మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును

Fr. Sesetti Mariadas M.S.F.S.
09 Aug 2025
19వ సామాన్య ఆదివారం
జ్ఞాన 18:6-9;
హెబ్రీ 11:1-2, 8-19;
లూకా 12:32-48
ఈనాటి పూజా పఠనములు ప్రభువు రాకకై ఎలా సిద్ధపడవలయునను విషయమును స్పష్టం చేస్తున్నాయి. ప్రభువు మరియొకసారి మహిన్వితుడై న్యాయాధిపతిగా వచ్చేస్తారు. కనుక ఆయనను అంగీకరించిన ప్రతివ్యక్తి ఆయన రాక కొరకు జాగరూకతతో నిరీక్షించవలయును. అందుకే క్రీస్తు జీవితంలో “నిరీక్షణ” చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందనే చెప్పాలి. అసలు 'నిరీక్షణ' అన్న పదానికి అర్థము ఏమిటి? ప్రతి దినము మనము ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి కోసమో, ఒక అవకాశం కోసమో, ఏదైనా ఫలితం కోసమో, లేక ఒక రోజు కోసమో ఆశతో నిరీక్షిస్తుంటాం. దీనినే క్రైస్తవ ఆధ్యాత్మిక భాషలో నమ్మకం (హోప్) అని అంటాం. క్రైస్తవ జీవితం విశ్వాసం, నమ్మిక, ప్రేమ అను మూడు విషయములపై ఆధారపడి యున్నది. (1 కొరింతీ 13:13)
తొలి క్రైస్తవ సంఘంలో అంత్య దినముల గూర్చి చర్చ చాలా బలంగానే సాగేది. ఎందుకనగా అంత్య కాలమును గూర్చి మరియు మనుష్య కుమారుడు ఏవిధంగా మహిమాన్వితుడై మరల వచ్చునోయని యేసు తన శిష్యులతో విపులంగా బోదించును. మార్కు 13వ అధ్యాయంలో అంత్య దినములలో సంభవించు విపత్తులను గూర్చి తెలియజేయును. మీరు మెలకువతో వర్తింపుడు. అపుడు మనుష్య కుమారుడు మహా శక్తితో, మహా మహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరు చూతురు (మార్కు 13:26). పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన రెండవ లేఖలో అంత్య దినాలు ఎంత అపాయకరముగా నుండునో తెలియజేయుచున్నారు (3:1-6). అంత్య దినంల గూర్చి ప్రజలలో రెండు ముఖ్యమైన నమ్మకాలు చాలా బలంగా ఉండేవి. మొదటిది, మంచి చెడుల మధ్య పాపపుణ్యాల మధ్య అంతిమ పోరాటం తధ్యం అని, రెండవది లోకాంత్యంకు ముందు ప్రజలకు కష్టాలు ఎక్కువ ఎదురుకానున్నవని మరొక నమ్మకం. అంతిమ తీర్పులోని ముఖ్య ఉద్దేశ్యం “దేవుడు నీతిమంతులను రక్షించును. దుర్మార్గులను, దైవ, భీతి లేకుండా జీవించు వారిని శిక్షించును. అందుకే క్రైస్తవులమైన మనము నిరీక్షణ లేక అప్రమత్తత యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరముంది. ఆ విషయమును తెలియజేయుటకు క్రీస్తు ప్రభువు ఒక ఉపమానమును ఉపయోగించారు.
యజమానుడు, వివాహపు విందునుండి ఏ ఘడియలో తిరిగి వచ్చినను అతని సేవకులు ఆయనకు సేవ చేయుటకు, భోజనము వడ్డించుటకు ఎల్లప్పుడు అప్రమత్తులై నిరీక్షించవలయును. అది నిజమైన సేవకుల లక్షణం. నడుములు కట్టుకోవడం, దీపాలు వెలిగించి ఉంచడం వంటివి వారి సంసిద్ధతకు చిహ్నాలుగా గుర్తించాలి. క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులే కనుక మనము కూడా ఉపమానంలోని మంచి సేవకులవలె ప్రభువు న్యాయాధిపతిగా విచ్చేయునపుడు అదే అప్రమత్తతతో సిద్ధపడవలయును.
యూదుల తొలి పాస్క ఉత్సవం:
ఈనాటి మొదటి పఠనము జ్ఞాన గ్రంథము నుండి గ్రహింపబడినది. ఈ పుస్తకమును క్రీ.శ. 50 సంవత్సరాలు పూర్వము వ్రాయబడినది. ఇందులో ఇశ్రాయేలీయులు మొదటి పాస్కా ఘడియలు గూర్చి గుర్తు చేయబడినది. ఏవిధంగా యావే దేవుడు చేసిన వాగ్దానాలను ఎల్లప్పుడు నిలబెట్టుకొన్నాడో మరియు వారిని ఐగుప్తు' దేశ బానిసత్వం నుండి విముక్తి చేసెనో తెలియజేస్తుంది. యావే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రతి ఇశ్రాయేలీ కుటుంబం ఆ రాత్రి ఒక గొఱ్ఱె పిల్లను వధించి భోంచేయాలి. అది లోపరహితమైనట్లే, మగజాతిదై ఒక సంవత్సరం ప్రాయం కలిగియుండవలయును. అలా వధించిన గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మమునకు అట్టి యావే ప్రభువు నందు వారికున్న విశ్వాసాన్ని చాటి చెప్పాలి. ఎందుకంటే ఆ రాత్రి యావే ప్రభువు ఐగుప్తు జనుల మరియు పశువుల తొలి సంతానాన్ని వధింపవచ్చును. ఇండ్ల గుమ్మంపై పూసిన రక్తమే వారి రక్షణ చిహ్నంగా మారును. ఆ రక్తం మరకలున్న గృహాన్ని దాటుకుంటూ పోవును. వారికి ఏ హాని కలగదు. తద్వారా ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశ దాసత్యము నుండి దేవుడు తన ప్రజలను రక్షించారు. తప్పకుండా. వచ్చి వారిని రక్షిస్తాడని, విరోధుల భారి నుండి విడిపిస్తారని అతని ఇజ్రాయేలీయులు దేవునిపై నమ్మకముంచి ప్రభువు రాకకై అప్రమత్తులై వేచియున్నారు. ప్రభువు వచ్చాడు వారిని విముక్తి చేసాడు. కావుననే యూద ప్రజలకు పాస్కా పండుగ అంటే ప్రభువు రాకకై వేచి ఉండడమయ్యింది. ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువు కూడి దేవుడు ఎప్పుడు, ఏ ఘడియలో వచ్చెనో తెలియదు కనుక మనము అతనిరాక కొరకు ఎల్లప్పుడు సిద్ధముగా నుండవలయునని అప్రమత్తులై వేచియుండాలని భోదిస్తున్నారు. అందుచేతనే తొలినాటి క్రైస్తవులు ప్రభువు రెండవ రాకడకోసం ఎదురు చూడటం పరిపాటి. పూర్వం మెస్సయ్యా లేదా రక్షకుడు వచ్చి రోమన్ చక్రవర్తుల బానిసత్వం నుండి ఇజ్రాయేలీయులను రక్షించునని నిరీక్షించారు. ఆ విధంగానే మెస్సయ్యా క్రీస్తుగా వచ్చారు. మీ నిరీక్షణ కాలం సంపూర్ణమైనది (లూకా 4:21) దేవుని రాజ్యం సమీపించినది అని దైవరాజ్యాన్ని స్థాపించారు. హృదయ పరివర్తనము చెందుటయే దైవ రాజ్యంలో ప్రవేశించుటకు అర్హత అయితే క్రైస్తవులకు పాస్కా పండుగంటే అది క్రీస్తు పునఃరుత్థానమైన దినమును స్మరించుటయే. అయితే మొదటి పాస్కా యావే దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి రక్షించబడడమైతే, క్రైస్తవులకు పాస్క పండుగంటే మానవాళిని సాతాను బారి నుండి రక్షించి, పాప విమోచనము చేసిన శుభదినం. అయితే మొదట్లో క్రైస్తవులు క్రీస్తు రెండవ రాకడ చాలా త్వరలోనే ఉందని నమ్మేవారు. లూకా సువార్తీకుడు అలా క్రీస్తు రాకడ గూర్చి ఎదురు చూస్తున్నవారికొరకుమరియు అతని రెండవ రాకడపై అనుమానం వ్యక్తపరచిన ప్రజల కొరకు క్రీస్తు తాను వివిధ సందర్భాలలో చెప్పిన విషయాలను తను వ్రాసిన సువార్తలో పొందుపరచాడు. అందుకే లూకా 12:40లో ప్రభువు “మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని వాక్కానించుచున్నాడు. కావున ఎవరైతే ప్రభువు వచ్చునపుడు మేల్కొని సిద్ధంగా ఉంటారో, వారు మాత్రమే అతనిని చూడగలరని ప్రభువు మాటలలో చాలా ప్రస్ఫుటమవుతుంది. (లూకా 12:37). అయితే ఆ గడియ ఎవరికీ తెలియదు (మార్కు 13:32).
అప్రమత్తులై నిరీక్షించుడు.
తుచ్చ విషయాసక్తితోను, త్రాగుడతోను, చీకుచింతలతోను మీరు మందమతులుగాక, అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చిపడును... మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడును జాగరూకులై ప్రార్ధన చేయుడు (లూకా 21:34, 36) మనందరము కూడ ప్రభువు రాకడకొరకు ఎదురు చూస్తున్నాము. ఎలా ఎదురు చూడవలయునో ప్రభువు మనకు ఉపమానం ద్వారా తెలియజేయుచున్నారు. తన యజమాని ఏ గడియలో వచ్చినను ఆహ్వానించి, వడ్డించే సేవకునివలే అప్రమత్తతతో వేచి ఉండవలయునని ప్రభువు భోదిస్తున్నారు. "యజమానుడు వచ్చునపుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు” మెలకువ లేదా అప్రమత్తత అనేది ప్రార్ధన జీవితాన్ని చూపుతున్నది. ఎందుకనగా ప్రభువు కొరకు ఎదురు చూచువారు “శక్తి హీనతను, లౌకిక వ్యా మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి, ఋజు మార్గమున పవిత్రమైన జీవితమును” గడపవలయును. ఎవరైతే ఆత్మ ఫలములతో నింపబడతారో వారికి ఈ నిరీక్షణలో ప్రతిఫలము పొందుదురు. ఎందుకంటే, దేవుడు తన వాగ్దానములను నిలుపుకొనును. కనుక మన నిరీక్షణము మనము దృఢంగా నిలిపి ఉంచుకొందుము. (హెబ్రీ 10:23).
ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించి, దేవుని ప్రేమించి జీవిస్తారో వారు పరలోక జీవితానికి అర్హులగుదురు. అటువంటి వారిని తనతోపాటు తీసుకొని పోవుటకు ప్రభువు మరల దూతల సమేతంగా మరల వస్తారు. అందుకే పునీత పౌలు వ్రాస్తున్నారు. “మీ విశ్వాసమునకు, మీ ప్రేమకు, మీ నిరీక్షణ ఆధారముగా నున్నది. అది మీ కొరకు పరలోకములో భద్రపరచబడి ఉన్నది” (కొలస్సీ 1:5) నిరీక్షణ అనునది ఆత్మఫలములో ఒకటి అని గ్రహించ వలయును. ఎందుకంటే. ఆత్మఫల భరితుడు మాత్రమే ప్రభువు రాకకొరకు ఎల్లవేళలా నిరీక్షించగలడు, సిద్ధపడి జీవించగలడు. విశ్వాసం మన నమ్మకానికి, మన నిరీక్షణకు లంగరు లాంటిది. క్రీస్తు చెప్పిన మాటలు మనం ధ్యానించు కునేటట్లయితే అవి మన విశ్వాసాన్ని మరింత దృఢపరచును. ఉదాహరణకు “లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును” (మత్తయి 28:20).
మానవ జీవితం అశాశ్వతమైనది:
ఇజ్రాయేలీయుల వలె మనందరం కూడ ఈ లోకములో యాత్రికులమే ఎందుకంటే మనం ఈ లోకములో శాశ్వతంగా ఉండిపోము కదా! అయితే ఇజ్రాయేలీయులను యావే ప్రభువు మోషే ప్రవక్త ద్వారా వాగ్దాత్త భూమికి నడిపిస్తే మనలను ప్రభువు పరలోక రాజ్యమునకు నడిపిస్తున్నారు. కనుక ఈ లోక యాత్రలో మనము మన గమ్యస్థానాన్ని మరువకూడదు. అబ్రహాము వలె దేవుని యందు దృఢ విశ్వాసముతో ఎన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించి మన గమ్యస్థానం చేరుటకు ప్రయత్నించాలి.
లూకా 12:35-41లో ప్రభువు అంతిమ తీర్పు కొరకు ఎదురుచూస్తూ ఉండమని మనకు చెబుతున్నారు. మనుష్య కుమారుడు మహిమతో వచ్చు సమయం ఎవరికి తెలియదు. మన మరణం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో కూడ మనకు తెలియదు. అందుకే మనము ప్రతి దినము ఆత్మశోధన ద్వారా మరియు పాప సంకీర్తనము ద్వారా సిద్ధపడవలయును. పునీత పౌలుగారి మాటలలో (సహోదరులారా ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు, మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులులై యున్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము”