వేదవ్యాపక ఆదివార ప్రత్యేక వ్యాసం

డా.గుర్రం ప్రతాప్ రెడ్డి

19 Oct 2024

ప్రతి సంవత్సరం, సంవత్సరంలో ఒక్క సారి విశ్వ శ్రీసభ కార్యకలాపాల కోసం దివ్యబలిపూజను ప్రత్యేకంగా జరుపుకునే ఒక ఆదివారమే వేదవ్యాపక ఆదివారం. ఈ వేదవ్యాపక ఆదివారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు శ్రీసభకు, శ్రీసభ సభ్యులైన గురువులకు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వున్న శ్రీసభ భూభాగాలలో వారివారి కార్యకలాపాలకు ప్రార్ధనల ద్వారానే కాకుండా ఆర్ధికంగా కూడా సంఫీుభావం తెలిపే రోజు. వేదవ్యాపక ఆదివారం సందేశం కూడా ప్రార్థన ద్వారానే ఆర్ధికంగా ఆదుకొమ్మనే సందేశం వుంటుంది.‘‘మీ విశ్వాసాన్ని పంచుకోండి - జీవితాన్ని ఇవ్వండి’’ అనే సందేశంతో 2024 లో విశ్వవ్యాప్తంగా వేదవ్యాపక ఆదివారాన్ని అక్టోబర్‌ 20 ఆదివారం జరుపుకుంటున్నాము. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా జరిగే దివ్యబలిపూజలో విరాళాలు సేకరిస్తారు. ఈ విరాళాలను చర్చిలు, ఆసుపత్రులు, పాఠశాలల తోపాటు యువత లేదా పేద దేశాల్లోని వివిధ వృత్తులకు అండగా నిలవడానికి పూర్తిగా వినియోగిస్తారు.
అసలు వేదవ్యాపకం అంటే ఏమిటి? మన పవిత్ర గ్రంథం బైబుల్‌. మనం దానిని రక్షణవేదం అని పిలుస్తున్నాము. వేదం అంటే సువార్తను అందించే పవిత్రమైన గ్రంథం. అది సకల మానవాళికి రక్షణను కలిగించే వేదం కనుక మనం దానిని రక్షణవేదం అంటున్నాం. ఈ వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించివున్న జనులందరికి వ్యాపింప చయటమే వేదవ్యాపకం సందేశం. ప్రతి సంవత్సరం విశ్వశ్రీసభ అధిపతి అయిన పోప్‌ గారు విశ్వవ్యాప్త వేదవ్యాపక ఆదివారం సందర్భంగా విశ్వవ్యాప్తంగా వున్న అన్ని క్రైస్తవ దేవాలయాలకు సందేశాన్ని పంపుతారు. ఈ వేదవ్యాపక ఆదివార సందేశం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని కలిగి ఉంటుంది. ఈ సందేశం ప్రతి క్రైస్తవుడు శ్రీసభ బిడ్డలుగా ఎలా ప్రతిస్పందించాలో ప్రతిబింబించడానికి సహాయపడుతుంది. గురువులు, మఠకన్యలు ఐహిక సుఖాలను పరిత్యయజించి, నిరంతరం వివిధ కార్యక్రమాలద్వారా క్రీస్తుని సేవలో తరిస్తూనే వుంటారు. కానీ గృహస్త క్రైస్తవులకు ఆ యోగ్యత లేదనే చెప్పవచ్చు. సంసార బందికానాలో చిక్కుకొని, వలలో చిక్కిన చేపలా తన కోసం, తన కుటుంబం కోసం నిరంతరం శ్రమించాల్సిన అవసరం వుంది. ఇది మన గృహస్త క్రైస్తవులందరికి తెలిసిన విషయమే. అందుకే మనం వేదవ్యాపకాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేసే గురువులకు తగిన ఒనరులు సమకూర్చుతూ, నూతనంగా క్రీస్తు సువార్తను విని రక్షణను పొందిన పేదలను ఆదుకోవటానికి సహకరించడమే వేదవ్యాపక ఆదివార పరమార్ధం.
మన విశ్వశ్రీసభ గురువు ఈ వేదవ్యాపక ఆదివారంరోజున గుర్తించాల్సిన మూడు విషయాలను తెలియచేశారు. 1. క్రైస్తవులను మరింత బలపరచటం.2. జ్ఞానస్నానాలు స్వీకరించి , జ్ఞానస్నానాల ప్రమాణం ప్రకారం జీవించనివారిని తిరిగి క్రైస్తవులుగా జీవించేవిధంగా తయారుచేయటం. 3.ఏసును, ఏసు సువార్తను ఎరుగనివారికి మన రక్షణవేదాన్ని తెలియచెయ్యటం. ఈ 3 కార్యక్రమాలను గృహస్త క్రైస్తవులమైన మనం నిర్వర్తించలేము. ఒకవేళ నిర్వర్తించే వారున్నా బహు కొద్దిమంది మాత్రమే వున్నారు.కనుక ఈ కార్యక్రమాలను నిర్వర్తించే గురువులకు, సువార్తను వివిధ రూపాల్లో ప్రజలకు చేరవేసే గృహస్త క్రైస్తవులకు మనం అండదండగా నిలుస్తామని భరోసా కల్పించటమే వేదవ్యాపక ఆదివార మఖ్యోద్ధేశం. మనం చేసే ఈ సహాయం భవిష్యత్తరాలవారు కూడా క్రీస్తు సందేశాన్ని ఇతరులకు తెలియచేసే విధంగా మనందరం చేయూత నందించడమే. నేను ప్రభు ప్రేమను ఎంతమందికి అందించగలుగుతున్నాను? నేను ఎంతమందికి రక్షణవేదాన్ని ప్రకటించటానికి దోహదపడుతున్నాను? అని గృహస్త క్రైస్తవులుగా మనకు మనం క్రీస్తుమందిరంలో నిండు దివ్యబలిపూజలో నిర్ణయించుకొనే రోజు అని గుర్తుంచుకోవాలి.
ఈ వేదవ్యాపక ఆదివారం నాడు మన విశ్వాసాన్ని పంచుకునే విదేశాలలో ఉన్న మన సోదరులు మరియు సోదరీమణులకు ప్రేమ మరియు సంఫీుభావాన్ని చూపించే అవకాశం కలుగుతుంది. నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రజలు ఆకలితో అలమటిస్తూనే వున్నారు. అటువంటివారికి మనం చేసే సహాయం కొద్దోగొప్పో వారి జీవితాలలో వెలుగులు నింపుతాయి. నేటికీ అనేకదేశాల్లో అనేకమందికి క్రైస్తవం అంటే ఏమిటో తెలియని వారు ఎందరో వున్నారు. అటువంటివారికి ఎవరైతే సువార్తను చేరవేస్తున్నారో వారికి సహాయపడుతుంది. సువార్తను చేరవేసేవారు ఒక్క గురువులు, మఠకన్యలే కాదు, విశ్వవ్యాప్తంగా అనేకమంది గృహస్త క్రైస్తవుల్లో కొందరు మన సువార్తను ప్రకటిస్తూనే వున్నారు. వీరంతా ఒక్క ప్రార్ధనల ద్వారానే కాకుండా అనేక పద్ధతుల ద్వారా సువార్తను ప్రకటిస్తున్నారు.
గురువుల, మఠకన్యల సువార్తసేవలు మాత్రమే శ్రీసభ సేవలు కాదు. గృహస్త క్రైస్తవులు పూర్వకాలంలో అనేక జానపద కళారూపాల ద్వారా అనగా కోలాటాలు, చెక్కభజనలు, బుర్రకథలు, యక్షగానాలు మున్నగు కళారూపాల ద్వారా సువార్త ప్రచారం చేశారు. అనంతరకాలంలో క్రైస్తవ నాటకాలు ప్రముఖ పాత్ర పోషించాయి. గుడిలో గురువు గారు చెప్పే ప్రసంగం పైన శ్రద్ధ చూపకపోయినా ఈ క్రైస్తవ నాటకాల ద్వారా కొన్ని వేలమంది మన రక్షణ గ్రంథం సారాంశాన్ని తెలుసుకున్నారు. వీటిపై సినిమాల ప్రభావం పడటంతో ఆ కళారూపాలు కాలగర్భంలో కలిసిపోవటం ప్రారంభించాయి. మన శ్రీభ ఆసమయంలో ‘‘కరణామయుడు’’ మున్నగు సినిమాలను నిర్మించి క్రీస్తు సందేశాన్ని నలుమూలలా తెలియచేశారు. ఆ సినిమాను ఆనాడు ఒక్క క్రైస్తవులే కాదు, హిందు, ముస్లిం అనే భేదభావం లేకుండా సర్వమతాలవారు వీక్షించారు. క్రీస్తుని చరిత్రోపాటు ఆయన సందేశాన్ని తెలుసుకున్నారు. ఇవన్నీ వేదవ్యాపకంలో ఒక భాగమే.
నేటికాలంలో ఈ సువార్త ప్రచారం కొత్తపుంతలు తొక్కింది. నాటకాలు, కోలాటాలు, చెక్కభజనలు, బుర్రకథలు దాదాపుగా కనుమరుగౌతున్న సమయంలో ఆధునిక విజ్ఞానానికి తగిన విధంగా పురాతన కళారూపాలనే వీడియోలుగా రూపొందించి టివిల ద్వారా కానీ, యు ట్యూబు మున్నగు వాటి ద్వారాకానీ రూపొందించి సువార్తను ప్రతి గృహానికి చేరవేస్తున్నారు. ఈ విషయం మనకూ తెలుసు. కరోనా సమయంలో గృహస్త క్రైస్తవులంతా తమతమ గృహాల్లోనే వున్నా మనమంతా దివ్యవాణి టివి ద్వారా కానీ, వివిధ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా కానీ దివ్యబలిపూజను భక్తితో వీక్షిచినవారు కొన్ని లక్షల మంది వున్నారంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ నిర్మించటానికి ఎంతో డబ్బును వెచ్చించాల్సి వస్తుంది. అందుకు గృహస్త క్రైస్తవులు చేరవేసే ప్రతిపైసా పోప్‌ ఆధీనంలో వున్న ‘‘ప్రోపగాండ ఫిదే’’ వారికి చేరుతుంది. ‘‘ప్రోపగాండ ఫిదె’’ ను మనం విశ్వాస ప్రచార సభ అని, వేదవ్యాపక సభ అని, క్రైస్తవ మత ప్రచారక సభ అని ఇలా వివిధ పేర్లతో మనం పిలుచుకుంటున్నాము. ఈ ‘‘ప్రోపగాండ ఫిదే ’’ సంస్థవారు విశ్వవ్యాప్తంగా విస్తరించి వున్న క్రైస్తవ అవసరతలు గుర్తించి ఆ అవసరానికి తగిన సూచనలను అందిస్తూ వారికి అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. అంటే గృహస్త క్రైస్తవులుగా వున్న మనం వేదవ్యాపక ఆదివారంరోజున మనం భక్తితో వేసే కానుక మరలా మనకే ఏదో ఒక విధంగా సహాయకారి అవుతుందని మనం గుర్తించాలి.
సువార్తను చేరవేయటానికి గృహస్త క్రైస్తవులు భక్తితో వేదవ్యాపక ఆదివారంరోజన సమర్పించే ప్రతి పైసా, సువార్తను వ్యాప్తి చేయడానికి, ఆకలితో ఉన్నవారికి ఆహారం సమకూర్చటానికి, వస్త్ర హీనులకు వస్త్రాలను అందించటానికి మనం భాగస్వాములం అవుతున్నామనే విషయాన్ని గృహస్త క్రైస్తవులుగా మనం గుర్తించాలి. క్లుప్తంగా చెప్పాలంటే సామాన్య ప్రజల మానవాభివృద్ధికి, వేదవ్యాపకానికి సేవలందించే సంస్థలను ప్రోత్సహించటానికే వేదవ్యాపక ఆదివారం చందాని వినియోగించి మనలను ఆ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారనే విషయం మనం గుర్తించాలి.
విశ్వవ్యాప్త వేదవ్యాపక ఆదివారం ప్రాధాన్యత విషయాన్ని ఇంకా తెలియచేయాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా వున్న క్రైస్తవులను సమన్వయం చేయడానికి మనం సమర్పించే ప్రతి కానుకకు ‘‘ప్రోపగాండ ఫిదే’’ బాధ్యత వహిస్తుంది. నూతన మేత్రాసనాలు, అత్యంత పేదరికంలో వుండే మేత్రాసనాలు స్వయం సమృద్ధి సాధించడానికి వారి ప్రయాణంలో అవసరమైన మద్దతును అన్నివిధాలా ఈ సంస్థ అందిస్తుంది. అనగా వారి స్వయం సమృద్ధిలో గృహస్త క్రైస్తవులు భాగస్వాములౌతున్నారని ప్రతి గృహస్త క్రైస్తవుడూ గుర్తించాలి. గృహస్త క్రైస్తవులుగా మనం పంపే ఈ వేదవ్యాపక చందాను పోప్‌ ఆధ్వర్యంలో నడిచే ‘‘ప్రోపగాండ ఫిదే’’ సభ్యులు స్థానిక పీఠాధిపతులు, శ్రీసభకు చెందిన ఇతర పెద్దల సమ్మేళనాల ద్వారా తెలుసుకుని, వనరులు సమానంగా, న్యాయంగా పంపిణీ చేయబడేలా చూసుకుంటారు. అవసరాన్ని బట్టి. డబ్బు నేరుగా ఆయా భూభాగాల్లోని పీఠాధిపతులకు వెళుతుంది. వారు అవసరమైన ప్రాంతాల్లో చర్చిల నిర్మాణానికి లేదా యువతా సదస్సులు మున్నగు కార్యక్రమాలు నిర్వహించటానికి, అవసరమైన చోట పేద క్రైస్తవులను వివిధ రూపాల్లో ఆదుకోటానికి ఇలా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రోపగాండ ఫిదే వారు పంపిన డబ్బును వినియోగిస్తారు.
దాదాపు 100 సంవత్సరాల క్రితం అక్కడక్కడ మాత్రమే క్రైస్తవ దేవాలయాలుండేవి. నేడు దాదాపు అన్ని గ్రామాల్లో దేవాలయాలున్నవంటే అందుకు మన ఆర్ధిక భాగస్వామ్యంతో పాటు ‘‘ప్రోపగాండ ఫిదే’’ ఆర్ధిక సహకారాన్ని మనం గుర్తించాలి. ఆనాడు మనం పేదరికంలో వున్నందువలన విదేశాలనుంచి గోధుమలు, నూనె, వివిధ రకాల వస్త్రాలు మనదేశానికి వచ్చేవి. వారు చేసిన సహాయంతోనే కొన్ని కొన్ని గ్రామాల్లో దేవాలయ నిర్మాణాలతో పాటు, కొన్ని గ్రామాలకు రహదారి మార్గాలు నిర్మించుకున్న విషయం నేటి పెద్దలలో అనేక మందికి గుర్తుండే వుంటుంది. ఇప్పుడు మనం దాదాపుగా స్వయం సమృద్ధిని సాధించాం. కనుక ఇతర ప్రాంతాల లేదా ఇతర దేశాల పేద క్రైస్తవులకు మనం పంపించే వేదవ్యాపక చందాను వినియోగిస్తారు. అంతేకాక వైద్యశాలలు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు మున్నగు అనేక నిర్మాణాలకు, యువత లేదా పేదదేశాల్లో వివిధ వృత్తులు నిర్వహించే వారికి ఈ వేదవ్యాపక చందాను వినియోగిస్తారు. ఈ విధంగా అన్ని ధార్మిక సంష్థల్లో మనం భాగస్వాములమౌతున్నామనే విషయాన్ని గృహస్త క్రైస్తవులమైన మనం గుర్తించాలి.
నేడు క్రైస్తవుల్లో అనేకమంది విద్యావంతులున్నారు. వీరంతా ఎక్కువగా మన మిసనరీ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివిన వారే. ఆనాడు మనం చదువుకున్న పాఠశాలలకు కానీ, విద్యార్ధుల వసతి గృహాలకు మనం చాలా తక్కువగా డబ్బు చెల్లించేవారం. మరి ఆనాడు విద్యాబోధన గావించిన ఉపాధ్యాయులకు కానీ, విద్యార్ధుల వసతి గృహ సంరక్షణకు కానీ మనం చెల్లించిన డబ్బు ఏమాత్రం సరిపోదని మనకు తెలుసు. అటువంటి సమయంలో ‘‘ప్రోపగాండ ఫిదే’’ వారు కానీ, లేదా ఇతర దేశాల గృహస్త క్రైస్తవులు కానీ మనలను ఆర్ధికంగా ఆదుకున్నారనే విషయం మనం గుర్తించాలి. ఇక్కడ మరొక్క విషయాన్ని కూడా మనం గమనించాలి. అనాది నుంచి నేటివరకు ఎందరో గురుశిక్షణ తీసుకున్నారు. నేనాడు వారు మనల్ని ఆదుకున్నారు కనుక నేడు పేదలైన ఇతరులను, వేదవ్యాపకానికి కృషిచేసే ప్రతి ఒక్కరిని ఆదకునే బాధ్యత మనపై వున్నదని మనం గుర్తించాలి.
ప్రతి సంవత్సరం మన ఒక్క రాష్ట్రం నుంచే దాదాపు 100 మందికి పైగా గురువులు అభిషిక్తులవుతున్నారు. వారందరు దాదాపు 10 నుంచి 14 సం॥ లు కష్టపడితేనే గురువిద్యను పూర్తిచేయగలుగుతారు. ఈ పూర్తి విద్యా సంత్సరాల్లో పీఠాధిపతులు కానీ, గురువులు కానీ ఏ గురువిద్యార్ధినుంచి ఒక్క రూపాయిని కూడా తీసుకోరు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎంరు గురువులుగా అభిషిక్తులు అవుతున్నారో గృహస్తక్రైస్తవులమైన మనం గమనించాలి. వేదవ్యాపక ఆదివారంనాడు మనం పంపే చందాను ఇతరులకు వినియోగిస్తారనే విషయాన్ని మనం గమనించాలి. ఇలా అనేక విధాలుగా మన ప్రతి పైసా వేదవ్యాపకానికి వినియోగిస్తారని మనం తెలుకుంటే అప్పుడే మనం అత్యంత ధారాళతతో వేదవ్యాపక ఆదివారం నాడు చందాను సమర్పిస్తాము. ఈ విషయాన్ని గృహస్త క్రైస్తవులందరూ గమనించాలి. కనుక వేదవ్యాపక ఆదివారాన్ని ప్రోత్సహిద్దాం- భవిష్యత్తరాల్లో కూడా మన శ్రీసభ వృద్ధి చెందే విధంగా సహకరిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN