పునీత సిసీల్యమ్మ గారి పండుగ సందర్భంగా :-

బాలస్వామి
22 Nov 2025
మానవ జీవితానికి చక్కని అలంకరణ కావాలి :
కుమారీ,నీ జీవితమును చక్కగా అలంకరించుకొనుము.
కాలము వచ్చియున్నది.నీ తండ్రి ఇంటిని విడిచివెళ్లే కాలం వచ్చియున్నది.దేవుడు లోకమందు ఒక కార్యము సిద్ధపరిచి ఉన్నాడు.నీవు సంతోషానందములతో జీవించే కాలము ఒకటి ఉన్నది.అదియుక్త కాలమున జరుగు ప్రక్రియ.విచిత్రమైన వస్త్రములు ధరించుకొని నీవు రాజునొద్దకు తీసుకొని పోబడుదువు.నీ వస్త్రములు గోపరస సువాసనచే,లవంగ పట్ట సువాసనచే గుబాలించుచున్నవి.ఒక రాజు నీ సౌందర్యమునుకోరి తన అంతఃపురమునకు గొనిపోవును.అతడు బలవంతుడు. సౌందర్యవంతుడు.నిన్ను నలుగుదిక్కుల కాపాడువాడు.అతనికి నమస్కరించుము.
పై వాక్యాలు సిసీల్యమ్మ గారి జీవితంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తున్నాయి.సిసీల్యమ్మగారి పండుగ సందర్భంగా పంపించబడిన వీడియోలో ఆమె జీవిత చరిత్రను పరిశీలనగా ఆలకిస్తే,లోక సాంప్రదాయం ప్రకారం, ఆమె తల్లిదండ్రులు ఒక ధనవంతుడైన అన్యునికి ఇచ్చి పెళ్లి చేసి తమ బాధ్యత నెరవేర్చుకున్నారు. కాని,పవిత్రతతో తన దేవుని వైపే ఉండాలనే ఆమె నిర్ణయం,ఆమె పట్టుదల, అన్యుడైన తన భర్తను కూడా తన దేవుని వైపే మార్చుకునేలా చేసింది.ఇంకెందరినో మార్చాలని ప్రయత్నించి హతస్సాక్షురాలయింది.అయితే,దేవుడు మానవ జీవితానికి రెండు దారులు చూపించాడు.
1.కుటుంబ జీవనం ద్వారా పరిశుద్ధంగా జీవించి దేవుని చేరుకోవడం.
2.కన్యకగా పరిశుద్ధంగా జీవించి దేవుని చేరుకోవడం.
సాధారణ కుటుంబంలో పుట్టినా,ఉన్నత కుటుంబాల్లో పుట్టినా,వివాహం అనే ఒక బంధాన్ని ప్రభువు ఏర్పాటు చేశాడు.దాని ప్రకారం,తన దేవుని ఆరాధిస్తూ అన్యుని,అన్యురాలిని వివాహం చేసుకోకూడదు. దీనికి దేవుడు రెండు ఉదాహరణలు ఇచ్చాడు.
1. ఆదికాండము 6 : 2 లో,దేవుని కుమారులు, నరుల పుత్రికల సౌందర్యం చూచి వారిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు.దేవుని కుమారులంటే, దేవుని మాట విని నడిచేవారు.నరుల కుమార్తెలంటే లోక సాంప్రదాయం ప్రకారం నడిచేవారు.అసలు విషయం ఏంటంటే,దేవుని కుమారులు అన్యులను, అన్యురాండ్రను వివాహం చేసుకోకూడదు.ఒకవేళ చేసుకుంటే వాళ్ళు తమ దేవుని ఆరాధించాలి.
2.ఆదికాండం 34 : 15,16,17 వచనాలలో,సున్నతి ఆచరించని వారికి అంటే, తన దేవుని ఆరాధించని వారికి తమ పిల్లలను ఈయకూడదు. ఇది దేవుని నియమము.అయితే,లోక సాంప్రదాయం దీనికి భిన్నంగా ఉంది .ఆ సాంప్రదాయం ఏంటంటే,మంచిగా బ్రతికిస్తే చాలు. ఏ మతం అయితే ఏంది ? అనే భావనతో అన్యుల పిల్లలను వివాహం చేసుకో వడం, అన్య మతస్తుల కుమారులను వివాహం చేసుకోవడం జరుగుతుంది.దీనికి ప్రభువు ఏమంటున్నాడంటే,దర్శన గ్రంథము 3 : 14 15 16 17 వచనాలలో లవొదొకియ సంఘాన్ని ప్రస్తావిస్తూ,నీవు చల్లగానైనను,వెచ్చగానైనను ఉండుట మేలు.అంటే,నీ దేవుని వైపు అన్నా ఉండాలి. లేదా దయ్యం వైపు అయినా ఉండాలి.అలా ఉండకపోతే నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను.యావే దేవుని పూజించని అన్యులు దేవుని పిల్లలు కారు, అనేదానికి పై ఉదాహరణలు అద్దం పడుతున్నాయి.
ముగింపు :
లోకంలో దేవుడు సూచించిన మార్గం సరైనదే.కాని,ఆ మార్గాన నడవడం మనుషులకు కష్టంగా ఉంది.కాని ,సిసీల్యమ్మ గారు మాత్రం తన దేవుని మార్గాన్ని గుర్తించి, ఆ మార్గంలోనే నడవడానికి సిద్ధపడింది.పునీతులాలిగా ముద్ర వేయబడింది.ఆమెలాగా దేవుని కొరకు తన హృదయాన్ని పరిచేవారు ఎందరున్నారు?తన దేవుని కొరకు హారతిగా వెలిగే వారు ఎందరున్నారు?ఆత్మార్పణే పూమాలగా చేసి ఆ దేవుని పాదాల చెంత వేసేవారు ఎందరున్నారు?మరొక హృదయ దీపాన్ని వెలిగించాలని, తన వెలుగును పంచే వాళ్ళు ఎందరున్నారు?హేబేలు రక్తము భూమిలో నుండి తన దేవునికి మొరపెట్టినట్లే,మీ రక్తము లోకానికి క్రొత్త ఊపిరిని అందించింది.మీరు ఆ లోకానికి వెళ్లి ఆనందాన్ని పొందుతున్నారు.ఈనాడు మీ త్యాగాన్ని స్మరించుకుంటూ మేము, ఈ లోకంలో ఆనందాన్ని పొందుతున్నాము.మీ సేవకై, మీ ఆత్మార్పణకై నీకు చేతులెత్తి నమస్కరిస్తూ మిమ్ము స్మరించుకుంటున్నాము.మేము వచ్చేదాకా మాకోసం ఎదురు చూస్తూ ఉండండి.దేవుని పక్షాన నిలబడి మా కోసం ఆహ్వానం పలకండి.చివరగా,సిసీల్యమ్మగారి జీవిత చరిత్ర ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే,
1. అన్యులతో జీవితం,సహవాసం మన దేవునికి మనల్ని దూరం చేస్తుంది.
2.ఆ దారిలోనే వెళితే మన దేవుని నుండి మనము తోసి వేయబడతాము.
అందుకే,ఆ ఊబిలో చిక్కుకొనకుండ,అన్యుడైన తన భర్తను తన దేవుని వైపు మార్చుకుంది.సమస్త సృష్టి ప్రదాత అయిన దేవుడు ఆమెలాగే మనందరిని నడిపించి కాపాడునుగాక.
