క్రీస్తుతో ప్రయాణిద్దాం

జోసెఫ్ అవినాష్
16 Sep 2025
సామాన్య 24వ బుధవారం
1తిమోతి 3:14-16
కీర్తన 111:1-6
లూకా 7:31-35
ధ్యానం:
క్రైస్తవ జీవితం అంటే యేసుతో శిలువను తీసుకొని ముందుకు సాగడం.క్రీస్తు తనను తాను తగ్గించుకొని ఆయనే మనకు ఈ మార్గాన్ని చూపించారు. ఆయన దేవుడై ఉండి కూడా, తనను తాను తగ్గించుకొని మనందరికీ సేవకుడయ్యారు. మనలను రక్షించుటకు, ఆనందాన్ని ఇచ్చుటకు,మన జీవితాలను ఫలవంతం చేయుటకు ప్రభువు మనకు ఈ మార్గాన్ని చూపించారు.ఇది అహంభావ జీవితానికి విరుద్ధముగా జీవించమని ఆహ్వానం.మన స్వంత ప్రయోజనాల కోసం ఆరాటపడకుండా,పోరుగువాని శ్రేయస్సు కొరకై జీవించే మార్గం ఇదే క్రైస్తవ మార్గం. యేసు చూపిన ప్రయాణం క్రైస్తవ మార్గం ఖచ్చితంగా వినయం, సాత్వికం, సౌమ్యతతో కూడిన మార్గం.తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే వాడు దానిని పోగొట్టుకొనును అని ఈనాటి సువిశేష పఠనము తెలియజేస్తుంది.యేసును అనుసరించడం ఎంతో సంతోషకరమైన విషయము. అయితే యేసును అనుసరించాలనుకొనే వ్యక్తి యేసు చూపిన బాటలో నడవాలే కానీ ప్రపంచ గమనం ప్రకారం కాదు.ముఖ్యమైన విషయం ఏమిటంటే,దాతృత్వ స్ఫూర్తితో ఇతరులకు మన జీవితాన్ని ఇవ్వడానికి మన ప్రయాణం సాగించాలి.యేసుతో కలిసి మన సిలువ ప్రయాణం మనలను ఫలవంతులనుజేస్తుంది. లోకమంతయు సంపాదించి మన ఆత్మను,పరలోక స్వాస్థ్యాన్ని కోల్పోయిన ప్రయోజనమేమి? కాబట్టి మన క్రైస్తవ జీవితములో మన సిలువనెత్తుకొని యేను ప్రభునితో ప్రయాణించే శక్తిని ఒసగుమని ఆ దేవుని ప్రార్థించుదాం.