ఆత్మను కోల్పోవద్దు

జోసెఫ్ అవినాష్

20 Feb 2025

సామాన్య 6వ వారము - శుక్రవారం
మార్కు 8:34-9:1
నేటి సువిషేశములో, యేసు తన శ్రమల గురించి ప్రస్తావిస్తున్నారు. మార్కు 8:31-9:2తో మార్కు తన సువార్తలో రెండవ భాగం ప్రారంభమవుతుంది. మొదటి భాగమంతా, 'మారుమనస్సు, హృదయ పరివర్తనము'పై దృష్టిపెడితే, రెండవభాగం 'మెస్సయ్యయొక్క స్వభావంగూర్చి తెలియజేస్తుంది. విశ్వాసికి ఇది ఒక నూతన విశ్వాస ప్రయాణం! యేసు తన ప్రేషిత కార్య వాస్తవాలను శిష్యులకు తెలియజేయుచున్నారు. 'మెస్సయ్య'కు నిజమైన అర్ధాన్ని, 'దేవుని కుమారుడు' అన్న పరమ రహస్యాన్ని వెల్లడి చేయుచున్నారు. యేసు ఘోరమైన శ్రమలనుభవించి, మరణించ వలసియున్నదని యేసు శిష్యులకు స్పష్టం చేయుచున్నారు (8:31). తండ్రి దేవుని యొద్దకు చేరుటకు గల యేసు మార్గము - శ్రమలు, మరణము, ఉత్థానము అను మార్గము. అలాగే తండ్రి దేవుని యొద్దకు శిష్యులు చేరు మార్గము - శ్రమలు, మరణము, హతసాక్షి మరణ మార్గము. క్రీస్తు శ్రమలు, ప్రతీ విశ్వాసి శ్రమలను సూచిస్తుంది. ఈ వాస్తవాన్నే, యేసు తేటతెల్లము చేసారు (8:31-32). యేసు శ్రమలు, మరణం, మన శ్రమలకు, మరణానికి అర్ధాన్ని ఇస్తుంది. అందుకే, ఈ భాగములో, యేసు మూడు సార్లు తన శ్రమలు, మరణం గురించి ముందుగానే శిష్యులకు తెలియజేసారు (8:31; 9:31; 10:33). క్రీస్తు రక్షణ శ్రమలతో భాగం చేస్తేనే, మన శ్రమలకు అర్ధం ఉంటుంది.

యేసు యెరూషలేము ప్రయాణం సిలువ వైపుకు పయణం! మనుష్య కుమారుని మహిమ మార్గం సిలువ మార్గం! తండ్రి దేవుని యొద్దకు, మన విశ్వాస ప్రయాణంకూడా మన వ్యక్తిగత సిలువ, శ్రమలతో కూడుకున్నది. అందుకే, యేసు, "నన్ను అనుసరింప కోరువాడు [నీవు, నేను కూడా] తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసుకొని, నన్ను అనుసరింప వలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు [నీవు, నేను కూడా] దానిని పోగొట్టు కొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, తన ప్రాణమును ధారపోయువాడు [నీవు, నేను కూడా] దానిని దక్కించుకొనును" (8:34-35) అని పలికారు. "త్యజింపు" [విధేయత], "సిలువను మోయుట" [విశ్వసనీయత, నిబద్ధత], "అనుసరించుట" [క్రీస్తు మార్గము]యే శిష్యరికము. "సిలువ ఎత్తుకొనుట" అనగా మన శ్రమలు, మన సిలువలు, ఇతరులకు జీవమును, జీవితమును ఇవ్వగలగాలి. క్రీస్తు సిలువ మనకు 'నిత్యజీవమును' ఇచ్చియున్నది. కనుక, క్రీస్తును అనుసరించుటయనగా, ఇతరుల జీవితాలలో వెలుగును, ఆశను, ఓదార్పును ఇవ్వడం!

పేతురు యేసును "క్రీస్తు" (మెస్సయ్య)గా గుర్తించాడు (8:29). అయితే, క్రీస్తు లేదా మెస్సయ్య అను దానికి పరమార్ధాన్ని గ్రహించాలని ప్రభువు ఆశిస్తున్నారు. యేసు తనను "మనుష్యకుమారుడు" అని సంబోధించారు. "మనుష్యకుమారుడు" అను సంబోధన, యేసు శ్రమలతోను (మార్కు 8:31; 9:9, 31; 10:23, 45; 12:31; 14:21), మహిమతోను (మార్కు 8:38; 13:26; 14:62) జతపరచ బడినది.

"బాధామయ సేవకుని" గురించి యెషయ వ్రాసాడు (52:13; 53:3, 5, 12). దానియేలు "మనుష్య కుమారుని" గూర్చి ప్రస్తావించాడు (7:13-14). యూద నాయకులు యేసును నిరాకరించారు, చంపారు. ఎందుకన, వారు అర్ధం చేసుకున్న మెస్సయ్య వేరు కనుక! ఒక రాజుగా, శత్రుదేశాల అణచివేతనుండి, బానిసత్వమునుండి విడుదల చేస్తాడని ఆశించారు! కాని, యేసు లోకరక్షకునిగా, మానవాళి పాప బానిసత్వమునుండి విడుదల చేయుటకు ఈ లోకమునకు వచ్చారు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు, యేసు శ్రమలను, మరణమును పొందాల్సి యున్నది. ఈవిధముగా, "మెస్సయ్య"కు నిజమైన అర్ధాన్ని యేసు శిష్యులకు తేటతెల్లము చేసారు.

శ్రమలు, మరణం తరువాత యేసు మహిమతో ఉత్థానమగును. మార్కు తన సువార్తను వ్రాసే సమయానికి, క్రైస్తవ సంఘము అనేక హింసలకు గురియగుచున్నది. వేదహింసల సమయములో శిష్యులు, విశ్వాసులు ఉత్థాన క్రీస్తుకు విశ్వాసముగా ఉండాలి! ప్రతీ విశ్వాసి, క్రీస్తు శ్రమలలో పాలుపంచుకోవాలి. అందుకోసం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి! క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము ప్రాణము ధారపోయాలి (8:35). "మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ఆత్మను కోల్పోయిన, వానికి ప్రయోజనమేమి?" (8:36).

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN