన జన్మించారో ఎవరికీ తెలియదు. అంటే ఆ తేదీని ఎవరూ వ్రాసిపెట్టలేదు.అయితే ఆయన ఒక చారిత్రాత్మక పురుషుడు.లోకరక్షకుడు.చరిత్రను ఒక మలుపుతిప్పిన కారణజన్ముడు.అటువంటి మహానుభావుడు జన్మించిన రోజు అతి పవిత్రమైన రోజు.ఆయన ఈ భూమిపై కాలిడిన తీయని క్షణాలను మనసారా ఆస్వాదించాలని ఆయన ఆరాధికులు తప్పకుండా భావిస్తారు.కానీ అది ఏ తేదీ అన్నదే ప్రశ్న! ఇప్పుడు ఆచరిస్తున్న డిశంబరు 25 గురించి పలు అభిప్రాయాలుండేవి.ఒక అభిప్రాయం ప్రకారం,మార్చి 25న మరియమాతకు దేవదూత మంగళవార్త చెప్పిన పండుగగా అతి ప్రాచీన సాంప్రదాయం ఉండేది.అప్పటినుండి తొమ్మిదినెలలు లెక్కిస్తే,డిశంబరు 25కు 9 నెలలు నిండుతాయి. కాబట్టి ప్రభువు పుట్టినరోజు డిశంబరు 25 అనుకుని,దానినే క్రీస్తు జయంతిగా నిర్ధారించినట్లు కొందరు భావించారు.కానీ ఈ వాదనలో కొన్ని పరిమితులున్నాయి.అలాగే క్రీస్తు సాక్షాత్కార పండుగను జనవరి 6న జరుపుకునే ప్రాచీన సాంప్రదాయం ఉండేది.అదే రోజున ఆయన జన్మదినాన్ని,బప్తిస్మాన్ని జరుపుకునేవారు.కానీ జన్మదినమంటూ ప్రత్యేకంగా ఒకటుండాలని ఆనాడే క్రైస్తవులు భావించారు.క్రీస్తు జయంతిగా డిశంబరు 25కు ఇంకో బలమైన అభిప్రాయం ఉండేది.రోమనులు డిశంబరు మధ్య నుండి చివరి వరకు కొన్ని పండుగలు చేసుకునేవారు.శీతాకాలం అయిపోగా ఇక హరిత వర్ణం ప్రారంభమై ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుందనే భావం ఈ పండుగలలో కదలాడేది.ప్రతి సంవత్సరం నవంబరు,డిశంబరులలో రోజులు (పగలు) చిన్నవికావటం రోమనులను కలవరపరిచేది.శాస్త్రీయ పరిజ్ఞానం వికసించని ఆ రోజుల్లో,భూమి క్షీణిస్తోందేమోనని భయపడేవారు.కానీ డిశంబరు చివరికి సూర్యుని పునరాగమంతో,రోజులో ఎక్కువ భాగం కనిపించేది.ప్రకృతిలో సూర్యున్ని ఏ శక్తీ జయించలేదని భావించేవారు.అందుకు సూర్యున్ని అజేయుడిగా పరిగణించేవారు,పండుగలు చేసుకునేవారు.అందులోని ఒక పండుగను'సాతుర్నాలియా' (Saturnalia) అంటారు. ఇందులో సాటర్న్ అనే దేవతను ఆరాధించేవారు.ఈ దేవత వ్యవసాయ ఫలాలిచ్చే దేవత. క్రీ.శ.274లో రోమను చక్రవర్తియైన అవురేలియస్ డిశంబరు 25న ఇంకో పండుగను ప్రవేశపెట్టాడు దీనికి "Dies Natalis Sol Invictus" (The Birthday of the Unconquered Sun) అని పిలిచేవారు. 'అజేయుడైన సూర్యుని జన్మదినం' అని దీనికి అర్థం.ఈ పండుగ రోజున,రోమనులు దీపాలతో,వెలుగులతో సూర్యున్ని కొనియాడేవారు.ఈ సూర్యదేవునిపేరు 'మిత్రాస్' (Mithras). క్రైస్తవులు కూడా ఈ పండుగలో పాల్గొని, ఆ రోజున నీతిసూర్యుడయిన క్రీస్తు జన్మదినాన్ని కొనియాడేవారు.క్రీ.శ.4వ శతాబ్ధంలో ఒక క్రైస్తవ పండితుడు ఇలా వ్యాఖ్యానించాడు: "డిశంబరు 25ను క్రైస్తవులు అతి పవిత్రంగా భావిస్తారు.అందుకు కారణం సూర్యుడు కాదు,అతనిని సృష్టించిన దేవుని జన్మదినం ఆ రోజు కాబట్టి". ఈ విధంగా రోమనుల పండుగ రోజున, క్రీస్తు జయంతిని జరుపుకుంటూ రోమనులను ఆకట్టుకోగలిగారు. అలా రోమనుల పండుగను క్రైస్తవ పండుగగా మార్చగలిగారు. రోమనుల దేవతయైన 'మిత్రాస్' (Sun God) జయంతిని కూడా అదే రోజున జరిపేవారని చెప్పుకున్నాం కదా! మిత్రాస్ - క్రీస్తు, ఈ ఇద్దరి పుట్టుక విశేషాలలో సామ్యము కనిపించేది.ఇద్దరి జన్మవిశేషాలలో దైవప్రమేయం, అద్భుతాలు సంభవించడంలో పోలికలు కనిపించేవి.ఇలా క్రమంగా డిశంబరు 25, క్రైస్తవులకు క్రీస్తుజయంతిగా ఆమోదయోగ్యమైంది.సూర్యుని నేపథ్యాన్ని ఉటంకిస్తూ, క్రీస్తు నీతిసూర్యుడని ఆ రోజును సమర్ధించారు. "నా యెడల భయభక్తులు జూపు మీపై నా రక్షణము సూర్యునివలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీరు బీళ్ళకుపోవు లేగలవలె గంతులు వేయుదురు" అనే మలాకీ గ్రంథంలోని వాక్యం వారి అభిప్రాయాన్ని బలపరుస్తోంది (మలాకీ 4:2). డిశంబరు 25ను, కాన్స్టాంటైన్ చక్రవర్తి (క్రీ.శ.312) క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి ముందే క్రీస్తు జయంతిగా జరుపుకునేవారు.ఆ తరువాత క్రైస్తవం బలపడింది. కాబట్టి 25 డిశంబరున క్రీస్తు జయంతి నిర్విరామంగా జరుపబడేది. ఈ భావం పూర్తిగా 18-19 శతాబ్ధంలో ప్రజామోదం పొందింది.

క్రిస్మస్ అనే పదం ఆంగ్ల పదమైన "క్రైస్ట్ మాస్” (Christ Mass) అనే పద ద్వయం నుండి వచ్చింది. దానికి అర్థం క్రీస్తు పేరట జరిగే సమావేశము లేదా ప్రార్థనా కూడిక.ఈ సమావేశాలలో క్రీస్తు పాపులకోసం ప్రాణత్యాగం చేసిన సంఘటనను స్మరించుకొనేవారు. ఈ పద ద్వయం నుండే క్రిస్మస్ అనే పదం వచ్చింది(Christ Mass - Christmas). మొదట ఈ పండుగను సూర్యాస్తమయము నుండి సూర్యోదయము మధ్యలోనే అనుమతించేవారు.అదే ఆచారం వాడుకలోకి వచ్చింది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN