దైవ గ్రంథాన్ని అనుసరించు
Fr. Sesetti Mariadas M.S.F.S.
25 Jan 2025
సామాన్య మూడవ ఆదివారం
నెహెమ్యా 8:2-6, 8-10;
1 కొరింథి 12:12-30;
లూకా 1:1-4, 4:14-21
మొదటి పఠనంలో : ప్రవాసంనుండి తిరిగివచ్చిన యూదులను తిరిగి సంఘంగా క్రమపరచు ప్రక్రియలో నెహెమియా ఎజ్రలు యూదా సంఘ సంస్కర్తలు, ఇశ్రయేలు సంఘాన్ని సమావేశపరచారు. ధర్మశాస్త్రాన్ని పఠించడానికి ఎజ్రా అంకితమయ్యాడు. ధర్మశాస్త్ర ప్రాతిపదికన పునర్జన్మనొందిన ఇశ్రయేలు సంఘం నిర్మింపబడాలని ఆశించాడు రాజకీయ రంగంలో కాక, సాంఘిక మత రంగాలలో ధర్మశాస్త్రం పాటింపబడాలని ఆశించాడు. యూదా సంఘానికి ప్రత్యేక గుర్తింపు నివ్వడానికి ప్రయత్నించాడు
అందులో భాగంగా ప్రవాసం నుండి వదలి వచ్చిన యూదులకు ధర్మశాస్త్రాన్ని ఎ చదివి వినిపించాడు. యూదా సమాజం భక్తితో ఆలకించింది. దేవుని వాక్యం వారిపై పని చేసింది. తెరచిన వారి హృదయాలలో పశ్చాతాపం కలిగింది. వారిలో పశ్చాత్తాప రోదన ఆనందానికి తావుతీసింది. సోదర భావాన్ని వెల్లివిరియ చేసింది. అందువలన వారు పండగ చేసుకొని పేదలకు అన్న పానీయాలను పంచారు. ధర్మశాస్త్రం నూతన సమాజ నిర్మాణ సూత్రమైంది. ధర్మశాస్త్ర పఠనం నూతన సమాజ నిర్మాణ మార్గమైంది.
రెండవ పఠనం (1 కొరింథి 12:12-30) : లో ఎంతో శ్రమతో నిర్మించిన కొరింథీ క్రీస్తు సంఘం వివిధ వ్యక్తుల పేర్లమీద వర్గాలుగా చీలిపోవుటను, సంఘంలోని సభ్యులు వ్యభిచారానికి ఇతర వ్యసనాలకు నైతికంగా దిగజారిపోవుటను, సోదరభావం లేకుండా సభ్యులు ఒకరితో ఒకరు పోట్లాడుకొంటూ లౌకిక న్యాయస్థానాల చుట్టు న్యాయంకోసం తిరుగులాడుటను, దైవారాధన సమయాలలో వర్గాల వారీగా, కుటుంబాలవారీగా రొట్టెలను పంచుకొనుచు, సహోదరత్వానికి, ఐక్యతకు భంగం కల్గించు చుండు టను, దేవుడిచ్చిన సామర్థ్యాలను సహకారబుద్ధితో కాకుండా, పోటీతత్వంతో ఉపయోగించుటను, చూచిన పౌలుని హృదయం బ్రద్దలైపోతుంది. వారిని సంస్కరించు ఉద్దేశ్యంతో లేఖను వ్రాస్తు, క్రీస్తు సంఘంలో వుండి తీరవలసిన దృక్పదాన్ని, విలువలను చూపిస్తూ, క్రీస్తు భక్తులందరు ఒక సంఘమని, ఆ సంఘం శరీరం వంటిదని, మరియు క్రీస్తుని శరీరమని గుర్తు చేస్తున్నాడు. శరీరంలో అవయవాల మద్య నుండు ఐక్యత పొందిక, అన్యోన్యత, సహకారం, క్రీస్తు సంఘంలో నుండాలని, సహోదరత్వం, సహానుభవం ముఖ్య లక్షణాలు కావాలని బోధించాడు.
సువార్తలో (లూకా 1:1-4, 4: 14-21) : యేసు నజరేతు ప్రార్ధనా మందిరంలో దివ్యవాక్కులను చదివి వినిపించుటను, తన పరిచర్యలో ఆత్మ భాగస్వామ్యంతో పేదలను, ఖైదీలను ప్రభు హిత సంవత్సరంను ప్రకటించుచు విడుదలను చెందించు కార్య ప్రణాళికను వింటున్నాము. సువార్త విడుదలను ఇస్తుంది. సువార్త పఠనము ఆత్మ భాగస్వామ్యంలో రుగ్మతలనుండి, అక్రమాలనుండి విడుదలను కల్గిస్తుంది. నూత్న జీవమిస్తుంది.
దివ్యగ్రంథ పఠనాలన్నీ, సంఘం క్రీస్తు సంఘంగా, క్రీస్తు శరీరంగా రూపొందుటలో దివ్యగ్రంథ పారాయణం ఎంత ముఖ్యమో తెలియపరుస్తున్నాము.
“ఎవరికి వారే యమునా తీరే!” అనే లోకోక్తి క్రీస్తు భక్తులకు వర్తించదు. క్రీస్తు భక్తులు ఏకాకులు కారు. విడివిడి వ్యక్తులు కారు. క్రీస్తు భక్తులు క్రీస్తునికి అంకితమై, ఆయనను విధేయించి జీవితాలను నడుపుకొంటారు. భక్త పౌలు తన లేఖలలో క్రీస్తు భక్తులను కనీసం మూడు పేర్లతో పిలిచాడు. క్రీస్తు భక్తులు పునీతులు. (రోమా 1:7, 15:26, 2 కొరింథీ 1:1). వారు క్రీస్తుకు అంకితమైన వారు. క్రీస్తు భక్తులు విశ్వాసులు. క్రీస్తుని తమ ఆత్మల రక్షకునిగా నమ్మి, ఆయనను తమ జీవిత నాధునిగా స్వీకరించినవారు (రోమా 4:11). వారు సహోదరులు. (1 తెస్స 5:26). అందువలన క్రీస్తు భక్తులు విశ్వాసులు, సహోదరులు, పునీతులు. వారు ఇతర భక్తుల సమాజంలో, సహోదరుల బృందంలో, పునీతుల సాంగత్యంలో జీవిస్తారు. ఈ బృందానికి క్రీస్తు కేంద్రం. ఆయన చుట్టూ వారి జీవితాలు తిరుగుతుంటాయి. క్రీస్తు బోధల ప్రమాణాలను అనుసరించి జీవిస్తారు. పరస్పరం అన్యోన్యత, సహోదరత్వం, సహానుభవం, సహవాసంను జీవన ప్రమాణాలుగా జీవిస్తారు. క్రీస్తు అందించే రక్షణను స్వీకరించి, ఆయన యాజమాన్యంను విదేయించి, ఆయనతో సన్నిహిత జీవితాన్ని గడుపుతారు.