క్రైస్తవుని జీవితం ప్రార్థనతో ముడిపడాలి

జోసెఫ్ అవినాష్
07 Oct 2025
సామాన్య 27వ బుధవారం
సువిశేష ధ్యానం:
లూకా 11:1-4
క్రీస్తుప్రభువారు తన రోజును ప్రార్ధనతో మొదలు పెడతారు ఎందుకు ప్రభువారు దైవస్వభావం వున్నప్పటికి ప్రార్థన చేస్తున్నారు అనగా ఆయన మానవస్వభావంతో ఉన్నారు. కావున ప్రార్ధన అనేది అవసరం.శోధనలు జయించడానికి ప్రభువారు నిరంతరం ప్రార్ధనలు చేస్తుండేవారు..
క్రీస్తుప్రభువారు వేకువ జామునే లేచి ప్రార్థనచేయడం, ఒంటరిగా ప్రార్థించడం ఈ విధంగా నిరంతరం ప్రార్థించి. తండ్రి నుండి ఎంతగానో శక్తిని పొంది ఈ లోకంలో ఎదురైయ్యే శోధనలను జయించగలిగారు. అది చూచి శిష్యులు కూడా మాకు ప్రార్ధన నేర్పించమనగా! పరలోక ప్రార్ధన నేర్పించడం జరిగింది.
ఈ పరలోక ప్రార్ధన అత్యున్నతమైన ప్రార్ధన. అన్ని అవసరాలు మిళితమైయున్న ప్రార్థన. ఈ ప్రార్థనతో దేవుణ్ణి తండ్రి అని సంబోధించమంటున్నాడు. సృష్టికర్త దేవుని పేరుపెట్టి పిలువకూడదు, తండ్రి అని మాత్రమే సంబోధించాలి.
ఆయన నామాన్ని మాత్రమే పూజించాలి. ఎందుకు ఆయన మనలను అనుదినం కంటికి రెప్పవలె కాపాడుతున్నారు నడిపిస్తున్నారు.
నిర్గమ 20:14 పైన ఆకాశంనందు గాని క్రిందన్న భూమియందుకాని, భూమి అడుగున్న నీళ్లయందుకాని ఉండు ఏ వస్తువు ప్రతిరూపంగాని విగ్రహమునుగాని మీరు నిర్మింపరాదు. పూజింపరాదు అని ప్రభు తెలియచేసారు. కావున ఆయన పవిత్ర నామమునే ఆరాధించాలి. ఆయనే ఏకైక దేవుడు.
మీ రాజ్యము వచ్చునుగాకా! ఆయన రాజ్యం అనగా నీతి, న్యాయములతో కూడిన రాజ్యం, ఆయన రాజ్యం ఎల్లప్పుడు మనతో ఉండాలని. మనం ప్రార్ధన చేయాలి. ఎందుకంటే మనలో నీతి, న్యాయము కరువైపోయాయి. మోసాలు, అన్యాయము, అక్రమాలు ఎక్కువైనాయి. వాటి ద్వారా మానవుడు ఎదగలేక పోతున్నాడు. బలవంతునిదే రాజ్యం అయిపోతున్నది. కావున నిరంతరం మన ప్రార్ధన ద్వారా అయన నీతి న్యాయం కలిగిన రాజ్యం ఇలలో రావాలని ప్రార్థించాలి.