నేనే మార్గము, సత్యము, జీవము

ఫాదర్ గోపు ప్రవీణ్

15 May 2025

పాస్కా నాలుగవ శుక్రవారము
అ.కా. 13:26-33;
యోహాను 14:1-6
“నేనే మార్గము, సత్యము, జీవము”గా యేసు తననుతాను పరిచయం చేసుకొనుచున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరుకూడా తండ్రి యొద్దకు చేరలేరు. తండ్రి యొద్దకు మనలను నడిపించు మార్గము క్రీస్తు. మన రక్షణకు మార్గము. పరలోకమునకు మార్గము. “దేవుడు ఒక్కడే. దేవుని, మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు” (1 తిమో 2:5). మరణం అంతం కాదు. క్రీస్తును మనం విశ్వసించి, అనుసరించినచో, తప్పక తండ్రిని, నిత్యజీవమును పొందెదము.

యేసే సత్యము. తండ్రిని, ఆయన ప్రేమను, రక్షణను మనకు బహిర్గత మొనర్చాడు. మానవాళి రక్షణార్ధమై తండ్రి చిత్తాన్ని తెలియజేసాడు. ఆయన దేవుని వాక్కు. తండ్రి కార్యములను పరిపూర్తి చేయును. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సిలువపై తన ప్రాణాలను అర్పించాడు.

యేసే జీవము. మనకు శాశ్వత జీవమును ఒసగువాడు. ఆయన మనలను మరణము నుండి, పాపము నుండి విముక్తి గావించి, నిత్యజీవమును ఒసగాడు. ఆయన మనకు పరిపూర్ణ శాంతిని, సమాధానమును ఒసగువాడు.

మన నిస్సహాయ స్థితిలో, మనకు సహాయం చేయును. నిరాశలో నున్నప్పుడు, ఆయన మనకు ఆధారముగా యుండును. మన బలహీనులుగా యున్నప్పుడు, మనకు సమర్ధతగా ఉండును. మనము ఒంటరిగా నున్నప్పుడు, మనకు సన్నిహితంగా ఉండును. మనము అల్పులముగా భావించబడినపుడు, మనలను సంసిద్ధము చేయును. చీకటిలో నున్నప్పుడు, వెలుగును ప్రసాదించును. నిరాశ్రయులమైనప్పుడు, మనకు కొండయు, కోటయునుగా ఉండును. దీనులుగా నున్నప్పుడు, మనపై దయను చూపును. మనము ఏమియు చేయలేనప్పుడు, అయన సమస్తమును చేయును.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN