దృష్టిని పొంది - దేవుని స్తుతించు
జోసెఫ్ అవినాష్
17 Nov 2024
సామాన్య 33వ సోమవారం
సువిశేష ధ్యానం:
లూకా 18:35-43
"యేసూ! దావీదు కుమారా! నన్ను కరుణింపుము" యేసు యెరికో పట్టణమునకు సమీపించుచుండగా, ఒక గుడ్డివాడు యేసు వస్తున్నాడని విని గట్టిగా ప్రార్ధించాడు.ఈ సృష్టిలో అత్యంత విలువైనది, మంచి దృష్టి కలిగి ఉండడమే.ఈ సంఘటనలో, మన స్థానం ఎక్కడ? మనము గ్రుడ్డివారిగా ఉన్నామా, ప్రజల గుంపులో ఒకరిగా ఉన్నామా? యేసు వస్తున్నాడన్న పిలుపును వినగలిగామా? మౌనంగా కూర్చున్నామా? విశేషమేమిటో కనుక్కున్నామా? యేసు వస్తున్నాడని గ్రహించామా? గ్రుడ్డివాడు ఎంతో ధైర్యం చేశాడు. ఎంతో సాహసంతో ప్రార్థించాడు. యేసుకు వినబడే అంతగా అరిచాడు. నమ్మకంతో వేడుకున్నాడు.యేసును తన కళ్ళతో చూడకపోయినా,ఆత్మతో చూడగలిగాడు.భౌతికంగా గ్రుడ్డివాడైన,ఆత్మీయంగా తెరువబడ్డాడు. ఇక ఎప్పటికీ యేసుతోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు.యేసు కనికరమునకు మొరపెట్టుకున్నాడు.ఎంతో మంది అడ్డుకున్నా తన ప్రయత్నాన్ని ఆపలేదు.పూర్ణ విశ్వాసంతో ప్రార్ధించాడు.ఆత్మదృష్టే కాదు, భౌతిక దృష్టిని యేసు అతనికి బహుకరించాడు.మన ప్రార్ధన దేవుడు ఆలకిస్తే,ఎంతగా సంతోషిస్తాం! గ్రుడ్డివాడు అలాంటి అనుభూతి పొందాడు.అతని ప్రార్ధన విశ్వాసంతో కూడిన ప్రార్ధన. తన అర్ధనాధాన్ని దేవుని ముందు వెళ్లబుచ్చాడు.యేసు సమాధానం ఇచ్చేవరకు గట్టిగా మొరపెట్టుకున్నాడు.చుట్టూ ఉన్న ప్రజా గుంపు,అతని పట్టించుకో పోగా, అతన్ని వద్దని వాదించారు. యేసు మాత్రం అతన్ని పిలిచి, అతని చేతనే, అతడు ఏమి కోరుచున్నాడో చెప్పించాడు. గ్రుడ్డివానికి దృష్టి తప్ప ఇంకేం కావాలి! ఆ క్షణంలో యేసును ఏమి అడిగినా పొందేవాడే.కానీ, తన ప్రార్ధన యదార్ధమైనది. కాబట్టి, కేవలం అవసరమైనది మాత్రమే అడిగాడు.అందుకే, యేసు కాదనలేదు.మనం భౌతికంగా చూడగలుగుచున్నా, ఆత్మీయంగా దేవుని చూడలేని గ్రుడ్డివారంగా ఉన్నాము.ప్రభువు మన ప్రార్ధన వినేయంతగా, విశ్వాసముతో మొరపెట్టి,ఆయన కరుణకు పాత్రులను చేయమని, దీనతతో ఆయన పాదాల సన్నిధికి చేరుదాము.తోటి వారిని యేసు సన్నిధికి నడిపించడంలో, మధ్యవర్తులంగా ఉండాలే కానీ, అడ్డుకునేవారుగా ఉండకూడదు. దేవుని నుండి మనము ఏమి ఆశిస్తున్నాము? మన ప్రార్థనలో యధార్ధత ఉన్నదా? విశ్వాసముతో మొరపెట్టుకుంటున్నామా? నా ప్రార్ధన దేవుడు ఆలకించలేదని నిరుత్సాహపడుచున్నామా? గ్రుడ్డివాని జీవితం, మనకు ఆశ్చర్యం కలుగుతుందా? దృష్టిని పొంది దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభువు మన ప్రార్థన ఆలకించాడని సంతోషించుదాం.దేవుని పొగడుచు ఆయననే అనుసరించుదాము..