చేయి విడవని దేవుడు

జోసెఫ్ అవినాష్
09 Jul 2025
సామాన్య 14వ గురువారం
ఆది 44:18-21,23-29;45:1-5
కీర్తన 105:16-21
మత్తయి 10:7-15
ధ్యానం:
యోసేపు అన్నదమ్ములను క్షమించి తండ్రి గురించి తెలుసుకొని సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.తనను చంపాలనుకున్న సోదరులు ఆకలితో అలమటిస్తున్నారు. అయినా యోసేపు వారి మీద పగదీర్చుకోవాలని అనుకోలేదు.చాల దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు. పైగా ఆకలిమీదున్నారు.వారి ఆకలిదిర్చాడు.తన తండ్రి గురించి,తన తమ్ముని గురించి సమాచారాన్ని తెలుసుకొని చింతాక్రాంతుడయ్యాడు. ఇదంతా యోసేపుకు మాత్రమే తెలుసు.జీవితంలో తన తండ్రిని,సోదరులను చూడలేననుకున్నాడు.కానీ దయగల దేవుడు యోసేపును అధికారిగాజేసి,కొన్ని సంవత్సరాల తర్వాత కరువు రప్పించి తండ్రీకొడుకులందరిని ఏకం చేసాడు.ఇది దైవ ప్రణాళిక,యోసేపు మంచితనానికి గుర్తు.యోసేపు అన్నదమ్ములు తమ దేశానికిపోయి తన తమ్ముని ఔదార్యాన్ని గురించి చెప్పడం ఒక విధంగా వేదప్రచారమే. దేవుడకు ఎవరియందైతే నివాసముంటాడో అతని మంచితనం గుర్తించబడుతుందని చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ.సువార్త పఠనంలో యేసుప్రభువు వేదప్రచారార్థం పన్నిద్దరిని ఎన్నుకొని వారికి అపోస్తలులని నూతన నామధేయాన్నిచ్చారు. పేరుపేరునా వారిని పిలిచి తన శిష్యులుగా చేసుకొని వారికి సర్వాధికారాన్ని ఇచ్చాడు. కొన్ని మహత్తర శక్తులను కూడా ఇచ్చాడు. మరి నిన్ను నన్ను పిలిచిన దేవుడు మనతో ఉండడానికి, మనల్ని వేదప్రచారానికి పంపడానికి సిద్ధంగా ఉన్నాడు.ప్రభు పిలుపందుకొని అన్ని ఆటంకాలెదురైనా దేవుడు మనతో ఉంటాడని, మనకు సాయంచేస్తూ, మన ముందుండి నడిపిస్తాడనే నమ్మకంతో ప్రభువుతో మన ప్రయాణాన్ని సాగిద్ధాం.