జపమాలమాత పండుగ సందర్భంగా

ఫాదర్ గోపు ప్రవీణ్
06 Oct 2025
కతోలిక సంప్రదాయంలో, అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్ధనలలో జపమాల ఒకటి. మరియమాత మధ్యవర్తిత్వం ద్వారా, యేసుక్రీస్తు జీవితం, మరణం, పునరుత్థాణ పరమ రహస్యాలను లోతుగా ధ్యానిస్తున్నాం. ప్రార్ధనలలో శక్తివంతమైన ప్రార్ధన జపమాల.
అక్టోబరు 7న, కతోలిక విశ్వశ్రీసభ, దేవుని యెడల విధేయత, విశ్వాసం, అనుగ్రహం, ధన్యత కలిగిన “జపమాల మాత” పండుగను మనం ఎంతో భక్తిశ్రద్ధలతో, సంతోషంతో జరుపుకుంటున్నాము. జపమాల ప్రార్ధన శక్తిని, జపమాల భక్తి మాధుర్యాన్ని, అలాగే మన విశ్వాస ప్రయాణంలో మరియతల్లి నడిపింపును మనకు ఈ పండుగ తెలియజేస్తుంది. భక్తి మార్గాలలో జపమాల గొప్ప అందమైన, మధురాతి మధురమైన భక్తిమార్గం.
క్రైస్తవ కతోలిక విశ్వాసానికి సంక్షిప్త రూపమే జపమాల. ఈ విశ్వాసాన్ని తన హృదయం నిండా నింపుకున్న మహా ఘనురాలైన మరియమాత ద్వారా యేసు ప్రభువును చేరుకోగలిగే అద్భుతమైన మార్గం ఈ జపమాల.
పునీత అల్ఫోన్సస్ ది లిగోరి గారు చెప్పిన మాటలను గుర్తుకు చేసుకుందాం, “జపమాల భక్తి ప్రపంచానికి అపారమైన మేలు చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతోమంది పాపము నుండి విముక్తి పొందారు. పవిత్ర జీవితం గడపడానికి మార్గం ఏర్పరచింది. జపమాలను జపించేవారు, మంచి మరణంను పొందియున్నారు. జపమాలను హృదయపూర్వకంగా, మనస్సు లగ్నం చేసి చెప్పాలి” అని ‘ది గ్లోరీస్ ఆఫ్ మేరీ’ అనే తన ప్రసిద్ధ గ్రంథంలో స్పష్టంగా పేర్కొన్నారు. పునీత లిగోరి గారి ఉద్దేశ్యం ఏమిటంటే, జపమాల కేవలం కొన్ని పదాల పునరావృతం కాదు, అది క్రీస్తు జీవితంలోని ముఖ్యమైన రహస్యాల గురించి లోతుగా ధ్యానం చేయడంలో సహాయపడే ఒక శక్తివంతమైన ప్రార్థన. ఈ ధ్యానం ద్వారానే మనం మన జీవితాలను మార్చుకోగలుగుతాము మరియు దైవానికి మరింత దగ్గరవుతాము.
జపమాల భక్తి వలన కలుగుతున్న కొన్ని స్పష్టమైన ఉదాహరణలు మరియు ప్రయోజనాలను తెలుసుకుందాం:
1. పాపాల నుండి విడుదల: “ఉదాత్తమైన భక్తియైన జపమాల ద్వారా ఎంతోమంది పాపం నుండి విముక్తి పొందారు!” అని లిగోరి గారు పేర్కొన్నారు. జపమాల ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు, ఆ వ్యక్తి యొక్క మనస్సు క్రైస్తవ విశ్వాస రహస్యాలపై కేంద్రీకరిస్తుంది కనుక, పాపపు ఆలోచనలు, కోరికల నుండి దృష్టి మరలి, మానస్సాక్షి ప్రక్షాళనకు అవకాశం కలుగుతుంది. జపమాల పరిశుద్ధ జీవితానికి మార్గం. జపమాల ప్రార్థన మనలను పవిత్రమైన, దైవభక్తితో కూడిన జీవితం వైపు నడిపించడానికి సహాయపడుతుంది. దీనిని నిత్యం జపించేవారు పరిశుద్ధతలో వృద్ధి చెందుతారు అనేసి మన నమ్మకం.
2. శోధనలపై విజయం: జపమాల ప్రార్థన చేసేవారు దేవుని సహాయంతో శోధనల నుండి శక్తివంతంగా తమను తాము రక్షించుకోగలుగుతారు. పరిశుద్ధ మాత సహాయం కోసం చేసే ఈ ప్రార్థన, సాతాను యొక్క పన్నాగాలు, ప్రలోభాలనుండి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర వహిస్తుంది.
3. మరణ సమయంలో గొప్ప సహాయం: లిగోరి గారు, జీవితమంతా జపమాలను భక్తితో జపించేవారు తమ మరణ సమయంలో గొప్ప దయ పొందుతారని, మంచి మరణాన్ని పొంది రక్షింపబడతారని ప్రకటించారు. ఎందుకంటే, జపమాల అనేది పరిశుద్ధ మాత యొక్క కరుణ మరియు శక్తిని కోరే ప్రార్థన.
4. సమాజంలో ఆశీస్సులు: ఐక్యత - ఈ ప్రార్థనను ఒంటరిగా కాకుండా, ఇతరులతో కలిసి జపించడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కుటుంబాలు లేదా సంఘంతో కలిసి జపమాల జపించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు, శాంతి, ఐక్యతను పొందుతాము. శాంతి మరియు రక్షణ - జపమాల కేవలం వ్యక్తిగత భక్తి మాత్రమే కాదు, ప్రపంచానికి శాంతిని మరియు రక్షణను అందించడానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప సాధనం అని మన విశ్వాసం.
మరియమాత, పునీత యులాలియతో ఇలా చెప్పారు: “ఆదరాబాదరాగా, భక్తి, విశ్వాసం లేకుండా, యాభై మూడు పూసల జపమాలను జపించడం కంటే, నెమ్మదిగా, భక్తితో యాభై మూడు పూసల జపదండ చెప్పవలెను.” ఈ వాక్యంలో ఎంతో గొప్ప అర్ధం దాగి ఉంది: జపమాల యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ప్రార్థనలను యాంత్రికంగా పునరావృతం చేయడం కాదు. జపమాలలోని ప్రతి గురుతులో క్రీస్తు మరియు మరియమాత జీవితంలోని ఒక రహస్యంపై లోతుగా ధ్యానం చేయాలి. త్వరత్వరగా, హడావిడిగా, అశ్రద్ధగా, ఏకాగ్రత లేకుండా జపించడం వలన, ప్రార్థనను అర్ధవంతంగా జపించలేము. తద్వారా ఆ ప్రార్థన శక్తి మరియు ఆశీర్వాదం కోల్పోతాము. నెమ్మదిగా, ప్రతి పూస వద్ద ఆగి, ఆ రహస్యం గురించి ఆలోచించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మాత్రమే యేసుక్రీస్తు మరియు మరియమాత పట్ల మన ప్రేమ పెరుగుతుంది. ఏ ప్రార్ధన అయినను హృదయం నుండి చేయాలి. భక్తి, విశ్వాసం, ప్రేమతో ప్రార్ధన చేయాలి. ముఖ్యంగా జపమాలను, పశ్చాత్తాపం మరియు పరిశుద్ధత అనే ధ్యేయంతో జపించాలి.
“జపమాలను వల్లించడం వలన ప్రభువు జీవిత పరమ రహస్యాలను ధ్యానించేటట్లు ఆ వ్యక్తికి తోడ్పడుతుంది. ప్రభువుకు దగ్గరగా ఉన్న ఆ తల్లి దృష్టితో మనం ప్రభువును చూడగలం” అని ఆరవ పౌలు పోప్ గారు చెప్పారు. పోపు గారు జపమాల గురించి చేసిన ఈ వ్యాఖ్య చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. జపమాలను కేవలం ప్రార్థనల సమాహారంగా కాకుండా, క్రీస్తు జీవితాన్ని ధ్యానించడానికి ఉపయోగించే ఒక ‘క్రీస్తు కేంద్రిత పద్ధతి’గా వివరించారు. మరియతల్లి దృష్టితో క్రీస్తును చూడాలి. యేసు బాల్యం నుండి మరణం, పునరుత్థానం వరకు జరిగిన ప్రతి సంఘటనకు మరియమ్మ సాక్ష్యం. ఆయన తొలి నవ్వు, తొలి అడుగు నుండి సిలువపై ఆయన బాధ వరకు ఆమె హృదయంలో దాచుకుంది (లూకా 2:19). మనం జపమాల ధ్యానం చేస్తున్నప్పుడు, మరియమ్మ యొక్క పవిత్రమైన, నిస్వార్థమైన, లోతైన విశ్వాసం అనే ‘కళ్ళద్దాలతో’ క్రీస్తు జీవితాన్ని చూడాలి, ధ్యానించాలి. మరియమ్మ ప్రేమ ద్వారా క్రీస్తు శ్రమల విలువ, ఆయన వాత్సల్యం యొక్క లోతు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. జపమాల ఒక క్రీస్తు-కేంద్రిత అభ్యాస పాఠశాల. మరియమ్మ ఆ పాఠశాలలో మనకు మార్గదర్శకురాలు. ఆమెతో కలిసి మనం క్రీస్తు పరమ రహస్యాలను ధ్యానిస్తున్నాం.
జపమాల భక్తి ఎలా వచ్చింది?
క్రీ.శ. 13వ శతాబ్ద ప్రారంభంలో, మరియమాత తన స్వహస్తాల ద్వారా పునీత డొమినిక్ గారికి జపమాలను ఇచ్చి, ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయనకు తెలియజేశారు. ఈ సంఘటన జపమాల భక్తి ప్రపంచానికి లభించిన ఒక దైవ వరంగా పరిగణించబడుతుంది. పరిశుద్ధ మరియమాత ఈ లోకానికి ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక అస్త్రం, జపమాల! 13వ శతాబ్ద ప్రారంభంలో దక్షిణ ఫ్రాన్స్‌లో, అల్బిజెన్సియనిజం లేదా కాథారిజం అనే ఒక బలమైన విప్లవం శ్రీసభ యొక్క బోధనలను, ముఖ్యంగా క్రీస్తు యొక్క మానవత్వాన్ని మరియు దివ్యసంస్కారాలను తీవ్రంగా ప్రశ్నించింది. పునీత డొమినిక్ గారు ఈ విప్లవాన్ని లేదా కతోలిక విశ్వాస వ్యతిరేక సిద్ధాంతాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. ఆయన చేసిన ఉపదేశాలు, బోధనలు, వాదనలు ఆ విప్లవవాదులను మార్చడంలో పూర్తిగా విజయం సాధించలేకపోయాయి. పునీత డొమినిక్ గారు ఈ విప్లవం పట్ల నిరాశ చెంది, ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధ కన్య మరియమాత ఆయనకు ప్రత్యక్షమైంది. మరియమాత జపమాలను, పునీత డొమినిక్ గారికి స్వయంగా ఇచ్చి, ఈ ప్రార్థన యొక్క శక్తిని మరియు ప్రాముఖ్యతను తెలియజేశారు. జపమాల ఒక బోధనా సాధనంగా మరియు ఆధ్యాత్మిక ఆయుధంగా పనిచేస్తుందని మరియమాత ప్రకటించారు. తప్పుడు సిద్ధాంతాలలో చిక్కుకున్న సాధారణ ప్రజలకు కతోలిక విశ్వాస సత్యాలను స్పష్టంగా బోధించడానికి జపమాల ఒక గొప్ప మార్గం అయింది. పునీత డొమినిక్ గారు జపమాలను నమ్మకంతో బోధించడం ప్రారంభించిన తర్వాత, అనేక మంది తప్పుడు బోధనలకు దూరమై, తిరిగి కతోలిక విశ్వాసంలోకి వచ్చారు. ఈ విధంగా, జపమాల ఆ కాలంలో గొప్ప విజయాలను సాధించడానికి దోహదపడింది.
తల్లి శ్రీసభ కూడా ఈ జపమాలను జపించాలని నిత్యమూ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే, జపమాల ప్రార్థనలో మనం మొత్తం 20 దేవరహస్యాలను ధ్యానం చేస్తున్నాము - ఐదు సంతోష దేవరహస్యాలు, ఐదు దు:ఖ దేవరహస్యాలు, ఐదు మహిమ దేవరహస్యాలు, మరియు ఐదు వెలుగు దేవరహస్యాలు. ఈ దేవరహస్యాలద్వారా, క్రైస్తవులు క్రీస్తు అంటే ఎవరో, ఆయన మన కొరకు ఎందుకు వచ్చారో తెలుసుకుంటారు. క్రీస్తు బోధనలు, ఆయన ప్రేమ గురించి తెలుసుకుంటాం. అందుకే శ్రీసభ మరియమాత ద్వారా మనకు జపమాల ప్రార్థనను జపించమని ప్రోత్సహిస్తుంది. ఈ దేవరహస్యాల ధ్యానం ద్వారా మనం క్రీస్తు ప్రభువు గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఆయన జననము, మరణము, మనకోసం అనుభవించిన శ్రమలు, పునరుత్థానము, మోక్షారోహణము, పవిత్రాత్మ రాకడ, దివ్యసత్ప్రసాద స్థాపన వంటి ముఖ్య ఘట్టాలను ధ్యానిస్తాము. అదేవిధంగా, మరియమాతకు సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక ఘట్టాలను కూడా ఇందులో ధ్యానం చేయవచ్చు.
జపమాల మాత పండుగ ఆవిర్భావం
మరియమాతను జపమాల దేవరహస్యంగా కొనియాడడం అనేది, లెపాంటో (Lepanto) ఓడరేవు పట్టణం వద్ద జరిగిన మహాయుద్ధంలో క్రైస్తవులు ఘనవిజయం సాధించినందుకు జ్ఞాపకార్థంగా ఆరంభమైంది. క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య లెపాంటో ఓడరేవు పట్టణం సమీపంలో ఈ నావికా యుద్ధం సముద్రంలో జరిగింది. క్రైస్తవుల తరపున ఆస్ట్రియా రాకుమారుడు డాన్ జువాన్ నాయకత్వం వహించి యుద్ధం చేశారు. తనకు తక్కువ సైన్యం ఉన్నప్పటికీ, క్రైస్తవులు ఆ యుద్ధంలో 1571 అక్టోబర్ 7న ఘనవిజయం సాధించారు. కన్య మరియమాతయందు భక్తి, విశ్వాసం, నమ్మకం గల ఈ రాజు, మరియమాత మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నారు. కన్య మరియ మధ్యవర్తిత్వం ద్వారా సహాయం అర్థించి, ప్రార్థించి, జపమాలను జపిస్తూ పోరాటం సలిపి ఘనవిజయం సాధించారు. ఈ ఘనత ఆ దేవుని తల్లికే చెందుతుందని డాన్ జువాన్ ఉద్వేగంతో పేర్కొన్నారు. ఈ విజయం జ్ఞాపకార్థంగా, అప్పటి పోప్ ఐదవ పయస్ గారు ఈ జపమాల మరియమాత ఉత్సవాన్ని ప్రవేశపెట్టారు.
చరిత్రలో, జపమాల లెక్కలేనంత మందికి ఊరటను, ఓదార్పును దయచేసింది. ముఖ్యంగా, కష్టాలలో, దిక్కుతోచని స్థితిలో, పోరాట సమయాలలో, జపమాల ద్వారా మరియమాత మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించి ఎన్నో గొప్ప మేలులను పొందియున్నారు.
పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, “జపమాల నాకు ఇష్టమైన ప్రార్థన. ఇది దివిని-భువిని కలిపే ప్రార్థన. మరియమాతతో మనలను ఏకం చేస్తుంది. క్రీస్తు చెంతకు నడిచే మార్గంలో, ఆమె మన చేయి పట్టుకుని నడిపిస్తుంది” అని అన్నారు. వీరి మాటలలో అర్ధం ఏమిటంటే, జపమాల అనేది అత్యంత సాధారణమైన మరియు సులభమైన ప్రార్థన. దీనికి ప్రత్యేకమైన పుస్తకాలు లేదా జ్ఞానం అవసరం లేదు. కేవలం కొన్ని ప్రాథమిక ప్రార్థనలు మరియు ధ్యానం చేయాలనే నిబద్ధత ఉంటే సరిపోతుంది. పోప్ గారు దీనిని ఎంతగానో ప్రేమించడానికి కారణం, ఇది అందరికీ, పేదలకు, ధనికులకు, చదువుకున్న వారికి, చదువుకోని వారికి కూడా అందుబాటులో ఉండడమే. దివిని-భువిని కలిపే ప్రార్థన అని అన్నారు: జపమాలలోని రహస్యాల ద్వారా మనం యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, పునరుత్థాన మహిమను, పరిశుద్ధ మాత యొక్క స్వర్గారోహణ మరియు పట్టాభిషేకం వంటి సత్యాలను ధ్యానిస్తాం. ఇది మన దృష్టిని భూమిపై ఉన్న తాత్కాలిక విషయాల నుండి నిత్య సత్యాల వైపు మళ్లిస్తుంది. అలాగే, మనం జపించే ప్రతి మంగళవార్త జపంలో పాపాత్ములమై యుండెడు మా కొరకు, ఇప్పుడును, మా మరణ సమయ మందును ప్రార్థించండి” అని చెబుతాం. అంటే, మనం ఈ భూమిపై మన నిజమైన అవసరాల గురించి, మన పాపాల గురించి, మన అంతిమ గమ్యమైన మరణం గురించి ప్రార్థిస్తున్నాం. క్రీస్తు జననం, జీవితం, మరణం, పునరుత్థానం అనే దైవిక అంశాలను, మన రోజువారీ జీవితంలోని (భువి) కష్టాలు, సవాళ్లు మరియు నిరీక్షణతో (దివి) జపమాల ఏకం చేస్తుంది.
“మరియమాత మన చేయి పట్టుకుని నడిపిస్తుంది” అని అన్నారు, క్రీస్తు చెంతకు నడిచే మార్గంలో అనేక ఆధ్యాత్మిక సవాళ్లు ఉంటాయి. మరియమాత మన చేయి పట్టుకుని నడిపించడం అంటే, శోధనలలో ఆమె మనకు ధైర్యాన్ని, నిరీక్షణను మరియు భక్తిని కలిగిస్తుంది. క్రీస్తు ప్రేమను పొందుకోవడానికి ఆమె మనకు సురక్షితమైన, సరళమైన మరియు మార్గాన్ని చూపిస్తుంది.
అందుకే, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు, “పరిశుద్ధ జపమాల భక్తి గొప్పది, ఉన్నతమైనది, దైవికమైనది. అత్యంత కఠినమైన పాపులను మరియు మొండి పట్టుదల గల భిన్నాభిప్రాయ వాదులను మార్చడానికి స్వర్గమే దీనిని మీకు ఇచ్చింది” అని అన్నారు.
మరియ తల్లి ఎప్పుడు కూడా మనలను ప్రభువు చెంతకే నడిపిస్తుంది. పునీత యోహాను గారు వ్రాసిన సువార్త 2:5లో, “ప్రభువు తల్లి సేవకులతో, ‘ఆయన చెప్పినట్లు చేయుడి’ అనెను.” ఈ మాటల ద్వారా, జపమాల మాత సకల మానవాళికి ఏమి సందేశం ఇస్తున్నారో మనం అర్థవంతంగా తెలుసుకోవాలి. “క్రీస్తును వెంబడించండి! ఆయన చెప్పిన విధముగా జీవించండి! ఆయనను అనుసరించండి!” అనేది మరియతల్లి సందేశం. కానా పల్లెలో పెండ్లి విందు జరుగుతున్నప్పుడు, ద్రాక్షారసం తక్కువ పడినప్పుడు, యేసు తల్లి, కన్య మరియ, “వారికి ద్రాక్షారసం లేదు” అని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పారు. క్రీస్తు ప్రభువు అక్కడ ఉన్న ఆరు రాతి బానలలో నీటిని నింపమని సేవకులతో చెప్పగానే, మరియమాత సేవకులతో, “ఆయన చెప్పినట్లు చేయండి’ అని చెప్పారు. జపమాల మాత మనకు నిత్యమూ క్రీస్తు ప్రభువును అనుసరించమని చెబుతున్నారు. జపమాల మాత, క్రీస్తు ప్రభువునందు విధేయతతో, ఆయన చెప్పినట్లుగా జీవించమని, మనకు సందేశాన్ని ఇస్తున్నారు.
జపమాల మాత పండుగ జరుపుకుంటున్న మనమందరమూ, జపమాలను ధ్యానిద్దాం. జపమాల ధ్యానంలో, మనము కూడా జపమాల మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం:
1. అమ్మా, యేసు దేవుని మాతయైన జపమాల మాతా! మీ ప్రార్థన సహాయం ద్వారా మాకు కూడా పవిత్రత కలిగిన జీవితాలను ప్రసాదించండి.
2. దేవుని యందు ఆనందించే ఆత్మను, జపమాల ధ్యానం ద్వారా మాకు ఒసగండి.
3. దేవుని దాసులముగా జీవించే కృపను, మీ జపమాల ధ్యాన, ప్రార్థనా సహాయం ద్వారా మాకు అందించండి.
4. దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ, ఆయన కనికరం పొందుకునే ధన్యతను, జపమాల ధ్యానం ద్వారా మాకు ప్రసాదించండి.
5. జపమాల ధ్యానం ద్వారా మా దుష్టత్వమును, దురాలోచనలను పవిత్రపరచండి.
6. జపమాల ధ్యానం ద్వారా మాలో ఉన్న అహంకారమును కాల్చివేయండి.
7. జపమాల ధ్యానం ద్వారా మేమందరమూ దీనులమై జీవించే హృదయాలను మాకు దయచేయండి.
8. జపమాల ధ్యానం ద్వారా ఆపదలలో, అవసరతలలో ఉన్నవారికి సహాయం చేసే హృదయాలను మాకందరికీ దయచేయండి.
9. జపమాల ధ్యానం ద్వారా క్రీస్తు ప్రభువును అనుసరించే స్వభావమును మాకు దయచేయండి.
10. జగతికి జ్యోతులమై, మీ ప్రియ కుమారుడైన మా రక్షకునకు, పరమ తండ్రి దేవునికి ప్రియమైన వారసులమై జీవించి, పరమునందు నిత్యజీవమున ఆనందముతో మేమందరమూ జీవించే లాగున, జపమాల మాతా! మా కొరకు ప్రార్థించండి. మమ్ము క్రీస్తు మార్గములో నడిపించండి.
ప్రియ సహోదరీ, సహోదరులారా, మరియతల్లి బిడ్డలారా, జపమాలను ధ్యానించుకునే కుటుంబాలు ఎంతగా ఆశీర్వాదాలు పొందుకుంటాయో గ్రహించి, మన కుటుంబాలన్నీ అనుదినమూ జపమాలను ధ్యానిస్తూ, క్రీస్తు అనుసరణలో జీవించి, ఆ దేవాది దేవుని కృపను పొందుకొని, దేవుని ఆశీర్వాదములకు పాత్రులమై జీవించుదాం.
మన హృదయాలను ప్రభువు ప్రేమతో నింపే జపమాల ప్రార్థన యొక్క శక్తిని లోతుగా గ్రహిద్దాం. భక్తిశ్రద్ధలతో జపమాల ప్రార్థన ద్వారా మన విన్నపాలను మరియమాతకు తెలియజేద్దాం. అందరికీ మరోమారు జపమాల మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండుగా, మెండుగా దీవించి, కాచి కాపాడునుగాక. ఆమెన్!