విడాకులే పరిష్కారమా?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
04 Apr 2025
ప్రశ్న:-
వివాహవ్యవస్థలో కొన్ని సందర్భాలలో విడాకులే పరిష్కారమని కొందరు భావిస్తారు.కానీ యేసుక్రీస్తు ఈ విషయంలో కఠినంగా బోధించారు. కారణమేమి?
సమాధానం:-
"దేవుడు జతపరచినదానిని, మనుష్యుడు వేరుపరుపరాదు" అంటూ యేసు చెప్పిన మాటలు కఠిన వైఖరిని చూపవచ్చు (మత్తయి 19:6). కానీ అవి స్త్రీల పరిస్థితిని కాపాడే ప్రయత్నమని తెలుసుకోవాలి. స్త్రీలపట్ల ఇజ్రాయేలు సమాజంలో చులకన భావముండేది. యేసుక్రీస్తు కాలంలో యూదామతాచరణలో రెండు ప్రధాన మతసంస్థలు రాజ్యమేలేవి.అవి: 'షమ్మాయి' మరియు 'హిల్లెల్'. ఈ రెండు వ్యవస్థలు కూడా విడాకుల గురించి చాలా చులకనభావం ప్రదర్శించేవి. షమ్మాయి మత సంస్థవారు,స్త్రీలు అవినీతికరమైన పనులుచేస్తే విడాకులివ్వవచ్చు అన్నారు. హిల్లెల్ అనే మత సంస్థవారు ఇంకొంచెం ముందుకువెళ్ళి, స్త్రీలు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా పురుషులు విడాకులివ్వవచ్చు అని ప్రతిపాదించారు.వాటిలో వంట సరిగా చేయకపోవడం వంటి చిన్న తప్పిదాలు కూడా ఉన్నాయి.ఈ తరహా వ్యవస్థలో భర్తల అజమాయిషీలో, వారి దయాదాక్షిణ్యాలతో భార్యలు బ్రతికేవారు.ద్వితీయోపదేశకాండం 24:1-4లో చెప్పిన అంశాలు క్రింద ఆశ్రయం పొందుతూ స్త్రీలను పురుషాభీష్టానికి పావులను చేశారు. యేసుక్రీస్తు ప్రకారం ఇది పురుషులు హృదయకాఠిన్యానికి మోషే అనుమతించిన దురదృష్టకర శాసనం (చూడండి: మత్తయి 19:8). యేసుక్రీస్తు ఒక సమాజాన్ని ఆవిష్కరించాడు. ఆ సమాజంలో అసమానతలకు తావులేదు. నిజానికి యేసుక్రీస్తు స్త్రీ పురుషులిద్దరినీ మనుషులుగానే చూశాడు. అధికులు, అధములు అనే భావం ఎక్కడా కనిపించదు. ఈ నూతన సమాజంలో నైతిక విలువలు, మానవీయతతో క్రొత్తగా ఊపిరిపోసుకొంటాయి. అందులో చట్టాలు మనిషికిగాని, మనిషి, చట్టాలకు కాదు అనే సూత్రబద్ధమైన న్యాయవ్యవస్థ మేలుకొంటుంది. ఈనాటికైనా సులభంగా విడాకులు ప్రతిపాదించే సమాజంలో వివాహ పవిత్రతకు రక్షణ ఉండదు. అవి వివాహంలోని ఇరువర్గాల హోదాను, ఔన్నత్యాన్ని మంటగలుపుతాయేగాని, వివాహ పవిత్రతను కాపాడలేవు. పై మాటల ద్వారా ప్రభువు స్త్రీ ఔన్నత్యాన్ని,వివాహ వ్యవస్థలోని పవిత్రతను కాపాడినట్లు తెలుస్తోంది.