ఇదే మన పెంతెకోస్తు

Fr. Sesetti Mariadas M.S.F.S.
07 Jun 2025
పెంతుకోస్తు పండుగ
అపో: 2:1-11,
1 కొరింథి 12:3-7, 12-13,
యోహా 20:19-23.
ఆధునిక మనిషిని ఎముకల గూడుగా, నడుస్తున్న అస్తిపంజరంగా, చాలా భావగర్భితంగా Hallowed man (గుల్ల మనిషి) అను పద్యంలో T.S. Eliot వర్ణించాడు. Waste land' అను సుదీర్ఘ పద్యంలో అదే కవి ఆధునిక భౌతిక సంస్కృతికి విలాసాలకు, శరీరేచ్ఛలకు, విచ్చలవిడి తనానికి అలవాటుపడిన మన నవీన సమాజాన్ని కదలాడుతున్న ఓ స్మశాన వాటికగను, జీవ ప్రవాహం ఎండి పోయిన ఓ ఎడారిగను, చేప చచ్చిన భూమిగను వివరించాడు. ఈ రెండు పద్యాలు జీవపూర్ణిత నిచ్చు ఆధ్యాత్మిక చింతన, సంస్కృతులకు దూరమైన ఆధునిక మనిషి బ్రతుకుకు భాష్యాలు. నాడి ఎండిన మనిషికి జీవ చేతనను ప్రసాదించాల్సిన ఆవశ్యంను జీవ పూర్ణుడు ఆత్మదేవుడు తీర్చగలడు. ఆయన పనితనంలో అస్తికలు మహా సైన్యమైనారు. ఎజెకె 37:1-11.
పరిశుద్ధ గ్రంథంలో ఆత్మకుమ్మరింపు వాగ్దానాలున్నాయి. “ఎల్లరిపై ఆత్మను కుమ్మరింతును”. యావేలు 2:28, “మీ సమాధులను తెరయుదును. మీకు జీవంను పోయుదును”. ఎజేకి 37:1-11. ఆ వాగ్దానాలు తీరిన యుగం ఆత్మయుగం. మొదటి పెంతెకోస్తు ఆత్మ యుగారంభం, క్రీస్తు ప్రారంభించిన తండ్రి రాజ్యం విస్తరించుచు ఇక నుండి ఆత్మ నిర్దేశంలో శిష్యసంఘం నెరవేరుస్తుంది. అందులో ఓ మజిలీ మొదటి పెంతెకోస్తు. 2000 సం||ల క్రితం అపోస్తులులను ఆవహించి, సమూలాగ్రంగా మార్చేసి, ప్రభు కార్యోన్ముఖులను చేసి, ఆదిమ సువార్త ప్రభోద ఉద్యమాన్ని ప్రభంజనం చేసింది. ఆత్మ కుమ్మరింపులో సువార్త వ్యాప్తికోసం క్రైస్తవ సమాజం ఆవిర్భవించింది. అందువలన పెంతెకోస్తు సంఘ (శ్రీసభ) పుట్టినరోజు.
మొదటి పెంతెకోస్తు, అపోస్తలులను ఊహించని విధంగా మార్చింది. సాధా జాలరి జనం ధైర్యవంతులుగా కావడం మాత్రమే కాక, వారిలో అంతరంగిక గుణాత్మక మార్పు వచ్చింది. దానిని దేవుడు తప్ప వేరే ఏ శక్తీ చేయజాలదు. వారు 'ఆత్మ స్నానాన్ని' అపో 1:5 పొందారు. ఆ ఆత్మ ప్రభావంతో, నడిపింపుతో ప్రపంచ చరిత్రనే మలుపు తిప్పారు. గుణాత్మక మార్పు ఓ ప్రక్రియ ఫలితంగా వచ్చింది. ఆ ప్రక్రియలో అనేక దశలున్నాయి. మొదటిగా - ఆత్మ వారిని ఆవహించింది. వారి చుట్టూ వీచిన హోరుగాలి, వారిగుండా మూడువేల హృదయాలను ఆవరించింది. తాకింది. ప్రభావితం చేసింది. అపో. 2:2. రెండవదిగా - ఆత్మ ద్వారా వారు సమీకరించ బడ్డారు. ఆత్మపిలుపుతో ఏకమయ్యారు. శిష్య సంఘంగా, సామూహిక జీవనాన్ని జీవించారు. పాత పద్దతుల్లో జీవించలేక, ఆత్మ పద్దతుల్లో జీవించారు. అపో. 4:34:37. మూడవదిగా - ఆత్మ దివ్య శిల్పి. వారిని రూపాంతర మొందించి, వారిని క్రీస్తు సారూప్యతలోనికి మార్చింది. ఒక ఉదాహరణ: భక్త స్టీఫెను. అపో. 6:5, 8, 15, 7:60 శిష్యుల ఆలోచనా విధానాన్ని, ఊహల్ని, సమూలంగా మార్చేసి క్రొత్త ఆలోచనా సరళిని ఇచ్చాడు. క్రీస్తు మనసును వారిలో వికసింపచేసాడు. ఉదా: జప్పాలో పేతురుని దర్శనం అపో. 10:10-16. నాల్గవదిగా - వారు ఆత్మ ద్వారా నడిపింపబడ్డారు. క్రీస్తు ఖైదీగా పౌలు సువార్తా ప్రచారంను ఆత్మ దర్శకత్వంలో, చెప్పు చేతలలో చేసాడు. ఈ చతుర్దశ ప్రక్రియలో ఆదిమ సంఘం లోక అంచుల వరకు క్రీస్తు వాక్య విస్తరణ ఉద్యమాన్ని చేర్చగలిగింది. అదే అపోస్తులుల చర్యలు. ఆత్మ పని ఫలితం. ఆత్మ పని పూర్తికాలేదు. ఆ ఉద్యమం ప్రభంజనమై కొనసాగాలి.
ప్రస్తుతం మన పెంతెకోస్తు, వేరే మజిలీ. ఆత్మ పనిని కొనసాగిస్తుంది. సంఘం సహకరిస్తుంది. ఈ జంట-కార్య నిర్వహణ ఫలితాలు ఆదిమ సంఘం స్థిరాస్తిగా వదిలిన ఆత్మ ప్రక్రియ, అదే దశలలో జరగాలి. అప్పుడే ప్రస్తుత మజిలీ ఫలభరితమవుతుంది.
నేటి సువార్తలో, ఉత్థాన క్రీస్తు అపోస్తలుల పై శ్వాస ఊది ఆత్మను దానం చేస్తున్నాడు. పూర్వం యావే శ్వాసను ఊదగా, మట్టి ముద్ద మనిషి అయ్యాడు. నేడు యేసు శ్వాసను ఊదగా మాంసం ముద్ద ఆత్మ మందిరమయ్యింది. దానం చేయబడిన ఆత్మను అంతర్నివాసిగా, క్రైస్తవుడు / విశ్వాస బంధం పెంచుకోవాలి. ఆత్మకు సన్నిహిత మవ్వాలి. ఆత్మ గుప్పెట్లో వశమవ్వాలి. ఆవహించబడాలి. ఆత్మ నడిపింపులో క్రీస్తు సారూప్యతను పొందాలి. క్రీస్తు మనసును ధరించాలి. విధిగా ఆత్మ ఫలాలను పండించాలి. గలతీ 5:22.
భద్రమైన అభ్యంగనంలో ఆత్మ కుమ్మరింపును పొందిన విశ్వాసి క్రైస్తవ జీవిత పరిశు దతలో ఎదుగుతూ క్రీస్తు రూపంలో, క్రీస్తు మనస్తత్వంను పొందుతూ, సంఘ జీవితానికి అలవడుతూ, సంఘ కార్యక్రమాలలో ఉద్దేశ్యపూర్వకంగా పాలుపంచుకొనును. ఆత్మ సహవాసంలో, ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహాలను భూషణంలుగా గల, సాక్షీభూత జీవితాన్ని జీవిస్తూ, సువార్తా ప్రచారకులుగా, వాక్యవిస్తరణలో భాగస్వాములు కావాలి. ఆమూలాగ్రంగా మార్పునొందుతూ, ఆత్మ స్పృహను కలిగి ఆత్మ చేతనా స్రవంతిలో జీవం పొందుతూ, సువార్తీకరణోద్యమంలో పాల్గొనాలి. అదే పరిణత చెందిన క్రైస్తవ జీవితం. విశ్వాసి ప్రచారకవతార మెత్తాలి. క్రీస్తు నామానికి జయం తేవాలి. నీ కోసం ఆత్మ! క్రీస్తు కోసం నీవు!! ఇదే మన పెంతెకోస్తు.