ఫలభరితం చేయు అద్భుత కృప

Fr. Sesetti Mariadas M.S.F.S.
22 Mar 2025
తపస్సుకాల మూడవ ఆదివారం
నిర్గమ 3:1-8, 13-15;
1 కొరింథీ 10:1-6, 10-12;
లూకా 13:1-9,
దివ్యకృప దివ్యశక్తి. అది భక్తులను ఉన్నతానికి లేవనెత్తు దేవుని శక్తి, అది భక్తులను బలపరచు దివ్య అనుగ్రహం. మనలను ఆ మూలాగ్రం మార్పు చెందించగల సత్తా వున్న దివ్య పదార్థం. దీనిని ఆహ్వానించు వారు బలపరచబడతారు. ఏపుగా ఎదుగుతారు. జయం నొందుతారు. ఆహ్వానించనివారు ఎండిపోతారు. ఫలాలను పండించడంలో విఫలమవుతారు. నేటి పవిత్ర గ్రంథ పఠనాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
మొదటి పఠనం (వలస 3:1-8, 13-15)లో :మండుతున్న పొదలో మోషేకు యావే దర్శనమవుట చెప్పబడింది. రాజ ప్రాసాదంలో పెరిగిన మోషే, ఈజిప్టు దేశీయుడు హిబ్రూ జాతీయుని చంపినపుడు ప్రతీకారంగా ఈజిప్టు జాతీయుని మోషే చంపగా, ఫారోకు విషయం తెలిసినందున శిక్షిస్తాడని మోషే ఈజిప్టును వీడి మిద్యానుదేశానికి పారిపోయాడు. అచ్చట జె@ మందలను మేపుతుండగా, హోరేబు కొండ కడకు వచ్చాడు అక్కడ పొదనడిమి నుండి నిప్పు మంట రూపంన యావే దూత ప్రత్యక్షమయ్యెను. పొద మండుచుండెను. కాని అది కాలిపోవుట లేదు. పొదను చూడవచ్చిన మోషేను పేరు పెట్టి పిలిచి తను పితరుల దేవుడనని, దేవుడు తన్నుతాను పరిచయం చేసుకొన్నాడు. ఆయన తన ప్రజల ఆక్రందనను విన్నాడు. వారి పాట్లను గుర్తించాడు. ఈజిప్టియుల ఉక్కు పిడికెళ్ళ నుండి వారిని విడిపించడానికి దిగివచ్చాడు. మోషేను పిలిచాడు. ఆయన కరుణతో విమోచించు దేవుడు. తన ప్రజల జీవితాలలోనికి చొరబడి రూపుదిద్దు వాడు. మనం ఆయన ప్రజలం మనలను విడిపించి, రూపుదిద్దువాడు ఆయనతో సహకరించి ఆయన పనిని ఆహ్వానించువాడు నిండుదనాన్ని స్వంతం చేసుకొంటాడు.
రెండవ పఠనము (1 కొరింథీ 10:1-6, 10-12)లో : నిండుదనాన్ని చవిచూసిన పూర్వులు, మోషే సహవాసంలోనికి బాప్తిస్మం ద్వారా ప్రవేశించి నప్పటికి, ఆధ్యాత్మిక భోజనంను తిని ఆకలిని పోగొట్టుకొన్నప్పటికి, ఆధ్యాత్మిక పానంను క్రీస్తు శిల నుండి త్రాగి దప్పిక తీర్చుకొన్నప్పటికి వారు మృత్యువు పాలయ్యారని, కొరింథీ ప్రజలను పౌలు హెచ్చరిస్తున్నాడు. వారి పూర్యుల పతనానికి గల కారణాలను గ్రహించమని కోరుతున్నాడు. పూర్వులు చెడు కోరికలు కలిగి జీవించారు. వ్యభిచరించారు. ప్రభుని శోధించారు. ఆయన నడిపింపుపై సణుగుకొన్నారు. ఆవిధంగా, పూర్వులు పతనాన్ని కొనితెచ్చుకొన్నారు. వారి పతనం అంత్యకాలంలో జీవిస్తున్న కొరింథీయులకు ఒక దృష్టాంతం, ఒక హెచ్చరిక, శోధనలు సాధారణం. నిగ్రహశక్తిని పాటించండి. బయటపడే మార్గాన్ని దేవుడు చూపుతాడని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. దైవ కృప ఆపదలలో, శోధనలలో మనలను బలపరచి సంరక్షిస్తుంది. క్రీస్తే దైవకృప.
సువార్త పఠనం లూకా 13:1-9లో : దైవకృపను ఆహ్వానించనివారు శాస్త్రిని పొందుతారు. మార్పును పొంది, ఫలించే అవకాశాన్ని పోగొట్టుకొంటున్నారు. మన జీవితం అనేక అనూహ్య మలుపులతో, సంఘటనలతో నిండివుంది. ఈ నేపథ్యంలో, నేటి సువార్తలో ప్రథమ భాగం (13:1-5) జీవితాన్ని దేవుని ఆశయం ప్రకారం నడిపించుకొన నిత్య ప్రయత్నం చేయాలి. దేవుడు తప్పు తీరుస్తాడు. ఆయన తీర్పును ఆహ్వానించడానికి సంసిద్ధంగా వుండాలి. ఈ తీర్పులో నెగ్గడానికి పశ్చాత్తాపపడుతూ జీవితాన్ని సరిదిద్దుకొంటూ వుండాలి, అని తెలియపరుసుంది. రెండవ భాగం (13:6-9)లో అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా ప్రభువు అవకాశాలను మరలా మరలా ఇచ్చే దేవుని పరిచయం చేస్తున్నాడు. శిష్యులు ఫలించాలి. ఇది వారికి అప్పగించబడిన బాధ్యత. ఫలించడానికి దిద్దుబాటులు చేస్తుండాలి. కారణం తొట్రిల్లడం, దారి తప్పడం, అందరిలానే, శిష్యులకు సాధారణం. దేవుడు ఓపికతో మార్పు చెందించడానికి, ఫలింపచేయడానికి అవకాశాలను ఇస్తూనే వున్నాడు. తోటమాలి పని చేస్తూనే వున్నాడు. ఇంకా పని చేయడానికి సిద్ధంగా వున్నాడు. శిష్యులు సహకరించాలి. సహకరించడం ఆవశ్యం. జాగు లేకుండా తొందరగా సహకరించాలి. జీవితాలకు అర్ధాన్నివ్వడానికి, తీర్చిదిద్దడానికి తోటమాలి సూచిస్తున్న దేవుడు మనతో పని చేయడానికి సిద్ధంగా వున్నాడు.