వ్యాకులమాత పండుగ

జోసెఫ్ అవినాష్
14 Sep 2025
'శోక సాగరం' వంటి లోకంలో మనకు బాసటగా నిలిచే 'భగవతి' మన మరియతల్లి, మరియతల్లి మన రక్షణార్ధం అవతరించి హింసితుడై మరణించిన యేసుక్రీస్తు బాధాతప్త జీవనంలో భాగస్వామిని ఏ క్షణంలో మరియతల్లి దేవుని పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తూ.వినమ్రురాలై- లోక రక్షకుడు క్రీస్తుప్రభువుకు జన్మనీయడానికి అంగీకరించిందో, ఆ క్షణంలోనే మరియతల్లి పరోక్షంగా- పతితులైన మానవుల ఆత్మలను రక్షించటానికి క్రీస్తు అనుభవించబోయే కఠోరమైన శ్రమలను తాను పంచుకోవటానికి సంసిద్ధురాలయ్యారు. ఈ సత్యాన్ని విశదీకరిస్తూ కతోలిక శ్రీ సభ సత్యోపదేశ గ్రంథం ఇలా ప్రబోధిస్తుంది:
"అనితరసాధ్యమైన వినయ శీలము, విశ్వాసము, మొక్కవోని ఆశాభావము, అపారమైన ప్రేమ భావము మూర్తిభవించిన మరియతల్లి పతిత మానవలోకానికి పారలౌకిక జీవ ప్రధానం చేయడంలో తన ప్రియ కుమారునికి బాసటగా నిలిచారు, లోక రక్షణ మహోద్యమంలో తాను భాగస్వామిని అయ్యారు; కుమారుడు లోకరక్షకుడు కాగా తల్లి సహరక్షకిగా వినతి గాంచారు "(కతోలిక శ్రీసభ సత్యోపదేశం; నం 968) అంటే దైవ విధేయురాలుగా మరియతల్లి స్వచ్ఛందంగా అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, జీవన దుఃఖం అన్ని యేసు అనుభవించిన శ్రమలతో కలిసి ఆయన సంకల్పించిన మానవోద్ధరణ మహాయజ్ఞంలో అంతర్భాగాలయ్యాయి; క్రీస్తుని మాతగా మరియతల్లి తన కుమారుని సిలువ చెంత నిలిచి అనుభవించిన కడుపుకోత వర్ణనాతీతమైనది. ఆ గడియలో మరియతల్లి అనుభవించిన శ్రమలను దేవుడు లోకరక్షా యజ్ఞంలో సమిధలుగా పరిగణించాడు; ఆ రక్షకుని మాత రాల్చిన అశ్రుధారలను అమూల్యమైనవిగా భావించారు. ఆ మాతృమూర్తి శోకానికి రక్షాప్రదాయకమైన పరమార్ధాన్ని కల్పించారు. దేవుని తల్లి అంటే ఇతర మత గ్రంధాలను పరిశీలన చేస్తే ఎంతో ఆనందోత్సాహాలతో నిత్యం సేవలు చేయించుకుంటూ ఎటువంటి చీకూచింతా లేకుండా ఉంటుంది. కానీ మరియతల్లి జీవితం ఇందుకు పూర్తి వ్యతిరేకం. ఆ తల్లి సేవలు చేయించుకోలేదు ప్రతిగా సేవలు చేశారు; ఆ తల్లి ఆనందోత్సాహాలను అనుభవించలేదు ప్రతి గా క్రీస్తు శ్రమలను సంతోషంగా అనుభవించారు. మరియతల్లి శ్రమల అనుభవించటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి.
మొదటి కారణం-:
క్రీస్తును కన్నతల్లి గనుక మరియతల్లి కష్టాల పాలయ్యారు. తన కుమారుడు సిలువపై మరణ వేదనను అనుభవించడాన్ని కళ్ళారా చూసి తాను ఊపిరిపోసిన తనయుడు తన కన్నుల ముందే విగతజీవుడవుతూ ఉంటే అలవి కాని దుఃఖ భారంతో మరియతల్లి విలవిలలాడారు. ఆ తరుణంలో ఆ కలువరి గిరి పై క్రీస్తు సిలువ నీడన మరికొందరు పుణ్య స్త్రీలు కూడా ఉన్నారు. వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. కానీ వారు అనుభవించే ఆవేదనతో, తల్లిగా మరియ అనుభవించే గర్భశోకాన్ని సరిపోల్చడం సాధ్యం కాదు. కరుణతో కార్చే కన్నీరు వేరు, గుండె పగిలి రాల్చే రక్తకన్నీరు వేరు. అభం, శుభం ఎరుగని తనయుడు అన్యాయంగా సిలువ శిక్ష అనుభవిస్తూ నిస్సహాయంగా మరణిస్తుంటే అశక్తురాలైన ఒక తల్లి పడే ఆవేదనను దేనితో సరిపోల్చగలం? క్రీస్తుని మరణ గడియల్లో మరియతల్లి అనుభవించిన బాధను వర్ణించటానికి మాటలు చాలవు.
రెండవ కారణం-:
మరియమాత శ్రమల అనుభవించటానికి ఆమె చేసినపాపాలు కారణం కాదు.ఆమె జన్మపాపరహితోద్భవి, కళంకం లేని కరుణామయి. గనక తన పాపాల పరిహారార్ధం శ్రమలు అనుభవించవలసిన అవసరం ఆ పుణ్య తల్లికి లేదు. మరి మరియతల్లి అంతటి ఘోరమైన శ్రమలను, కష్టనష్టాలను భరించటానికి కారణం ఏమిటి? దానికి కారణం పాపులమైన మనమే. అవును మానవులమైన మనం చేసిన పాపాలకు పరిహారం కోసమే క్రీస్తు ప్రభువుతో పాటు మరియతల్లి సైతం కష్టాలు అనుభవించవలసి వచ్చింది. మరియతల్లి మనకోసమే శ్రమలు అనుభవించారు.
మరియతల్లి అనుభవించిన 7 దు:ఖ పూరితమైన మరియు బాధతో
కూడిన సంఘటనలను "వ్యాకులమాత"పండుగ ద్వారా మన కతోలిక శ్రీసభ మనందరికీ గుర్తు చేస్తుంది. మరియతల్లి యొక్క
హృదయము మీద ఉన్న ఆ ఏడు ఖడ్గములు మరియతల్లి అనుభవించిన బాధలకు నిదర్శనం. మరియతల్లి అనుభవించిన 7 దుఃఖ పూరితమైన సంఘటనలు:
1. సిమియోను క్రీస్తుప్రభువు యొక్క భవిష్యత్తును, మరియు ఆ భవిష్యత్తులో వచ్చే శ్రమలను గూర్చి చెప్పినప్పుడు.
2. దేవదూత కలలో కనిపించి,"శిశువును చంపుటకు హేరోదు రాజు వెదక బోవుచున్నాడు. కావున నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు అని దేవదూత పునీత జోజప్ప గారికి చెప్పినప్పుడు.
3. యెరూషలేము ఆలయములో ప్రభువు తప్పిపోయినప్పుడు.
4. సిలువ మార్గములో ప్రభువును చూసినప్పుడు.
5. ప్రభువును సిలువ వేసినప్పుడు.
6. ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని సిలువ మీద నుండి దించి మరియతల్లి యొక్క ఒడిలో పెట్టినప్పుడు.
7. ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని భూస్ధాపనము చేసినప్పుడు.