"శిష్య లక్షణం - త్యజింపు"

జోసెఫ్ అవినాష్
04 Nov 2025
సామాన్య 31వ బుధవారం
రోమీ 13:8-10
కీర్తన 112:1-2,4-5,9
లూకా 14:25-33
ధ్యానం:
తల్లిదండ్రులను గౌరవించాలని, మన బాధ్యతలను గుర్తు చేసిన ప్రభువే నిజంగానే, తల్లిదండ్రులను,భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను,అక్కచెల్లెండ్రను,చివరికి ప్రాణాన్ని కూడా త్యజించాలని చెప్పడంలోని అంతరార్థం ఏమిటి? దేవుని కంటే గొప్పగా ఈ లోకంలో మరేదీ ఉండకూడదు.మన దృష్టి ఆయన పైనే ఉండాలి.ఆయనే సమస్తంగా స్వీకరించాలి. ఆయన శిష్యునిగా అనుసరించడానికి ఎలాంటి ప్రతి బంధకాలు ఉండకూడదు. ప్రాణార్పణకైనా సిద్ధపడి ఉండాలి.దేవునికి తొలి ప్రాధాన్యం ఇచ్చే వారిగా ఉండాలి.దైవ రాజ్యం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టగలగాలి.అలాని మన బాధ్యతలను విస్మరించమని ప్రభువు చెప్పడం లేదు. దేవుడు మనకు అప్పగించిన పనికి, ఇతర అడ్డుగోడలు ఉండకూడదని అర్థం చేసుకోవాలి.యేసు శిష్యులుగా జీవించే వారికి ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. బాధ్యత నిర్వహణకై ఎల్లప్పుడూ తపించాలి.కార్యదీక్షతో పనిచేయాలి.కాబట్టి కుటుంబ బంధాలతో దేవుని కార్యం నిర్లక్ష్యం చేయకూడదన్న భావాన్ని, యేసుప్రభు బోధనలో మనం నేర్చుకుంటున్నాం. కుటుంబ ధర్మంలో జీవిస్తున్న వారు, వారికి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. పిల్లలను బాధ్యతాయుతంగా పెంచాలి.భయభక్తులతో పెంచాలి. దేవుని దృష్టిలో ప్రయోజకులను చేయాలి.క్రీస్తు సేవా బాధ్యతలను స్వీకరించిన వారు సమస్తాన్ని త్యజించి, పరలోక రాజ్యం నిమిత్తం తమను తాము సమర్పించుకోవాలి.యేసుక్రీస్తు వలే సువార్త సేవకే తమ జీవితాలను అంకితం చేసుకోవాలి.కాబట్టి శిష్య లక్షణం సంపూర్ణ పరిత్యాగం అని నేర్చుకుంటున్నాం. శిష్యులుగా పిలువబడిన వారు, తమ స్వప్రయోజనాలపై శిష్యరికాన్ని వాడుకోరాదు. దేవుని మహిమకై తమ జీవితం ఉండాలి. కాబట్టి మన అంతస్తుకు తగిన విధంగా మనం జీవించాలని నేర్చుకుందాం.
