స్వస్థతను చేకూర్చేది యేసుక్రీస్తు ప్రభువే!

జోసెఫ్ అవినాష్

09 Feb 2025

సామాన్య 5వ వారము - సోమవారం
మార్కు 6:53-56
యేసుప్రభువు ఐదువేల మందికి ఆహారము వడ్డించిన తరువాత (6:35-44) మరియు, నీటిపై నడచిన తరువాత (6:45-52), యేసు తన శిష్యులతో సరస్సును దాటి, గెన్నెసరేతు ప్రాంతము చేరిరి (6:53). గెన్నెసరేతు గలిలీయ సముద్రముయొక్క పశ్చిమ తీరమున, 'కఫర్నాము' - 'తిబేరియ'లకు మధ్యన మూడు మైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పు గల సారవంతమైన ప్రదేశము. ప్రజలు ప్రభువును అర్ధము చేసికొనలేక పోయినను, ఆయన వారికి బోధినలు చేసారు మరియు వారి మధ్య అద్భుతాలు, స్వస్థతలు కొనసాగించారు. "వారి హృదయములు కఠినమాయెను" (6:52). "హృదయం" సంపూర్ణ వ్యక్తికి సూచన. అనగా వారు యేసును ఆయన పరిచర్యను అర్ధం చేసుకొనుటలో, గ్రహించుటలో విఫలమయ్యారు. యూదుల సాహిత్యములో, 'హృదయ కాఠిన్యత', అవిధేయతను, రక్షణ కోల్పోవుటను, అలాగే మరణాన్ని తెలియ బరస్తుంది. "వారు ఐదు రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహింపలేక పోయిరి" (6:52).

"వారు పడవనుండి వెలుపలికి వచ్చిన వెంటనే, అచటి జన సమూహము ఆయనను గుర్తించెను" (6:54). ప్రజలు ప్రభువును గుర్తించి, పరుగెతత్తుకెళ్ళి పడకలపై రోగులను మోసికొని వచ్చిరి. ప్రజల విశ్వాసం, యేసు సహాయాన్ని అర్ధించడం మెచ్చుకో దగినవి! యేసు రోగులను స్వస్థత పరచునని విని, వారంతట వారే ప్రభువు చెంతకు పరుగులు పెట్టిరి. "ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్ధించు చుండిరి" (6:56). ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, "ఆయనను తాకిన వారందరు స్వస్థత పొందుచుండిరి (6:56). "తాకుట" దైవ ప్రేమకు, దేవుడు మనతో ఉన్నాడని నిదర్శనం. ఒక్కోసారి, మాటలకన్న, "తట్టుట" (touch - వెన్నుతట్టి ప్రోత్సహించడం, భుజమును తట్టి ఓదార్చడం, తల్లి బిడ్డను కౌగిలించుకోవడం, జ్వరముతో నున్న వారి నుదిటిపై చేయితో తట్టడం....) ఎంతో మాట్లాడును. ప్రభువు మనలను తాకినప్పుడు, మనలో స్వస్థత (శారీరక, ఆధాత్మిక) కలుగును. స్వస్థతలు, ప్రజల హృదయాలను తాకడం, యేసు ప్రేషిత కార్యాలలో ప్రధానమైనవి.

మనకు కూడా ఏదో ఒక సమయములో ప్రభువు స్వస్థత (శారీరక, ఆధ్యాత్మిక, మానసిక) కావాలి. దేవుడు కొంతమందికి స్వస్థత వరాన్ని ఇచ్చారు. మన పరిధిలో మనం కూడా ఆ వరాన్ని పొంది యున్నాము. కనుక, మన మాటలు, చేతలు, కార్యాలు, ఇతరుల జీవితాలలో స్వస్థతను, ఓర్పును, ఓదార్పును, ధైర్యమును, ప్రోత్సాహమును, పావిత్ర్యమును, దైవత్వమును కలిగించేలా ఉండాలి. క్షమించినప్పుడు, ఇతరులకేగాక, మనకి కూడా స్వస్థతను చేకూర్చుతాము. 'ఓటమి' పొందిన వారితో సానుభూతితో ఒడార్చినట్లయితే, వారి ఆత్మగౌరవానికి తగిలిన గాయం మానుతుంది. మనం ఇవన్ని చేసినప్పుడు, మన ద్వారా వాస్తవానికి స్వస్థతను చేకూర్చేది యేసుక్రీస్తు ప్రభువే!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN