క్షమించడానికి ధైర్యము కావాలి!

ఫాదర్ గోపు ప్రవీణ్

03 Apr 2025

ధ్యానము:
యూదులు యేసును చంప ప్రయత్నించు చుండిరి. యూదయాలో సంచరించక, గలిలీయలో పర్యటించు చుండెను. 'పర్ణశాలల పండుగ' [sukkot] కు ప్రభువు బహిరంగముగా గాక, రహస్యముగా యెరూషలేమునకు వెళ్ళారు. యేసు 'రహస్యముగా' అక్కడకి వెళ్ళడములోని అంతరార్ధం ఏమిటి? యూదులకు పర్ణశాలల పండుగ అతి ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. కనుక, ఆ పండుగను పరిపూర్ణము చేయడానికి వెళ్ళారు (పునీత అగస్తీను). తన దైవత్వమును ప్రదర్శింపకుండుటకు మరియు హింసించు వారిపట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేయుటకు, యేసు రహస్యముగా అచటికి వెళ్ళెను (పునీత క్రిసోస్తము).'పర్ణశాలల పండుగ'ను, వేసవి చివరిలో వచ్చు పంట కోతకాల ముగింపుగా కొనియాడెడు వారు. ఆ రోజులలో, వ్యవసాయిదారులు ఆరుబయట చెట్లకొమ్మలతో ఏర్పాటు చేసుకున్న పర్ణశాలలలో నిదురించేవారు. అందుకే, ఈ పండుగకు 'పర్ణశాలల పండుగ' అని ప్రసిద్ధి. దేవుడు వారికొసగిన పంటకు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారు. అలాగే, వర్షాల కొరకు ప్రార్ధించేవారు. ఆ తరువాత, యిస్రాయేలీయులు కనాను దేశములో ప్రవేశించడానికి ముందు వారి ఎడారి ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోవడానికి ఆచరించే పండుగగా కొనియాడేవారు. ఈ పండుగను ఏడు రోజులు ఆచరిస్తారు. దీనికి సంబంధించి, ప్రతీరోజు సిలోయము కోనేటి నుండి నీటిని ప్రదక్షిణగా మోసుకొని బలులు అర్పించు పీఠముపై పోసేవారు. యూదులు ప్రత్యేకముగా వారి శత్రువులపై విజయం కొరకు ప్రార్ధించేవారు. అలాగే, ఇశ్రాయేలు రాజ్యమును పునరుద్ధరించే మెస్సయ్య కొరకు ప్రార్ధించేవారు. ఈ పండుగకు యూదులు తప్పక యెరూషలేము దేవాలయమునకు తీర్ధయాత్ర చేస్తారు. యేసు ఈ పండుగకు వెళ్ళను అని చెప్పి గలిలీయలో ఉండిపోయెను, ఎందుకన యూదులు [యూదమత నాయకులు] ఆయనను చంప ప్రయత్నించు చుండిరి మరియు ఆయన సమయమును (రక్షణ ఘడియ, మహిమ, తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళు ఘడియ) ఇంకను పూర్తిగా రాలేదు (యోహాను 7:8-9). అయితే, ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప, ఆయన కూడా రహస్యముగా అచటికి వెళ్ళెను (7:10). యూదులు యేసు ఎక్కడని వెదికారు. కొందరు ఆయన సజ్జనుడని, మరికొందరు కాదని చెప్పుకున్నారు. పండుగ మధ్య రోజులలో యేసు దేవాలయములోనికి వెళ్లి బోధింప సాగెను. ఆయనను చంప ప్రయత్నాలు జరుగుచున్నను, ధైర్యముతో బహిరంగముగా బోధించారు. "మీరు ఎందుకు నన్ను చంప యత్నించు చున్నారు" (7:28) అని సూటిగా ప్రశ్నించారు. తనపట్ల శతృత్వం, ద్వేషం, తిరస్కరణ, వేధింపులు, బెదిరింపులు ఉన్నను, యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. "పైకి కనిపించు వాటిని బట్టిగాక, న్యాయ సమ్మతమైన తీర్పు చేయుడు" (7:24) అని అన్నారు. అలాగే, అన్నింటికన్న ముఖ్యముగా తండ్రితో తనకున్న బంధాన్ని తెలియజేసారు: "నేను చేయు బోధ నాది కాదు. నన్ను పంపిన వానిది. ఆయన యందు ఎట్టి అసత్యమును లేదు. నేను స్వయముగా రాలేదు. నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయనను ఎరుగుదును. ఏలయన, నేను ఆయన యొద్ద నుండి వచ్చియున్నాను (ఆయన కేవలం నజరేతునుండి మాత్రమే వచ్చాడని భావించారు). ఆయన నన్ను పంపెను" (7:16, 18, 28-29) అని చెప్పారు.
మనం కూడా యేసు ఎవరో ముందుగా తెలుసుకోవాలి. హృదయముతో ఆయనను రక్షకునిగా, దైవకుమారునిగా విశ్వసించాలి. వ్యక్తిగతముగా, దైవానుభూతిని పొందాలి. మన క్రైస్తవ జీవితాన్ని ధైర్యముగా జీవించాలి. 'ధైర్యము' అంటే భయలేమి కాదు. చేయడానికి భయపడుతున్న కార్యాన్ని చేయడం ధైర్యము. నీతిగా, న్యాయముగా, ప్రేమగా జీవించడానికి, క్షమించడానికి ధైర్యము కావాలి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN