ఇతరులను గూర్చి తీర్పు చేయరాదు

ఫాదర్ గోపు. ప్రవీణ్

23 Mar 2025

తపస్కాల రెండవ సోమవారం
దానియేలు 9:4-10;
లూకా 6:36-38
తండ్రివలె కనికరము కలిగి యుండాలి. అలా ఉండాలంటే, క్రీస్తు శిష్యులు ఇతరులను గూర్చి తీర్పు చేయరాదు, ఇతరులను ఖండించరాదు (6:37). "కనికరము తీర్పు కంటె గొప్పది" (యాకోబు 2:13). ఇతరులపట్ల దయ కలిగి యుండాలి, వారిని క్షమించాలి. పరులకు ఒసగాలి.
ఇతరులను గూర్చి తీర్పు చేయకుడు, ఖండింపకుడు: అపుడు మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. మీరును ఖండింపబడరు. ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి మార్గము చూపలేడు! కంటిలో దూలము ఉంచుకొని పరుల కంటిలో నలుసును చూపలేము! మన జీవితము గూర్చి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన తప్పులను మనం సరిచేసుకోవాలి. ఇతరులను విమర్శించడం కూడా తీర్పు చేయడం వంటిదే! ఇతరులను గూర్చి తీర్పుచేయడం అంటే, మన తప్పిదాలను కప్పిపుచ్చు కొనుటకే! ప్రభువు అన్నారు: "నేను వచ్చినది లోకమును రక్షించుటకేగాని, ఖండించుటకే కాదు" (యోహాను 12:47). యేసు తనను చంపినవారిపై కూడా తీర్పు చేయలేదు. బదులుగా, తండ్రిని క్షమించమని ప్రార్ధించారు (లూకా 23:34). "నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును. కాని దేవుడు హృదయమును అవలోకించును" (1 సమూ 16:7).
పరులను క్షమించాలి: పౌలు ఇలా అన్నారు: "మీరు క్షమించు వానిని నేనును క్షమింతును. నేను ఏ దోషమునైనను క్షమించి ఉన్నచో మీ కొరకే క్రీస్తు సమక్షమున అట్లు చేసితిని" (2 కొరి 2:10). కనుక, ఎల్లప్పుడు క్షమించుటకు నిర్ణయం చేయాలి. క్షమించడం కష్టమే కాని అసాధ్యం కాదు. "మీరును క్షమింప బడుదురు" - దేవుడు దయామయులు. కరుణగలవారు. పరులను క్షమించినపుడు, దేవుడు మనలను క్షమించును. మనం ఇతరులకు ఏమి చేస్తామో, అదే మనకు చేయబడును. కనుక, "కీడు వలన జయింప బడక, మేలుచేత కీడును జయింపుము" (రోమీ 12:21). ప్రభువువలె మనం కూడా క్షమించాలి.
పరులకు ఒసగుడు: మనం ఇతరులకు ఒసగినచో, దేవుడు మనకు ఒసగుతారు. కుదించి, అదిమి, పొర్లిపోవు నిండు కొలమానముతో ఒసగ బడును. దేవుని ప్రేమకు, దయ, కనికరమునకు సూచన. మనకున్న సమస్తము దేవుని దానమే, కనుక, ఇతరులతో పంచుకుందాం!

అంతిమ సందేశం ఏమిటంటే, తండ్రి దేవునివలె మనముకూడా కనికరము గలవారమై జీవించాలి. ప్రేమ గలిగి జీవించాలి - "నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు" (యోహాను 13:34). "ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును. సమస్తమును ఆశించును, సమస్తమును సహించును" (1 కొరి 13:7). "దేవుడు మనకొసగిన పవిత్రాత్మద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను" (రోమీ 5:5). దేవుడు కరుణామయుడు, దయాపరుడు. సులభముగా కోపపడువాడుకాదు. స్థిరప్రేమ యందు, విశ్వాసమందు అనంతుడు (నిర్గమ 34:6; యోనా 4:2). మనం ఆయన పోలికలో సృజింప బడినామని, మనం ఆయన బిడ్డలమని ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. అలాగే, ఆయన స్వభావాలను కూడా మనం పుణికి పుచ్చుకోవాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN