దేవుడు ఎటువంటి బేధాలు చూపించడు

జోసెఫ్ అవినాష్
08 Oct 2025
సామాన్య 27వ గురువారం
సువిశేష ధ్యానం:
లూకా 11:5-13
అడుగుడి మీకు ఒసగబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అను ఈ వచనాలను ఈనాటి సువిశేష పఠనములో మనము చూస్తున్నాము.యేసుప్రభువు తండ్రి దేవుని కనుల ముందర అందరూ సమానులే.దేవుడు ఎటువంటి బేధాలు చూపించడు అని యేసుప్రభువు మనకు తెలియపరుస్తున్నారు.
యేసుప్రభువు తన ప్రార్ధనను ముగించిన తరువాత ఆయన శిష్యులు వారికి ఏ విధంగా ప్రార్థించాలో నేర్పించమని అడిగినప్పుడు యేసుప్రభువు వారికి పరలోక ప్రార్థనను నేర్పించారు.ఆ తరువాత ఆ ప్రార్ధన సారాంశాన్ని వారికి అర్థమయ్యే విధంగా తెలియపరిచారు.మనము మన బిడ్డలను ఏ విధంగానైతే ప్రేమిస్తూ ఉంటామో, తండ్రి దేవుడు కూడా మనలనందరినీ అదే విధంగా సమానంగా ఎటువంటి బేధాలు లేకుండా ప్రేమిస్తూ ఉంటారు.తండ్రి దేవుని మనం ఏది అడిగినా కూడా మనకు సమకూరుస్తూ ఉంటారు.మనము ఎప్పుడైతే ఇటువంటి బంధాన్ని కలిగియుంటామో అప్పుడు తండ్రి దేవుడు తన పవిత్రాత్మ అభిషేకాన్ని మనపై కురిపిస్తూ ఉంటారు.
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిషత్తు బాగుండాలని వారి గురించి ఆలోచిస్తూ వారు అడిగిన ప్రతిదీ వారికి సమకూరుస్తూ ఉంటారు.తల్లిదండ్రులు ఏది చేసినా కూడా బిడ్డల భవిషత్తు బాగుండాలనేది వారి తాపత్రయం.తమ చిన్న చిన్న ఆనందాలను వారి బిడ్డల ముఖంలో చూస్తూ సంతోషపడుతుంటారు.అదే విధంగా తండ్రి దేవుడు కూడా తన బిడ్డల సంతోషాన్ని కోరుకుంటూ వారి సంతోషంలో తన సంతోషాన్ని చూస్తూ ఉంటారు.
కాబట్టి ప్రియ సహోదరీ! సహొదరులారా! యేసుప్రభువు తన శిష్యులకు ప్రార్ధన నేర్పిన విధంగా,మనము తండ్రి దేవుని చెంతకు మనం పరిశుద్ధ హృదయాలతో వస్తూ ఉన్నామా లేదా అని ఆలోచించుకుందాం. దేవుడు మనలను అందరిని సమానంగా ప్రేమిస్తున్నారు.ఆ ప్రేమను అంగీకరించి జీవించుదాం.