క్రీస్తు దివ్యరూపధారణ మహోత్సవం

జోసెఫ్ అవినాష్
05 Aug 2025
క్రీస్తుప్రభువు పర్వత ప్రసంగంలో మానవాళికి 'పరలోక ధన్యతను' ప్రకటించాడు.పేదరికం, శ్రమలు, లేమి, ఆకలిదప్పుల వంటి ఎలాంటి సామాజిక అపశ్రుతులకు, ప్రతికూలతలకూ తావులేని ‘దేవుని రాజ్యాన్ని ‘ పర్వత ప్రసంగం’ ద్వారా ఆవిష్కరించాడు.అక్కడినుండి ఆరంభమై, మరో కొండయైన గొల్గొతాపై జరుగనున్న తన సిలువ యాగం దాకా సాగనున్న‘మానవాళి రక్షణ మార్గ ప్రయాణం’లో మజిలీగా శిష్యుల్లో పేతురు, పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని వెంటతీసుకొని రూపాంతర కొండగా పిలిచే మరో కొండకు యేసుప్రభువు వెళ్ళాడు. అక్కడ యేసుప్రభువు ఆ ముగ్గురికీ తన పరలోక మహిమ రూపాన్ని చూపించాడు. పాత నిబంధన నాటి మోషే, ఏలీయా కూడా కొండ మీదికి దిగి రాగా అక్కడ యేసుప్రభువుతో వారి ‘శిఖరాగ్ర సమావేశం’ జరిగింది..దీనినే మనం "దివ్యరూపధారణ" అని పిలుస్తున్నాము..ఈ దినం దివ్యగ్రంధ పఠనాలు క్రీస్తు దివ్యత్వాన్ని,మహిమను మనకు ప్రదర్శించి క్రైస్తవ జీవితం యొక్క ఫలితాన్ని చూపుతున్నాయి..దివ్యరూపధారణ సంఘటన ఎన్నో లోతైన భావాలను క్రైస్తవ ప్రపంచానికి భోదిస్తున్నది వాటిని తెలుసుకుందాం-:
యేసు దివ్యరూపధారణ:
ఒక ఉన్నత పర్వతముపై యేసు దివ్యరూపాన్ని ధరించినట్లు సువార్త గ్రంథాలు చెబుతున్నాయి. పవిత్ర గ్రంథంలో ముఖ్యంగా పూర్వనిబంధన గ్రంథంలో పర్వతాలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.దేవుడు మానవులకు సాక్షాత్కరించిన ఘట్టాలన్నీ పర్వతాగ్రాల మీదనే జరిగినట్టు కనిపిస్తుంది. మోషేకు, ఏలీయా ప్రవక్తకు దేవుడు సీనాయి పర్వతం మీదనే సాక్షాత్కరించారు. (నిర్గమ 24:12-18; 1 రాజులు 19:8- 18), ఇదే సంప్రదాయం ప్రకారం యేసు ప్రభు దైవత్వం కూడా ఆయన "దివ్య రూపధారణం" ద్వారా ఒక ఉన్నత పర్వతం మీదనే ప్రత్యక్షమయ్యింది.
ఇకపోతే ఈ ఘట్టంలో యేసుతో పాటు సాక్షాత్కరించిన మోషే “ధర్మచట్టా”నికి ప్రతినిధిగా నిలిస్తే, ఏలీయా ప్రవక్త "ప్రవక్త" లందరికీ ప్రతినిధిగా కనిపిస్తున్నారు. వీరిద్దరు యేసు ప్రభువుతో పాటు ప్రత్యక్షం కావడం వలన ధర్మ చట్టం ద్వారాగానీ, ప్రవక్తలద్వారాగానీ దేవుడు చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చేవారు యేసు ప్రభువేనన్న సత్యం సూచన ప్రాయంగా వెల్లడవుతుంది.
అలాగే యేసు బాప్తిస్మ ఘట్టంలో "ఈయన నా ప్రియ కుమారుడు" అని ప్రకటించిన తండ్రి భగవానుడు యేసు దివ్యరూపం ధరించిన ఘట్టంలోను తిరిగి అదే ప్రకటన చేశారు. అంతేకాదు "ఈయనను ఆలకింపుడు" అని కూడా ప్రభు శిష్యులను ఆదేశించారు. దేవుడిచ్చిన ఈ ఆదేశం ద్వితీయోపదేశ కాండంలో 'రానున్న ప్రవక్త’ గురించి మోషే చేసిన ప్రకటనను జ్ఞాపకం చేస్తుంది.
"ప్రభువు మీ ప్రజలనుండియే నా వంటి (మోషే వంటి) ప్రవక్త నొకనిని మీ చెంతకు పంపును. మీరు అతని మాట వినుడు" (ద్వితీయో 18:15). మోషే పూర్వనిబంధన కాలపు మధ్యవర్తి; అయితే 'రానున్న ప్రవక్త' మోషే వంటివాడేగానీ ఆయన కంటె ఉన్నతుడు, సాక్షాత్తూ దైవకుమారుడు. ఆయనే 'నూతన నిత్యనిబంధన' కాలపు మధ్యవర్తి. కనుకనే అందరు ఆయన మాటలను ఆలకించి ఆచరించాలని తండ్రి భగవానుడు ఆనాటి శిష్యులను, ఈనాటి క్రైస్తవ ప్రపంచాన్ని కోరుతున్నారు..
దివ్యరూపధారణ శిష్యుల కళ్ళు తెరిపించింది-
శిష్యులు యేసుతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఆయనతో భుజిస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రసంగాలను, బోధనలను ఆలకిస్తూ ఉన్నారు. అంత దగ్గరగా యేసుతో జీవించినప్పటికి క్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకోలేకపోయారు. అందుకే క్రీస్తు ప్రభువు దివ్యరూపధారణ చెందే సరికి దిగ్ర్భాంతి చెంది ఈయనలో మనం తెలుసుకోవటానికి చాలా విషయం ఉంది అని గ్రహించారు. వారు చూసిన యేసు, వారికి తెలిసిన యేసు, వారు ఆలకించిన యేసు, వారితో కలిసి జీవించిన యేసు ఒక్కరే అయినప్పటికీ క్రీస్తు నుండి గ్రహించ వలసినది ఎంతో ఉంది అని గ్రహించారు.
పేతురు,యాకోబు, యోహాను గార్లు మాత్రమే ఎందుకు?
యాయీరు కుమార్తెను ప్రభువు మరణం నుండి లేపినప్పుడు పేతురు, యాకోబు, యోహాను క్రీస్తుతోనే ఉన్నారు. ఈ ముగ్గురు ప్రత్యేకంగా ప్రభువు సిలువ శ్రమల అంతరార్ధాన్ని గ్రహించి ఉండాలి. ఎందుకంటే పేతురు క్రీస్తుని సిలువ శ్రమలను వ్యతిరేకిస్తున్నాడు.యాకోబు, యోహానులు క్రీసుని సింహాసనానికై ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురు తరువాత గెత్సేమనిలో నిద్రలో మునిగి ఉండువారు.క్రీస్తుని శ్రమలను వీరు నమ్మాలి.సిలువ వెనుక దాగి ఉన్న మహిమను ముందుగానే చూడగలగాలి
దివ్యరూపదారణ మనకు ఏం నేర్పిస్తున్నది?
అసలు సిసలైన జీవితం పరలోకంలో ఆరంభమవుతుందని క్రీస్తుని దివ్య రూపధారణ మనకు తెలియపరుస్తున్నది. పరలోకం చాలా అందంగా ఆకర్షణీయంగా మహిమోపేతంగా ఉంటుందని పేతురు గారి మాటల ద్వారా మనకు తెలుస్తున్నది. కానీ ఆ పరలోకానికి మనం చేరుకోవాలి అంటే ప్రభువు వలే అంకితభావంతో, పవిత్రతతో, క్రమశిక్షణతో జీవించాలి. మన పాప స్థితి నుండి పుణ్యస్థితికి రూపాంతరం చెందాలి. సైతాను క్రీస్తును పలుమార్లు శోధించింది. కానీ క్రీస్తు ప్రార్ధన శక్తితో దాన్ని తిప్పికొడుతూ, మరణం పై విజయకేతనాన్ని ఎగరవేసి పరలోకంలో తండ్రి కుడి పక్కన ఆసీనులయ్యారు. మనం క్రీస్తు శరీరం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా శక్తిని పొందుకుంటున్నాం. ఆ శక్తితో సైతాన్ శక్తులను తరిమికొట్టి మన దృష్టిని పరలోకం వైపు నిలపాలి.
చివరిగా-:
పనిలేకుండా ఫలితముండదు.శ్రమలేకుండా పురోభివృద్ధి వుండదు.కష్టం లేకుండా వైభవం ఉండదు.భూమిలో విత్తనం మరణించిననే తప్ప అది మొలకెత్తి పెరిగి ఫలించదు.చెమటోడ్చి విత్తనం వేయువాడే ఆనందంతో పంటను కోయగలడు.సోమరిపోతు ప్రగతి పధంలో ఎప్పుడూ పయనించలేడు.జీవితంలో కీర్తి కిరీటాన్ని పొందలేడు.అట్లే ఆధ్యాత్మిక జీవితంలో మహిమను పొందాలంటే అనేక శ్రమలనుభవించక తప్పదు.క్రీస్తుతో ఐక్యమై జీవించువాడే ఆయన వైభవంలో పాలుపంచుకొనగలడు.క్రీస్తు మార్గంలో పయనించువాడే ఆయన మహిమను పొందగలడు.. క్రీస్తు అడుగుజాడల్లో నడుద్దాం పరలోక బహుమానాన్ని పొందుకుందాం..అందరికీ పండుగ శుభాకాంక్షలు.