వినయము కలిగి జీవించాలి.

ఫాదర్ గోపు ప్రవీణ్
30 Aug 2025
22 వ సామాన్య ఆదివారము, YEAR C
సీరా. 3:17-20, 28-29;
హెబ్రీ. 12:18-19, 22-24;
లూకా 14:1, 7-14
క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా, నేడు మనం 22వ సామాన్య ఆదివారాన్ని కొనియాడు చున్నాము. నేటి ప్రధాన సందేశం, మనం వినయము కలిగి జీవించాలి.
మనం సాధారణముగా అధికారాన్ని కాంక్షిస్తాం. సర్వం మన ఆధీనములో ఉండాలని ఆశిస్తాం. ఇతరులకన్న తగ్గకుండా ఉండాలని, ఆధిక్యములో ఉండాలని అనుకుంటాం. మనలో ఉన్నటువంటి ఈ గర్వం, వలన మన జీవితములో ముందుకు కొనసాగలేక పోతూ ఉంటాము. క్రైస్తవ జీవితానికి వినయము (వినమ్రత, తనను తాను తగ్గించుకొనుట) ఎంతో ముఖ్యమైన సుగుణము. ఈ సుగుణాన్ని మనం ప్రభువునుండి నేర్చుకోవాలి. “సాధు శీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నానుండి నేర్చుకొనుడు” అని మత్త 11:29లో ప్రభువే స్వయంగా చెప్పారు.
వినయము అనే సుగుణము క్రీస్తు శిష్యరికానికి తప్పనిసరిగా ఉండాలి. ఈ సుగుణముపైనే, ఇతర క్రైస్తవ సుగుణాలన్నీకూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి, మనం ముందుగా వినయము అను సుగుణాన్ని అలవర్చుకోవాలి. దేవునిపట్ల వినయ వినమ్రతలను కలిగియుండాలి. మన సమాజములో అణచివేయ బడినవారిని, పేదవారిని ఆదరించాలి. ధనవంతులు దేవునిపట్ల వినయాన్ని కలిగియుండటము చాలా కష్టము. ఎందుకన, వారి స్వంత బలముపై, భద్రతపై ఆధారపడుతూ ఉంటారు.
నేటి మొదటి పఠనము, సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము నుండి వింటున్నాము. ఈ గ్రంథాన్ని యేసు బెన్ సిరాకు అనే ఒక యెరూషలేం పండితుడు, జ్ఞాని రచించాడు. ఆయన యేసుక్రీస్తుకు సుమారు 200 సంవత్సరాల ముందు జీవించాడు. ఈ గ్రంథం హీబ్రూ గ్రంథాలలో ఒక భాగం. ఇందులో నైతిక విలువలు, జ్ఞానపూరిత సూక్తులు ఉంటాయి. నేటి పఠనంలో, జ్ఞాని తన శిష్యులకు వినయముగూర్చి, “కుమారా! నీవు చేయు పనులన్నిటను వినయముతో మెలుగుము. బహుమతులిచ్చు వానికంటె గూడ వినయవర్తనుని నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు” అని భోదిస్తున్నాడు. వినయంగా ఉండేవారికి దేవుని దయ లభిస్తుందని, సమాజంలో కూడా వాళ్లకు గౌరవం దక్కుతుందని ఈ వాక్యం చెబుతుంది. అంటే, మనం వినయంగా ఉంటే, దేవునికి ఇష్టులము అవడమే కాకుండా, ఇతరులు కూడా మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు.
ఈవిధంగా, నేటి మొదటి పఠనంలో, రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి: ఒకటి, వినయం, గ్రంధకర్త బెన్ సిరాకు మనల్ని వినయంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు. మన వ్యవహారాలలో మనం వినయాన్ని చూపిస్తే, నిజమైన గొప్పతనాన్ని పొందుతామని దీని అర్ధం. “నీ కార్యములను వినయముతో జరిపించుము, ఎంత ఎక్కువ వినయమును చూపితే అంత గొప్పవాడవు అగుదువు” అని అంటున్నాడు. మనం దేవుని ముందు పాపులమని, ఆయన సృష్టిలో ఒక భాగమని మనం ఒప్పుకోవాలి. అప్పుడే మన పరిమితులను మనం గ్రహించగలం. ఇక రెండవది, వినయానికి అసలైన అర్థం, వినయంగా ఉండటం అంటే మనలోని ప్రతిభను, శక్తిని నిరాకరించడం కాదు. దేవుడు మనకు ఇచ్చిన బహుమతులు, సామర్థ్యాలు ఆయన నుంచే వచ్చాయని గుర్తించి, వాటిని ఆయన చిత్తానుసారం ఉపయోగించుకోవడమే అసలైన వినయం.
సామెతలు 11:2లో ఇలా చదువుచున్నాము, “పొగరు బోతునకు అవమానము తప్పదు. వినయవంతునకు విజ్ఞానము అలవడును.” యాకోబు లేఖ 4:6లో ఇలా చదువుచున్నాము, “దేవుడు అహంకారులను ఎదిరించును. వినమ్రులకు క్రుపను అనుగ్రహించును” (1 పేతు 5:5).
వినయం అంటే ఏమిటి?
వినయం (Humility) అనే పదం లాటిన్ భాషలోని ‘humus’ అనే పదం నుంచి వచ్చింది. ‘humus’ అంటే “సారవంతమైన నేల” లేదా “మట్టి” అని అర్ధం. ఈ పదం సూచించే విధంగా, వినయంగా ఉండటం అంటే ‘మనలోని ప్రతిభ, సామర్థ్యాలు, పరిమితులు, మరియు బలహీనతలు అన్నింటినీ ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించే మనస్తత్వం’. వినయం అంటే మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం కాదు. అది యేసు వలె, మన స్వార్థం కోసం కాకుండా, ఇతరుల కోసం జీవించడం. గర్వం అన్ని పాపాలకు మూలమైనట్లే, “వినయం అన్ని సద్గుణాలకు మూలం, తల్లి, పోషణ, పునాది మరియు బంధం” అని పునీత జాన్ క్రిసోస్టమ్ పేర్కొన్నారు.
వినయము అనేది మన ముఖ కవలికలో ప్రదర్శించెడిది కాదు. వినయము అనేది మన మాట, నడక, వస్త్రధారణ కాదు. వినయము అనేది కేవలం భౌతిక వ్యక్తీకరణ కాదు. వినయము అనగా బలహీనత కాదు. వినయం అంటే శక్తి లేకపోవడం కాదు. వినయం నిజానికి గొప్ప ఆధ్యాత్మిక బలం. ఇది మన స్వంత బలాలను కాకుండా దేవుని శక్తిని నమ్ముకునేలా చేస్తుంది.
వినయం మనస్సు, హృదయం యొక్క అంత:ర్గత లక్షణం. అది మన పరిమితులను గుర్తించి, అంగీకరించడానికి సహాయపడుతుంది. ఫిలిప్పీ 2:3లో పునీత పౌలుగారు ఇలా అంటున్నారు, “స్వార్ధముతోగాని, అహంభావముతోగాని ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటె అధికులుగా భావింపుడు”. వినయము అనగా స్వసేవగాక, ఇతరులకు సేవ చేయడము. దైవభక్తుని యొక్క సుగుణము వినయము. ఒక వ్యక్తి ఎంత గొప్పగా ఉండాలని కోరుకుంటాడో, అంతగా వినయాన్ని అలవర్చుకోవాలి. మనలో వినయమున్నప్పుడే, మనం ఏమిటో తెలుసుకోగలము. తద్వారా, మనలను మనం దేవునికి అర్పించుకొనగలం.
పునీత అగుస్తీనుగారు ఏమన్నారంటే, ‘పరలోకానికి నిజమైన, సురిక్షితమైన మార్గము వినయము’ అని. అలాగే, “వినయం మనుషులను దేవదూతలుగా చేస్తుంది, గర్వం దేవదూతలను దెయ్యాలుగా చేస్తుంది” అని అన్నారు. పునీత బెర్నార్డ్ గారు ఇలా అన్నారు, “గర్వం మనిషిని అత్యున్నత శిఖరం నుండి అగాధమైన పాతాళానికి పంపుతుంది, కానీ వినయం అతడిని అగాధమైన పాతాళం నుండి అత్యున్నత శిఖరానికి తీసుకువెళ్తుంది.” “మనలను మనం మోసము చేసుకోకూడదు. మనలో వినయము లేనిచో, ఏదియు లేనట్టే” అని పునీత విన్సెంట్ ది పౌల్ గారు అన్నారు. వినయము అనగా మనలను మనం కించపరచుకోవడము కాదు, అవమాన పరచుకోవడము కాదు. C.S. లూయిస్ ఇలా అన్నారు, వినయం అంటే, “తాను తక్కువ అని అనుకోవడం కాదు, తన గురించి తక్కువగా ఆలోచించడం” అని. దీని అర్ధం ఏమిటంటే, మనం ఎప్పుడూ మన గొప్పతనం గురించి, మన విజయాల గురించి, లేదా మనకున్న లోపాల గురించి ఆలోచిస్తూ ఉండకుండా, ఇతరుల అవసరాలు, వారి భావాలు, వారికి సహాయం చేయడం గురించి ఎక్కువ ఆలోచించడం. ఇది మన దృష్టిని “నేను” అనే దాని నుండి “ఇతరులు” అనే దాని వైపు మళ్లిస్తుంది. థామస్ మెర్టన్ గారు గర్వం గురించి ఇలా అన్నారు, “గర్వం మనల్ని కృత్రిమంగా మారుస్తుంది, వినయం మనల్ని నిజమైనవారిగా చేస్తుంది.” గర్వం మనల్ని కృత్రిమంగా మారుస్తుంది. ఎందుకంటే, అది మనల్ని మన నిజమైన రూపం కాకుండా, ఇతరుల మెప్పు కోసం ఒక అబద్ధపు ముసుగును ధరించేలా చేస్తుంది. ఆ ముసుగు మనలోని భయాలు, బలహీనతలు, అభద్రతలను కప్పిపుచ్చడానికి ఉపయోగపడుతుంది. వినయం గర్వానికి పూర్తి విరుద్ధం. వినయంతో మనం మనల్ని మనం ఎలా ఉన్నామో అలా అంగీకరిస్తాం. మన బలాలు, బలహీనతలు రెండింటినీ మనం తెలుసుకుంటాం. వినయం మనలో ఉన్నప్పుడు, ఇతరుల ముందు మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది మన నిజమైన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా చేస్తుంది. అందుకే, వినయం మనల్ని నిష్కపటమైనవారిగా (నిజమైనవారిగా) మారుస్తుంది.
నేటి రెండవ పఠనము, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖనుండి వింటున్నాము. మొదటి శతాబ్దం చివరిలో వ్రాయబడింది. ఆ సమయానికి చాలామంది అపోస్తలులు మరణించారు. యేసు తిరిగి వస్తారని ఆశించిన ‘రెండవ రాకడ’ ఇంకా జరగలేదు. దీనివల్ల యూదులు, రోమన్ల నుండి వేధింపులు ఎదుర్కొంటున్న కొంతమంది యూదు-క్రైస్తవులు (యూదుల నుండి క్రైస్తవులుగా మారినవారు) విశ్వాసంలో బలహీనపడ్డారు. ఈ పరిస్థితిలో, రచయిత వారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాడు. ఆయన పాత ఒడంబడికను, క్రొత్త ఒడంబడికను పోలుస్తున్నాడు. పాత నిబంధనలో భయపెట్టే దేవుని చిత్రం ఉంటే, క్రొత్త నిబంధనలో ప్రేమ, వినయం గల దేవుడు క్రీస్తు రూపంలో మనకు కనిపిస్తారు.
అలాగే, ఈ పఠనం మనల్ని యేసు యొక్క వినయాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తుంది. యేసు దేవుని ప్రియమైన కుమారుడు. అయినప్పటికీ, ఆయన మానవ రూపములో జన్మించి, మన పాపాలను భరించడానికి అవమానకరమైన మరణాన్ని ఎంచుకున్నారు. అంటే, సమాజంలో మనకంటే తక్కువ అదృష్టవంతులుగా ఉన్నవారి పట్ల మనం దయ, వినయం చూపాలి. యేసు యొక్క ‘చిలకరించబడిన రక్తం’ మనందరినీ రక్షించింది. ఆయన మనందరి కోసం తనను తాను తగ్గించుకున్నారు. ఆయనలాగే మనం కూడా ఇతరుల కోసం మనల్ని మనం త్యాగం చేసుకోవడానికి, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి మన కరుణను, శ్రద్ధను చూపించడానికి పిలువబడ్డాం. మనల్ని మనం తగ్గించుకుంటే, యేసుతో కలిసి మనం కూడా పునరుత్థానంలో గొప్ప స్థానానికి హెచ్చింపబడతాము.
ఈనాటి సువిషేశములోని క్రీస్తు భోదనా సారాంశంకూడా వినయము. “ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిధులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను (లూకా 14:7). స్వార్ధముతో, గర్వముతో, మొండితనముతో ఉన్న వారికి ముఖ్యముగా, పరిసయ్యులకు, ధర్మశాస్త్రబోధకులకు వినయము గూర్చి ప్రభువు ఈ ఉపమానము ద్వారా బోధిస్తున్నారు. అలాగే, ఈ బోధన మనందరికీ కూడా వర్తిస్తుంది.
“పరిసయ్యులు” అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ‘నియమాలను కఠినంగా పాటించేవారు’, యేసుక్రీస్తు ఏదైనా తప్పు చేస్తాడేమో అని వెతుకుతూ ఉండేవాళ్లు. అయితే, ఈ రోజు మనం గమనిస్తే, వారి అసలు సమస్య అది కాదని తెలుస్తోంది. నియమాలను పాటించడం కంటే, వారికి ఉన్నతమైన, ప్రత్యేకమైన స్థానం అంటే చాలా ఇష్టం అని అర్ధమగుచున్నది. వారు తప్పులు చేయనివారుగా, అన్ని నియమాలు తెలిసినవారుగా తమను తాము భావించుకొని గర్వపడ్డారు. ఈ గర్వం వారిని ఇతరుల నుండి వేరు చేసింది, దానివల్ల వారు తమను తాము గొప్పవారిగా చూసుకున్నారు. ఈ ప్రత్యేకమైన స్థానం, మరియు దాని నుండి వచ్చే గర్వమే వారిలో అసలైన సమస్య. ఈ గర్వమే వారిని క్రీస్తును అర్థం చేసుకోకుండా అడ్డుకుంది.
దేవుని రాజ్యము అనగా, పరిపూర్ణమైన సంఘము. ఈ సంఘము అనేకసార్లు విందుతో పోల్చబడినది. దైవరాజ్యము అనే ఈ విందుకు అందరూ ఆహ్వానితులే. విందుకు వచ్చిన వారు మొదటి స్థానాలలోకాక, చివరి స్థానాలలో కూర్చోవాలని ప్రభువు చెప్పియున్నారు. అప్పుడు, ఆహ్వానించిన వ్యక్తి, ఎవరి అర్హతను బట్టి వారికి చెందిన స్థలాలను వారికి ఇవ్వగలడు. ఇతరులచేత నిరాకరించబడిన వారిని గౌరవించాలనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అప్పుడే ప్రభువు ఆశీర్వాదాలు మనపై తప్పక ఉంటాయి. దేవుని రాజ్యములో ధనికులని, పేదవారని, ప్రాంతాలవారని, జాతులవారని, కులాలవారని, భాషలవారని భేదాభిప్రాయాలు ఉండవు. ఈ రాజ్యములో ప్రవేశించాలంటే, వినయము అనే సుగుణమును కలిగి యుండాలి.
మనం తరచుగా మనకు సౌకర్యంగా ఉండే వాళ్లతో, మనలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లతోనే కలిసి ఉంటాం. ‘మనవాళ్ళు’ అనుకున్నవారిని మాత్రమే మన చుట్టూ చేర్చుకుంటాం. కానీ, యేసు వేరేవిధంగా ఆలోచించమని సవాలు చేస్తున్నారు. దేవుని రాజ్యం అందరికీ ఆహ్వానం ఉన్న చోటు. అక్కడ అందరికీ సమానమైన స్థానం ఉంది. ఎవరూ తక్కువ కాదు. మనం దేవుని రాజ్యంలో చేరినప్పుడు, మనం ప్రేమించిన వారితోనే కాకుండా, మనం ఇష్టపడని వారితో కూడా కలిసి ఉంటామని, ఇది మనల్ని ఆశ్చర్యపరుస్తుందని ప్రభువు సూచిస్తున్నారు. అక్కడ మనల్ని వేరు చేసిన అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. మతం, కులం, ఆర్థిక స్థితి, సామాజిక స్థాయి... ఇవన్నీ లేకుండా అందరూ కలిసి ఉంటారు. కనుక, నేటి సువార్త నిజంగా మన కళ్ళను తెరిపిస్తుంది.
అయితే ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని రాజ్యాన్ని నిర్మించడం అనేది కేవలం భవిష్యత్తులో జరిగేది మాత్రమే కాదు, అది మనం ఇప్పుడు, ఇక్కడే ప్రారంభించాల్సిన కార్యం. మన చుట్టూ ఉన్న ప్రజలను, అందరినీ సమానంగా చూడాలి, ఆదరించాలి. ఇది అంత సులభమైన పని కాదు! కానీ ఈ ప్రపంచంలో దేవుని ప్రేమను, దయను ప్రతిబింబించడానికి ఇది చాలా అవసరం.
ప్రియ సహోదరీ సహోదరులారా, సంఘములో గొప్పవారిగా ఎదగాలంటే, మనలను మనం త్యజించుకోవాలి, తగ్గించుకోవాలి. “తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” (లూకా 14:11; మత్త 23:12). క్రీస్తు శిష్యులముగా, దేవుని మంచితనమును నమ్ముకొంటూ, మన జీవితాలను వినయముతో దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. అలాగే, మనం పాప జీవితానికి తిరిగి వెళ్లక, జీవితాంతము వరకు కూడా, మనలను పరలోకమున చేర్చు మార్గముననే పయనించాలి. వినయమున్నచోట, స్వార్ధం, గర్వం, మొండితనము ఉండవు.
ప్రియ సహోదరీ సహోదరులారా, వినయం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం ఎందుకంటే, మొదటిగా, దేవుని దృష్టిలో వినయం గొప్పది: దేవుడు వినయంగా ఉండే వారిని ప్రేమిస్తాడు, వారికి కృపను అనుగ్రహిస్తాడు. అహంకారాన్ని, గర్వాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. రెండవదిగా, వినయం జ్ఞానానికి మార్గం: గర్వం అవమానానికి దారి తీస్తే, వినయం జ్ఞానానికి దారి తీస్తుంది. వినయస్తులు తమలో జ్ఞానాన్ని పెంచుకుంటారు. మూడవదిగా, వినయం ఆధ్యాత్మిక వృద్ధికి ముఖ్యం: వినయం అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణం. ఇది మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది, ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి సహాయపడుతుంది.
క్రీస్తు వినయము
ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి సువిశేష బోధన ఆధారంగా, దేవుడు మానవునిగా ఈ లోకమున ఏతెంచినపుడు, ఆయన అత్యంత తక్కువ స్థానాన్ని ఎంచుకున్నారు. అందుకే, యేసుక్రీస్తు వినయం మనకి ఎప్పుడు ఆదర్శంగా ఉండాలి.
- యేసు ప్రభువు యొక్క వినయం గూర్చి పునీత పౌలుగారు చక్కగా వివరించారు: “తనను తాను రిక్తుని చేసుకొని, సేవకుని రూపమును దాల్చి, మానవ మాత్రుడుగా జన్మించెను. అన్నివిధముల మానవ మాత్రుడై ఉండి, అంతకంటె వినయము కలవాడై, సిలువపై మరణము వరకు విధేయుడాయెను” (ఫిలిప్పీ 2:7-8). ఈ వాక్యం యొక్క అర్ధం ఏమిటంటే, దేవుడైన యేసు తన దైవత్వాన్ని పక్కన పెట్టి, మానవ రూపాన్ని స్వీకరించారు. సృష్టికర్తగా కాకుండా, ఆయన సేవకునిలా మారారు. ఇది ఆయన వినయాన్ని సూచిస్తుంది. ఆయన కేవలం మానవ రూపాన్ని ధరించడమే కాకుండా, మానవునిగా మన మధ్య జీవించారు. కేవలం మనిషిగా మారడమే కాకుండా, ఆయన మరింతగా తనను తాను తగ్గించుకున్నారు. దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోయి, మరణాన్ని కూడా అంగీకరించారు. సాధారణ మరణం కాకుండా, అత్యంత అవమానకరమైన, కఠినమైన సిలువ మరణాన్ని ఎంచుకున్నారు.
- దేవుని కుమారుడైనను, పశువుల పాకలో జన్మించాడు (లూకా 1:12, 16).
- మనుష్యకుమారునకు ఈ లోకంలో తల దాచుకొనుటకైనను చోటు లేకుండెను (లూకా 9:58).
- సేవకరూపము దాల్చి, తన శిష్యుల పాదాలను కడిగారు (యోహాను 13:4-5).
- “ఆయన ఎల్లప్పుడును దైవస్వభావమును కలిగియున్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు” (ఫిలిప్పీ 2:6). అనగా, ఆయన దేవునితో సమానము, దేవునిచేత పంపబడినవాడు. సకల జ్ఞానమును, శక్తియును కలిగియున్నవాడు. అయినను, వినయమును కలిగియున్నాడు.
- వినయమే మోక్షమునకు మార్గమని యేసు బోధించారు. “మినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు” (మత్త 5:5).
- వినయముతో పవిత్రాత్మ శక్తితో నింపబడుటకు అంగీకరించారు (లూకా 4:1).
- వినయముతో దేవుని చిత్తానికి విధేయుడై జీవించారు. వినయముతో తండ్రి దేవునిపై సంపూర్ణముగా ఆధారపడి జీవించారు. (యోహాను 5:19, 30, 41; 6:38; 7: 16, 28; 8:28, 42, 50; 14: 10, 24).
- సమాజమునుండి వెలివేయబడిన వారితో, పాపాత్ములతో, రోగులతో, పేదవారితో సాన్నిహిత్వం చేయడానికి ఆయన భయపడలేదు (మత్త 9: 9-13; మార్కు 2:14-17; లూకా 5:27-32; 15:1).
ప్రియ సహోదరీ సహోదరులారా, వినయం యేసుకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశంగా ఉంది. “తననుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింప బడును” (లూకా 11:14) అని అన్నారు. “తననుతాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు” (మత్త 18:4) అని చెప్పారు. అందుకే ప్రభువు అన్నారు, “సాధు శీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నానుండి నేర్చుకొనుడు” (మత్త 11:29) అని.
మనం కూడా వినయముతో జీవించుదాం. మనం జీవించే జీవితం దేవుని వరం. కనుక దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. మానవులందరు సమానులని గుర్తించుదాం. పునీత పేతురు గారి మాటలను గుర్తు చేసుకుందాం: “మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింప వలెను. ఏయన, దేవుడు అహంకారులను ఎదిరించి, వినయశీలురను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. ముక్తి సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును” (1 పేతురు 5:5-6).