వివక్షను తీవ్రముగా ఖండించాలి.
జోసెఫ్ అవినాష్
17 Jan 2025
సామాన్య 1వ వారము శనివారం
మార్కు 2:13-17
గలిలీయ సరస్సు తీరమునకు వచ్చిన జనసమూహమునకు బోధించిన తరువాత వెళుచూ, సుంకపు మెట్టుకడ కూర్చుండివున్న అల్ఫయి కుమారుడగు ‘లేవీ’ (‘మత్తయి’ – మత్త 9:9) అను వానిని చూచి, ‘”నన్ను అనుసరింపుము” అని యేసు పిలిచెను. సుంకరులను పాపాత్ములుగా పరిగణించేవారు, ఎందుకన యూదులకు శత్రువైన రోమను ప్రభుత్వమునకు పనిచేసేడివారు. అవసరమైన దానికంటే ఎక్కువగా పన్నులు వసూలు చేసి లాభాలను గడించేవారు. యేసు కాలమున, పాలస్తీనా దేశమంతా రోముపరిపాలన క్రింద ఉండెడిది. యూదులు రోమనులను ధ్వేషించేవారు. అయితే, కొంతమంది యూదులు, స్వదేశీయులకు వ్యతిరేకముగా, లాభము కొరకు రోమనుల పక్షాన పనిచేసేవారు. వారిలో సుంకరులు కొందరు. కనుక, తోటి యూదులుసుంకరులనుదేశ ద్రోహులుగా, దొంగలుగా, పరిగణించేవారు.
అయినను, యేసు మత్తయితో “నన్ను అనుసరింపుము” అని పిలిచి, తన అపోస్తలునిగా చేసికున్నారు. అతడు లేచి యేసును అనుసరించాడు. “అతడు అట్లే లేచి యేసును అనుసరించెను” (2:14). తన యింట భోజనమును కూడా ఏర్పాటు చేసాడు. అచట ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు “మీ గురువు సుంకరులతో, పాపాత్ములతో కలిసి భుజించుచున్నాడేమి?” అని శిష్యులను ప్రశ్నింపగా, అది వినిన యేసు, “వ్యాధిగ్రస్తులకేకాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. కాని పాపులను పిలువ వచ్చితిని” అని సమాధాన మిచ్చారు (2:16-17). ఇది దేవుని అనంతమైన కరుణకు నిదర్శనం. దేవుని రాజ్యమునకు అందరు పిలువబడు చున్నారు. అందరు అర్హులే!
దేవుడు మనలను కూడా పిలుచుచున్నాడు. “మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరచియే ఉంచెను” (ఎఫెసీ 2:10). ఇదియే మన దేవుని పిలుపు. వాక్యం ప్రకారం ఆయన పిలుపు మార్చబడనిది. “దేవుని ఎన్నిక మార్చబడనిది” (రోమీ 11:29).
దేవుని పిలుపు మనం పవిత్రులముగా జీవించుటకు, కనుక మన పాపాలను తెలుసుకొని, పశ్చాత్తాప పడి, వినయముతో దేవుని సమీపించి మారుమనస్సు పొందడానికి ప్రయత్నం చేయాలి. యేసు సిలువపై మరణించినప్పుడు, మన పాపాలనుండి రక్షింప బడియున్నాము. మనం పాపం చేసినప్పుడెల్ల, సిలువపై ఆయన రక్షణ కార్యమును అవమానించిన వారం అవుతాము.
ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వివక్షను చూపించారు. ఇలాంటి వివక్షలు ఎన్నో మన సమాజములో నేటికీ కొనసాగుచున్నాయి. యేసు అనుచరులముగా మనం ఎలాంటి వివక్షను పాటించ కూడదు. అంతేగాక, వివక్షను తీవ్రముగా ఖండించాలి.