ఇతరుల పట్ల కనికరము, దయ, ప్రేమ కలిగి జీవిస్తున్నామా?

జోసెఫ్ అవినాష్

07 Feb 2025

సామాన్య 4వ వారము - శనివారం
మార్కు 6:30-34
శిష్యులు యేసు వద్దకు తిరిగి వచ్చి, తమ ప్రేషిత కార్యములను, బోధలను తెలియ చేసిరి (6:30). వారి అనుభవాలను గురువుతో పంచుకొనిరి. సువార్తా ప్రచారం, విశ్వాస వికాసములో భాగం. ఇది దైవకుమారుడు, యేసుక్రీస్తు గురించిన సువార్త. సువార్తా ప్రబోధం అనేది యేసు మరియు శిష్యులు బోధించిన దైవసువార్తకు కొనసాగింపు. యేసు వారితో, "మీరు ఏకాంత స్థలమునకు వచ్చి, కొంత తడవు విశ్రాంతి తీసికొనుడు" అని చెప్పెను. ఎందుకన, గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను (6:31). జనసమూహము, వారి యొద్దకు "వచ్చుట, వెళ్ళుట", విశ్వాస పథములోనికి నడచు అభ్యర్ధులను (Catechumen) సూచిస్తుంది.

యేసు తన శిష్యులపై కనికరము కలిగెను. అలసి పోయిన వారిని కొంత తడవు విశ్రాంతి తీసికొనుడు అని చెప్పారు. ఆరంభము నుండి కూడా యేసు వారితో గురు-శిష్యుల బంధాన్ని ఏర్పరచుకొనెను. వారిని మనుష్యులను పట్టివారినిగా సిద్ధము చేయుచుండెను. అందుకే వారిని వేదప్రచారమునకై పంపారు (6:7-13). వేదప్రచారకులు, వారి సేవతోపాటు, వారి ఆరోగ్యం పట్ల కూడా తప్పక జాగ్రత్త వహించాలి. పునీత విన్సెంట్ ది పౌల్ ఇలా అన్నారు: "వేదప్రచారకులు (బోధకులు) ఆరోగ్యంపట్ల తప్పక జాగ్రత్త వహించాలి. అనారోగ్యం పాలు చేయడం సాతాను యొక్క ఉపాయం, ఎందుకన, వారు చేయగలిగిన దానికంటే తక్కువ చేయడానికి, మంచి ఆత్మలను మోసగించడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది." విశ్రాంతికి ప్రధానం - ప్రార్ధన, ఏకాంతం, సంఘము (సోదరభావం) మరియు స్నేహము. విశ్రాంతి (తీరిక) లేకుండా,మనం మానవత్వానికి హాని కలిగించడమేగాక, ఆత్మయొక్క పనిని కూడా ప్రమాదములో పడవేస్తాము. విశ్రాంతి దేవునిపై నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది.

అంతట వారందరు ఒక పడవనెక్కి సరస్సుదాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి (6:32). అయినను, అనేకులు అన్ని నగరముల నుండి వారి కంటె ముందుగా ఈ స్థలమునకు కాలి నడకతో వచ్చి చేరిరి (6:33). సమర్ధవంతమైన, ప్రభావితం చేయగల సువార్తా ప్రచారం, ప్రజలను కదిలిస్తుంది, నడిపిస్తుంది. ప్రభువువైపుకు వచ్చుటయనగా, మారుమనస్సుకు సంసిద్ధతను సూచిస్తుంది. హృదయపరివర్తనము ఆలకించే హృదయాలలోనికి, విశ్వాసం చొచ్చుకొనిపోయేలా చేస్తుంది. యేసునుండి దూరముగా వెళ్ళేవారు అంధకారములోనికి నెట్టబడతారు. వారు అంత:ర్గత శూన్యతను కలిగి యుంటారు. వారు విశ్రాంతి కొరకు ఏకాంత స్థలమునకు వెళ్ళుచున్నప్పటికిని, సువార్తా ప్రచారం కొరకు ఎల్లవేళలా సంసిద్ధముగా ఉండాలని యేసు తన శిష్యులకు బోధించారు.

దానికి సూచనగా, "యేసు పడవను దిగి, జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె నున్న వారిపై కనికరము కలిగి, వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను" (మార్కు 6:34; మత్త 9:36). యేసు తన పన్నెండుమంది శిష్యులకు మాత్రమేగాక, ప్రజలకు [గొప్ప జనసమూహము] కూడా దైవరాజ్యమును గురించిన సువార్తను ప్రకటించెను. యేసు వారిపై కనికరము కలిగియుండుట, వారిని హృదయ పరివర్తనములోనికి, విశ్వాస పథములోనికి నడిపించు ప్రక్రియ. యేసు ఈ అవకాశాన్ని, తన శిష్యులకు మరియు ప్రజలకు అనేక విషయములను బోధించడానికి వినియోగించుకున్నారు.

నేటి సువిషేశములో పాత నిబంధన అంశాలను రెండింటిని చూడవచ్చు: ఒకటి, నిర్జన స్థలము లేదా ఏకాంత స్థలము. దేవుడు తన ప్రజల హృదయాలనుండి వినగల, మాట్లాడగల ప్రదేశము. ఐగుప్తు దేశమునుండి విడుదల తరువాత, దేవుడు తన ప్రజలను ఎడారిలో (నిర్జన ప్రదేశము) 40 సం.లు ధర్మశాస్త్రముతో సంసిద్ధ పరచెను. అలాగే యేసుకూడా ప్రజలకు నిర్జన ప్రదేశములో తన మార్గాన్ని బోధించారు.

రెండవదిగా, దేవుడు తన ప్రజల కాపరి. మోషే దేవునితో ఇట్లు ప్రార్ధించెను: "ప్రభూ! సకల ప్రాణులకు జీవాధారము నీవే. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపుము. అతడు యుద్ధములలో వీరిని నడిపించుచుండును. ఒక నాయకుడు లభించనిచో ఈ ప్రజలకు కాపరిలేని మంద దుర్గతి పట్టదు" (సంఖ్యా 27:15-17). ఈ ప్రార్ధన తరువాత, మోషే నూను కుమారుడైన యెహోషువపై చేతులుచాచి తనకు ఉత్తరాధికారిగా నియమించెను. యెహోషువ (ఆంగ్లములో Jesus) అనగా 'యావే రక్షించును', 'యావే సహాయం చేయును' అని అర్ధం. కనుక, ఇచ్చట యేసును నూతన 'యెహోషువ'గా చూడవచ్చు. అతను ప్రజలను రక్షించును, వారికి సహాయము చేయును. అతను వారిని నూతన నిర్గమ మార్గములో నడిపించును. యెహెజ్కేలు గ్రంథములో యావే ప్రభువు ఇలా చెప్పుచున్నారు: "నేనే నా గొర్రెలను మేపుదును. వానికి విశ్రమ స్థానమును చూపింతును" (34:15; చూడుము కీర్తన 23; యెషయ 40:11). అలాగే, దేవుడు తన ప్రజలకు నూతన దావీదు అయిన ఒక కాపరిని ఒసగును. ఇచ్చట యేసు నూతన కాపరి. తన ప్రజలకు విశ్రాంతి నొసగును. ఆయన "వారిపై కనికరము" కలిగి యుండును. వారిని పచ్చిక బయళ్ళలో తన బోధనలతో సంతృప్తి పరచును (మేపరి). యేసు దేవునిగా, కాపరిగా తండ్రి స్థానములో ఉన్నారు. ఐదువేల మందికి ఆహారము వడ్డించుట, తండ్రి దేవుడు తన ప్రజలకు ఎడారిలో మన్నాను కురిపించే సంఘటనను తలపించును. యేసును 'మంచి కాపరి'గా, తన ప్రాణాలను సైతం అర్పించే వారిగా యోహాను 10వ అధ్యాయములో చూస్తున్నాం. "ఆత్మలకు రక్షకుడు, కాపరి" (1 పేతురు 2:25) అని పేతురు తన గురువైన యేసు గురించి చెప్పియున్నారు.

- దేవున్ని కాపరిగా, మేపరిగా అంగీకరిస్తున్నానా?
- ఇతరుల పట్ల కనికరము, దయ, ప్రేమ కలిగి జీవిస్తున్నామా?
- ప్రభువుకు మంచి గొర్రెలవలె అనగా విధేయత, ఆజ్ఞలను పాటిస్తూ, నిస్వార్ధముగా, దివ్యపూజలో పాల్గొంటూ జీవిస్తున్నామా?

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN