దేవుని సహవాసములో జీవించాలి

ఫాదర్ గోపు ప్రవీణ్

01 Apr 2025

తపస్కాల నాలుగవ బుధవారం
యెషయ 49:8-15;
యోహాను 5:17-30
విశ్రాంతి దినమున స్వస్థత చేకూర్చినందుకు, యూదులు యేసును హింసించడం మొదలు పెట్టారు (5:16). ఈ సందర్భముగా యేసు విశ్రాంతి దినమున కూడా స్వస్థత పరచే అధికారము తనకున్నదని నేటి పఠనము ద్వారా తెలియజేయుచున్నారు.

యేసు తనను హింసించే వారితో, "నా తండ్రి ఇప్పటికిని పని చేయుచున్నారు. నేనును చేయుచున్నాను" (5:17) అని చెప్పారు. అది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగ ప్రయత్నించిరి. ఎందుకంటే, విశ్రాంతి దిన నియమమును మీరుటయేగాక, దేవుడు తన తండ్రి అని చెప్పుచు తననుతాను దేవునికి సమానముగా చేసికొనుచున్నాడని వారు భావించారు (5:18). తండ్రి దేవుడు మరియు కుమారుడు యేసు, సత్యస్వరూపియగు పరిశుద్దాత్మద్వారా పని చేయుచున్నారు. దేవుడు చేసిన ప్రధాన కార్యం ఈ లోకాన్ని సృష్టించడం. తన వాక్కుద్వారా, ఆత్మద్వారా ఈ లోకాన్ని అనుదినము పోషిస్తూ తన సృష్టిని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు ఈ లోకానికి జీవాన్ని ఒసగడానికి, తీర్పును ఇవ్వడానికి విశ్రాంతి దినమున కూడా పని చేస్తారు. యేసు జీవమును, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చెను (యోహాను 10:10).

మనుష్యకుమారుడైన యేసు క్రీస్తుకు తీర్పు విధించు అధికారమును తండ్రి దేవుడు ఇచ్చియున్నారు (5:27). అందుకే యేసు "నేనును పని చేయుచున్నాను" అని చెప్పారు. యేసు పని ఏమిటో "నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము" అని యోహాను 4:34 లో స్పష్టం చేసారు; యేసుక్రీస్తు తండ్రి దేవునిపై ఆధారపడును: "నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో, దానినే కాని తనంతట తాను ఏమియు చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును... (5:19-21). తండ్రి-కుమారుల మధ్యనున్న సంబంధం, ఐఖ్యత తెలియజేయ బడుచున్నది. యేసు తండ్రి చిత్తానుసారముగా మాత్రమే చేయును అని తెలియుచున్నది: "నా అంతట నేనేమి చేయ జాలను. నేను వినినట్లు తీర్పు చేయుదును!... నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును" (5:30). కనుక, యేసు చేసే ప్రతీ కార్యము దేవుని చిత్తమే! యేసు దయ, కరుణ, ప్రేమగల తీర్పరి. దేవుని నిజమైన ప్రేమకు నిదర్శనం ఆయన తీర్పు. ఆయన తీర్పు మనలను ఖండించుటకు కాదు; శిక్షించుటకు కాదు. మనలో మార్పు రావాలని!

అలాగే, క్రీస్తు తండ్రితో సమానముగా భావించారు: "తండ్రిని గౌరవించినట్లే, కుమారునికూడా గౌరవించాలి (5:22-24). క్రీస్తు మాటలను ఆలకించువారు నిత్యజీవమును పొందెదరు (5:26-29). క్రీస్తు తండ్రితో సమానమని యోహాను 1:1 లోను, ఫిలిప్పీ 2:6 లోను చూడవచ్చు. "నన్ను చూచినవారు, నా తండ్రిని చూచి ఉన్నారు" (యోహాను 14:9) అని యేసు స్పష్టం చేసియున్నారు. ఆదిలో దేవునితోను, దేవుడే అయిన వాక్కు యేసు క్రీస్తు. జనితైక కుమారుడు, దేవుడైన ఆ వాక్కే, దేవున్ని తెలియపరచెను (యోహాను 1:1, 18).

ఈవిధముగా తండ్రి దేవునితో తనకున్న సంబంధాన్ని వివరించారు. మానవాళిని రక్షించే కార్యములో తండ్రితో క్రీస్తు భాగస్తులై యున్నారని తెలిపారు. తండ్రి దేవుని చెంతకు క్రీస్తు ఏకైక మార్గము. తండ్రి దేవుడు ఎవరో క్రీస్తు మాత్రమే బయలుపరచి యున్నారు. అందుకే, నేటి సువిషేశములో దేవున్ని 'తండ్రి' అని 8 సార్లు యేసు సంభోధించారు. దేవున్ని తండ్రిగా మనకు పరిచయం చేయుచున్నారు. ఎందుకన, ఆయన తండ్రి వద్దనుండి వచ్చారు. తాను నిజముగా దేవుని కుమారుడని, దేవుడు తన ప్రజలకు స్వస్థతను, రక్షణను ఒసగుటకు తనను పంపియున్నారని యేసు స్పష్టం చేసారు.

అయితే, యూదులు మాత్రం, ఆయన బోధనలను అర్ధం చేసుకోలేదు, గ్రహించలేదు. యేసు తననుతాను దేవునితో సమానముగా భావించడాన్ని తప్పుబట్టారు. ఆయనను చంపడానికి ప్రయత్నాలు చేసారు. తాము నమ్ముకున్న యహోవా దేవుడు, ఇప్పుడు తన కుమారడు యేసు క్రీస్తుద్వారా పనిచేయుచున్నారని వారు గ్రహింపలేక పోయారు. క్రీస్తు చేసే ప్రతీ కార్యములో (అద్భుతము, స్వస్థత, బోధన), తన ప్రజలపట్ల దేవుని (యహోవా) ప్రేమ బహిర్గత మొనర్చ బడింది.

క్రీస్తువలే మనము కూడా తండ్రి దేవుని చిత్తానుసారముగా జీవించాలి. ఆయనకు విధేయులమై జీవించాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుని సహవాసములో జీవించాలి. సువార్తను ప్రకటించాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN