లూర్ధు నగర పుణ్యక్షేత్ర విశేషాలు

సిస్టర్ ఉష
11 Feb 2025
లూర్ధు నగరం, లూర్ధుమాత పుణ్యక్షేత్రంలో ఆకట్టుకునే మూడు ముఖ్యమైన స్థలాలు: లూర్ధుమాత గుహ- (రాయి), నీటి కొలను (నీరు) మరియు జపమాల ప్రదక్షణ(వెలుగు)
1. లూర్థుమాత గుహ:
లూర్థుమాత పుణ్యక్షేత్రంలో అత్యధికంగా ఆకట్టుకునే స్థలం మరియతల్లి బెర్నదత్ అనే యవ్వన బాలికకు 1858 ఫిబ్రవరి 11 నుండి జూలై 16 మధ్యలో 18 మార్లు దర్శనం ఇచ్చిన స్థలం, ఆమె నిష్కళం. కోధ్భవి అని ప్రకటించిన స్థలం, అదే మస్సఖిల్లి కొండ గుహ. 88 అడుగుల ఎత్తు, 32 అడుగుల వెడల్పుతో అజరామరంగా క్రీస్తుని కోటగా, ప్రార్థనాలయంగా విరాజిల్లుతుంది ఈ కొండగుహ, ప్రతి యాత్రికుడు కొండంత ఆశతో, కోటి కోర్కెలతో చేరి ప్రార్ధించే స్థలమే ఈ అద్భుతమైన గుహ. ఈ గుహ ఎందరో విశ్వాసులకు, అవిశ్వాసులకు ఎనలేని అనుగ్రహాలను కురిపిస్తూ, క్రీస్తుకు మార్గముగా, క్రీస్తు మధ్య వర్తిత్వంగా, పరలోక భూలోకమునకు మార్గముగా మరియు క్రీస్తు విన్నవ కేంద్రముగా నిలిచి ఉన్నది. ప్రభువు నాకు తైలము, కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయ స్థానము (కీర్తన 18:2). ఈ గుహ ద్వారా మరియ తల్లి క్రీస్తు భక్తులకు కొండంత అండగా, నీడగా సేద తీరుస్తుంది మన కతోలిక దేవాలయాలను పుణ్యక్షేత్రాలను గమనించినట్లయితే మరియమాత గృహాలు మనకు అనేకం కనిపిస్తాయి... ఈ గృహాలు ఇక్కడి నుంచి ప్రేరణగా తీసుకుని నిర్మించినవే
2.జీవజలం నీటి కొలను (నీరు):
లూర్ధు నగరంలో రెండవ ఆకర్షణీయ స్థలం మరియ మాత నీటి కొలను.
"నా ఆత్మ క్రీస్తుని కొరకు దప్పికగొనుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుతున్నది" (కీర్తన 42-2). లూర్థుమాత నీటి కొలను ఒక అద్భుతమైన కొలను, క్రీస్తు అనే జీవజలమును దయచేస్తూ, బప్తిస్మ ప్రమాణాలను నూతనపరుస్తూ, ఎంతో శ్రేష్ఠమైన జలములతో పొంగిపొర్లుతూ, అవిశ్వాసులకు, రోగస్తులకు ఆరోగ్యప్రదాయినిగా, సంపూర్ణ ఆరోగ్యం, అనుగ్రహాలను దయ చేయునదే ఈ నీటికొలను, ప్రతి ఒక్కరి దప్పికను తీరుస్తూ క్రీస్తును కనుగొనేలా చేసేదే ఈ దివ్య కొలను..
3.జపమాల ప్రదక్షణ (వెలుగు)
కనులార్పకుండా చూడదగ్గ మరో ప్రదేశం లూర్థుమాత ఆలయ ప్రాంగణంలో గల జపమాల ప్రదక్షణ. ఒత్తులతో ప్రతి సాయంత్రం జరిగే జపమాల ప్రదక్షణలో వేలాదిగా విశ్వాసులు పాల్గొని, భారముతో అలసి సొలసిన వారి మనసులకు ఊరట లభించమని, చీకటితో నిండిన వారి జీవితాలకు క్రీస్తుజ్యోతిని దయచేయమని మరియతల్లికి ప్రతి ఒక్కరూ విన్నవిస్తారు. క్రీస్తు స్తుతులతో, మరియతల్లి అలాపనలతో జరుగు ఈ మహోజ్వల జపమాల ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రీస్తు అనుభూతి లభిస్తుంది. లూర్జునగరం శాంతికి నిలయమని, మరియతల్లి క్రీస్తుకు ఏర్పరచిన ఆలయమని, పరలోక నివాసమని చెప్పుటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వేలాది మంది ప్రజల భక్తి భావన, విశ్వాసం, కన్నీటి ప్రార్థన చూపరులకు దైవానుభూతి కలిగిస్తుంది. చీకటికి అంతం చెప్పి, నిరంతరం క్రీస్తు వెలుగును, తేజస్సును మనందరికీ కలిగిస్తుంది. "క్రీస్తే లోకమునకు వెలుగు" (యోహాను 8:12) అని ఆయనయందే జీవపు వెలుగు పొందెదమని ఈ యొక్క ప్రదక్షణ సాక్ష్యం పలుకుతుంది.
చివరిగా-:
‘‘నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు’’ (యోహాను సువార్త 14:6). మనము పిత దేవుడిని చేరుకోవాలంటే మొదటిగా సుతుడైన యేసు ప్రభువుని చేరుకోవాలి. ప్రభువు ద్వారా తప్ప మనము ఏ మార్గములోనూ తండ్రిని చేరుకోలేము. అదేవిధముగా మనము ప్రభువును చేరుకోవాలంటే ఖచ్చితంగా మరియ తల్లి సహాయం మనకు అవసరం. క్రీస్తు ఏ విధముగా అయితే మన కొరకు తండ్రిని మనవి చేస్తారో అదేవిధముగా మరియతల్లి కూడా మన కొరకు క్రీస్తుకు మనవి చేస్తారు... మరియతల్లి చెప్పినట్లు చేద్దాం పాపానికి దూరంగా ఉందాం నిత్యం జపమాల జపించుదాం