"యేసు విలాపము -యెరూషలేము విషాదము"
జోసెఫ్ అవినాష్
20 Nov 2024
సామాన్య 33వ గురువారం
సువిశేష ధ్యానం:
లూకా 19:41-44
మనము ఎక్కువగా ప్రేమించిన వారు, మనకు దూరమైనా,మనం ఎక్కువగా బాధపడతాము, యెరుషలేము నగరము,యేసు కాలము వరకు పుణ్యస్థలముగా వర్ధిల్లింది. ఎందుకంటే, దేవుని ఆలయం ఆ నగరంలో ఉండడమే. దేవుడే స్వయంగా ఆ ఆలయంలో కొలువై ఉన్నాడు. యూదులకు ఇది చాలా ప్రత్యేకమైనది.అలాంటి యెరూషలేము పట్టణమునకు రాబోవు దినములలో,జరుగు విపత్తును తలంచి,యేసు విలపించాడు.యేసు, యేరుషలేమును ప్రేమించాడు.ఆ నగర ప్రజలను తన సొంత ప్రజలుగా భావించాడు.వారి మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడు.వారి విముక్తికే తాను ఈ లోకానికి వచ్చాడు.అంతగా ప్రేమించిన ఆ ప్రజల వినాశనాన్ని తలచుకొని,ఆ పట్టణమునకు రాబోవు గతిని తలచుకొని,యేసు విలపించాడు. యెరూషలేము ప్రజలు,లోక రక్షకునిగా జన్మించిన యేసును స్వీకరించలేదు.దేవుడే తన ప్రజలను దర్శింప వచ్చినప్పుడు, నిర్లక్ష్యంగా ఉన్నారు.ప్రభువు కాలాన్ని, గుర్తించలేదు.దైవ జ్ఞానాన్ని కోల్పోయారు.కాబట్టి వారి నుండి దేవుని సాన్నిధ్యం వెళ్లిపోయింది.ఇక ఆ నగరము శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోతుంది.సొంత పట్టణం కనుమరుగవుతుంది.కాబట్టి యేసు ఎంతో విలపించాడు.తమ పిల్లల వినాశనమును గాంచిన, తల్లిదండ్రులు ఎలా విలపిస్తారో, యేసు విలాపము కూడా అలాంటిదేనని గ్రహించాలి.యేసు సంపూర్ణంగా తన ప్రజలను ప్రేమించాడు.మన కోసమే పరలోకము నుండి దిగి వచ్చాడు. మన కోసమే ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యాడు. మన మధ్య జీవించడానికి వచ్చిన మన రక్షకుని, తృణీకరించడం.ఎంత బాధాకరం! ఇదే పరిస్థితి ఆరోజు, ఈరోజు మనం కూడా ఎదుర్కొంటున్నాం. యేసు సకల మానవాళి రక్షకుడు. ఆయనను తృణీకరించి ఘోర పాపం చేస్తున్నాము. దాని ఫలితం గానే, ఎన్నో విపత్తులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.ఈ ఘోర పరిస్థితుల నుండి,మనం గుణపాఠం నేర్చుకోకపోగా,ఇంకా దేవుణ్ణి నిందిస్తున్నాము.అందుకే మానవజాతి స్వీయ వినాశనాన్ని కొనితెచ్చుకుంటుంది.మన దుఃఖము సంతోషంగా మారాలంటే, యేసును స్వీకరించాలి.మన బాధలు పోవాలంటే, యేసు సిలువను అంగీకరించాలి.రక్షణ పొందాలంటే, దేవుని బిడ్డలుగా జీవించాలి.