విశ్వాసం విజయ తీరాలకు చేరుస్తుంది
జోసెఫ్ అవినాష్
16 Jan 2025
సామాన్య 1వ వారము - శుక్రవారం
మార్కు 2:1-12
కొన్ని దినములు గడచిన పిమ్మట యేసు మరల కఫర్నామునకు చేరారు. ఇంటిలో (బహుషా సీమోను ఇల్లు) బోధించు చుండగా, ప్రజలు అచటకు గుంపులు గుంపులుగా వచ్చారు.నేటి సువార్తలో, ప్రార్ధన గురించి నేర్చుకొనవచ్చు. యేసు వాక్యము బోధించు చుండగా, కొందరు [స్నేహితులు / నలుగురు] పక్షవాత రోగిని యేసు వద్దకు మోసుకొని వచ్చారు. పక్షవాత రోగిగాని, అతని స్నేహితులుగాని ఎలాంటి బహిరంగ ప్రార్ధన చేయలేదు; వారి విశ్వాసాన్ని వారు ప్రదర్శించారు. ఇంటి కప్పును తీసి, పడకతో పాటు రోగిని కిందికి దించారు. కార్యాలద్వారా చూపిన వారి విశ్వాసమును యేసు గమనించారు. అలాగే, వారు తమ స్నేహితున్ని యేసు తప్పక స్వస్థపరచునని విశ్వసించారు.మాటలకన్న, ప్రభువునందు ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. పక్షవాత రోగిని యేసు సన్నిధిలో వదిలి ఆ నలుగురు స్నేహితులు వెళ్ళిపోయారు. యేసుకు వారు ఎలాంటి విన్నపాలు, సూచనలు చేయలేదు. దైవచిత్తానికి, దైవనిర్ణయానికి వదిలి వేసారు. అదే నిజమైన ప్రార్ధన! నిజమైన విశ్వాసము! స్నేహితుల విశ్వాసమును చూసిన యేసు, మొదటిగా పక్షవాత రోగి పాపాలను క్షమించారు, ఆతరువాత అతనిని స్వస్థపరచారు. ఒకరి విశ్వాసము మరొకరి జీవితాలకు ఉపయుక్తముగా ఉంటుందని అర్ధమగుచున్నది. ఉదాహరణకు, పునీత మోనికమ్మ విశ్వాసం, ఆమె ప్రార్ధనలు, అగుస్తీను జీవితాన్ని మార్చింది. పక్షవాత రోగి స్నేహితులవలె మనం కూడా ఎవరినైనా ప్రభువు చెంతకు తీసుకొని వచ్చామా? మన విశ్వాసం ఇతరులకు ఉపయుక్తకరముగా ఉండినదా? మధ్యస్థ ప్రార్ధనలుకూడా ఎంతో ముఖ్యమని అర్ధమగుచున్నది.ప్రార్ధన తరువాత, మనం గమనింప వలసినవి: పాప మన్నింపు, విశ్వాసము, స్వస్థత మనం పాపాత్ములమని తెలుసుకోవాలి. మన పాపల గురించి పశ్చాత్తాప పడాలి. యేసు తప్పక మన పాపాలను క్షమించును. పాపసంకీర్తనం అనే దివ్యసంస్కారాన్ని ప్రభువు మనకు ఒసగారు. ఈ దివ్యసంస్కారాన్ని మనం వినియోగించు కోవాలి. పాప మన్నింపు - దేవునితోను, తోటివారితోను, శ్రీసభతోను సఖ్యత పరస్తుంది.
విశ్వాసము – యేసునందు నమ్మిక, విధేయత, మంచి కార్యాలు చేయడానికి ప్రేరణ కలిగిస్తుంది.స్వస్థత అంత:రంగిక మైనది. స్వస్థత ప్రతీ వ్యక్తిలో మొదలవుతుంది (పాప మన్నింపు నిజమైన అంత:రంగిక స్వస్థత). లోపల కలిగినది బయటికి (శారీరక స్వస్థత) ప్రదర్శిత మవుతుంది.అచటనున్న ధర్మశాస్త్ర బోధకులు యేసు దైవదూషణము చేయుచున్నారని భావించారు. అందుకు యేసు, “మనుష్య కుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదు” (2:10) అని చెప్పియున్నారు. వాగ్దానం చేయబడిన మెస్సయ్యా అని, దైవకుమారుడు అని ధర్మశాస్త్ర బోధకులు గ్రహింపలేక పోయారు.ధర్మశాస్త్ర బోధకులవలెగాక స్వస్థతను చూసిన అచటి ప్రజలందరు ఆశ్చర్య పడిరి.వారు దేవుని స్తుతించిరి.