దైవభక్తులకు కష్టాలు తప్పవా?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

25 Jun 2025

ప్రశ్న -:
ఆదికాండంలో సచ్ఛీలుడైన యోసేపు, అనేక కష్టాలకు గురవుతాడు. దైవభక్తులకు కష్టాలు తప్పవా?

సమాధానం -:
ఆదికాండంలో యోసేపు జీవితం అత్యంత ఆదర్శనీయం (అధ్యాయాలు 37-48) యాకోబుకు పండ్రెండుగురు కుమారులు. అందులో సత్ప్రవర్తనతో దైవమార్గంలో నడిచే యోసేపంటే యాకోబుకు ప్రీతి. అదే యోసేపు పాలిట శాపమయింది. అతని సోదరులు అతనిమీద అసూయ పెంచుకొన్నారు. ఒకరోజు అతనిని హింసించి, బావిలో పడవేసి, వ్యాపారస్తులకు అమ్మివేస్తారు. అయితే దైవహస్తంచేత కాపాడబడినవాడై, యోసేపు ఈజిప్తు చేరుకుంటాడు. బానిసగా బ్రతుకుతున్నా, ఇతరులకు హితవాక్కులు చెప్పి, దగ్గరవుతాడు. అయితే దురదృష్టం అతనిని వెంటాడుతూనే ఉంటుంది. ఒక యజమానుని దగ్గర పనికి కుదురుతాడు యోసేపు. అయితే యజమాని భార్య అతన్ని మోహించి, తనతో శయనించమని శోధిస్తుంది. అందుకు నిరాకరించిన యోసేపు ఆమె ప్రతీకారానికి గురవుతాడు. ఆమె చెప్పుడుమాటలు విన్న యజమాని, ఆగ్రహించి తిరిగి యోసేపును చెరసాలలో వేయిస్తాడు. అదృష్టం అందినట్లే అంది ఊరించినా, కష్టాలు వెన్నంటి వేధించినా, దేవుని మీద నమ్మకం కోల్పోడు యోసేపు. దైవహస్తం అతనిని రాజప్రసాదానికి చేరుస్తుంది. అతని సమయస్ఫూర్తివల్ల ఈజిప్తరాజ్యం కరువుబారినుండి కాపాడబడుతుంది. అతని వలననే తండ్రి యాకోబు, మిగిలిన సోదరులు రక్షింపబడతారు. యోసేపు మంచి మనసుతో సోదరులను క్షమించడంతో కథ సుఖాంతం అవుతుంది. యోసేపు కష్టాలలో కూడా సత్యనిష్ఠను వీడలేదు. దేవుడు చేయి విడిచాడంటూ ఎప్పుడూ వాపోలేదు. అతడు పరస్త్రీ వ్యామోహానికి తలవంచలేదు. అన్నదమ్ములపై ప్రతీకారం పెంచుకోలేదు. రాజు చెడుచేసినా, అతని మంచినే కోరుకున్నాడు. ఒక నీతిమంతుని జీవితంలో దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడో యోసేపు జీవితం నేర్పిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మమే రక్షిస్తుంది అనే సూక్తి యోసేపు విషయంలో నిజమవుతుంది. దేవుని మీద నమ్మకానికి, సత్యనిష్ఠకు, సచ్ఛీలతకు నిదర్శనం యోసేపు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN