సెప్టెంబర్ 15- వ్యాకులమాత పండుగ

జోసెఫ్ అవినాష్

14 Sep 2024

రెండు సంవత్సరాల క్రితం నేను నా స్నేహితుడు(అతడు హైందవుడు అయినప్పటికీ మన విశ్వాసం అంటే చాలా ఇష్టం) ఇద్దరం కలిసి గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రానికి వెళ్ళాము.. . అక్కడ మరియమాత వ్యాకులమాత స్వరూపం ఉంది.. నా స్నేహితుడు ఆ స్వరూపాన్ని చూసి నన్ను ఒక ప్రశ్న అడిగాడు అది ఏమనగా అవినాష్ దేవుని తల్లి అంటే పట్టు వస్త్రాలతో వజ్రా వైడూర్యాలను ధరించి సేవలు చేయించుకుంటూ ఉంటుంది కానీ మీ మరియతల్లి ఏంట్రా చాలా వినయంగా, పద్ధతిగా సింపుల్ గా ఉంటారు, ముఖ్యంగా ఇటువంటి(వ్యాకులమాత) స్వరూపాలలో కన్నీటిని కారుస్తూ ఉంటారు. ఆ తల్లి ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? కొంచెం తెలియజేయమని అడిగాడు..

ప్రియ సహోదరి, సహోదరులారా మరియమాత సాక్షాత్తు దేవుని తల్లి ఆమె జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండవచ్చునని చాలామంది అనుకుంటారు కానీ నిజమెంటంటే క్రీస్తు జన్మించిన కాలము నుండి మరణించే వరకు కూడా ఆ తల్లి అనుభవించిన కష్టాలు అన్ని ఇన్ని కావు. ఆమె మోసిన సిలువలు అన్ని ఇన్ని కావు... ఈనాడు తల్లి శ్రీ సభ మరియమాత వ్యాకులమాత పండుగను కొనియాడుతూ ఉన్నది... ఈ మేరకు ఈ వ్యాసం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం
మరియతల్లి శ్రమలు అనుభవించటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి.

మొదటి కారణం-:
క్రీస్తును కన్నతల్లి గనుక మరియతల్లి కష్టాల పాలయ్యారు. తన కుమారుడు సిలువపై మరణ వేదనను అనుభవించడాన్ని కళ్ళారా చూసి తాను ఊపిరిపోసిన తనయుడు తన కన్నుల ముందే విగతజీవుడవుతూ ఉంటే అలవి కాని దుఃఖ భారంతో మరియతల్లి విలవిలలాడారు. ఆ తరుణంలో ఆ కలువరి గిరి పై క్రీస్తు సిలువ నీడన మరికొందరు పుణ్య స్త్రీలు కూడా ఉన్నారు. వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు‌. కానీ వారు అనుభవించే ఆవేదనతో, తల్లిగా మరియ అనుభవించే గర్భశోకాన్ని సరిపోల్చడం సాధ్యం కాదు. కరుణతో కార్చే కన్నీరు వేరు, గుండె పగిలి రాల్చే రక్తకన్నీరు వేరు. అభం, శుభం ఎరుగని తనయుడు అన్యాయంగా సిలువ శిక్ష అనుభవిస్తూ నిస్సహాయంగా మరణిస్తుంటే అశక్తురాలైన ఒక తల్లి పడే ఆవేదనను దేనితో సరిపోల్చగలం? క్రీస్తుని మరణ గడియల్లో మరియతల్లి అనుభవించిన బాధను వర్ణించటానికి మాటలు చాలవు.

రెండవ కారణం-:
మరియమాత శ్రమల అనుభవించటానికి ఆమె చేసినపాపాలు కారణం కాదు.ఆమె జన్మపాపరహితోద్భవి, కళంకం లేని కరుణామయి. గనక తన పాపాల పరిహారార్ధం శ్రమలు అనుభవించవలసిన అవసరం ఆ పుణ్య తల్లికి లేదు. మరి మరియతల్లి అంతటి ఘోరమైన శ్రమలను, కష్టనష్టాలను భరించటానికి కారణం ఏమిటి? దానికి కారణం పాపులమైన మనమే. అవును మానవులమైన మనం చేసిన పాపాలకు పరిహారం కోసమే క్రీస్తు ప్రభువుతో పాటు మరియతల్లి సైతం కష్టాలు అనుభవించవలసి వచ్చింది. మరియతల్లి మనకోసమే శ్రమలు అనుభవించారు.

వ్యాకులమాత చిత్రపటాలను మనం చూసినట్లయితే ఆమె హృదయం మీద ఏడు ఖడ్గములు మనకు కనిపిస్తాయి..ఆమె హృదయము మీద ఉన్న ఆ ఏడు ఖడ్గములు మరియతల్లి అనుభవించిన బాధలకు నిదర్శనం. మరియతల్లి అనుభవించిన 7 వ్యాకులములు ఇవి ఈ పవిత్రమైన సమయంలో వీటిని స్మరించుదాం

1. సిమియోను క్రీస్తుప్రభువు యొక్క భవిష్యత్తును, మరియు ఆ భవిష్యత్తులో వచ్చే శ్రమలను గూర్చి చెప్పినప్పుడు.
"ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల
పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది" (లూకా 2:34-35).

మోషే చట్టప్రకారం వారు శుద్ధి గావించు కొనవలసిన దినములు కావటం వలన(లూకా 2:22) మరియమాత యోసేపు గారు బాలయేసును తీసుకొని యెరుషలేము దేవాలయానికి వెళ్లారు. నిజానికి మరియమ్మ గారికి జన్మ పాపము లేదు... దేవుడు ఆ తల్లి జీవితాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించారు కాబట్టి శుద్దీకరణ సాంగ్యము అవసరం లేదు. అయినా దైవ చట్టానికి తలవంచి తనను తాను తగ్గించుకొని మరియమ్మ గారు శుద్దీకరణ పొందడానికి సిద్ధమయ్యారు. ఎవరైనా ఒక స్త్రీకి దేవుడు దర్శనమిచ్చి నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. కానీ నీ కళ్ళ ముందే నీ కుమారుడు మరణిస్తాడు.

నువ్వు చూస్తుండగానే దుర్మార్గులు కొందరు నీ కుమారుని ప్రాణాలు తీస్తారు అని చెబితే ఆ స్త్రీ ఏం చేస్తుంది? చదువుతుంటే మనకే కన్నీళ్లు వస్తున్నాయి! ఖచ్చితంగా ఏ అమ్మ దీనికి ఒప్పుకోరు కానీ మరియమ్మ గారు దీనికి భిన్నంగా ప్రవర్తించారు. తనకు జన్మించబోయే దైవ కుమారుడు లోక రక్షణ కోసం శ్రమలను అనుభవించి మరణించబోతున్నారని తెలిసి కూడా మరియమ్మ గారు ప్రభువుకు జన్మనివ్వడానికి సిద్ధపడ్డారు. మానవ రక్షణ కోసం మనకోసం తాను సైతం వ్యాకులమాతగా దుఃఖ భారాన్ని వహించడానికి తన కుమారుని కష్టాలలో కన్నీళ్ళలో పాలు పంచుకోవడానికి అంగీకరించారు. ఇది దేవుని చిత్తం. నేను ఆయన దాసురాలను అంటూ తన ప్రేమను వ్యక్త పరిచారు

2. దేవదూత కలలో కనిపించి,"శిశువును చంపుటకు హేరోదు రాజు వెదక బోవుచున్నాడు. కావున నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు అని దేవదూత పునీత జోజప్ప గారికి చెప్పినప్పుడు -

హేరోదురాజు బాలయేసును చంపడానికి భటులను పంపుతున్నాడని తెలియగానే మరియతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తక్షణమే పసిగుడ్డు బాలయేసును తీసుకుని భర్త యోసేపు గారితో కలిసి ఐగప్తునకు ప్రయాణమయ్యారు. ఆ రాత్రి వేళ ఆ చీకటిలో చలిలో పసిబిడ్డను తీసుకొని దేశం కాని దేశం ప్రాణభీతితో వెళ్లారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎంత నీరసంగా ఉంటుందో ప్రతి అమ్మకు ప్రతి అక్కకు తెలుసు. కానీ మరియమాత తన కన్నీటిని తుడుచుకుని మన సంతోషం కొరకు అంత మనోవేదనలో కూడా ముందుకు నడిచారు. పైగా అసలే కొత్త ప్రాంతం చేతిలో చిల్లిగవ్వలేదు, ఎలా బ్రతకాలి? పైగా వాహన సదుపాయం లేదు అంత దూరం ఎలా వెళ్లాలి అని ఆ తల్లి ఆలోచించలేదు దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించారు దుష్టరాజు హేరోదు నుండి బాల యేసును కాపాడుకోవాలని నిర్ణయించుకొని దుష్టుల బారి నుండి బాల యేసును కాపాడుకున్న గొప్ప మాతృమూర్తి మరియ తల్లి.

3. యెరూషలేము ఆలయములో ప్రభువు తప్పిపోయినప్పుడు -
మరియమ్మ గారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేసిన సంఘటన ప్రభువు తనకు 12 సంవత్సరాల వయసులో ఉండగా జరిగింది. యూదుల ఆచారం ప్రకారం మరియమాత, యోసేపు గారు పాస్కా పండుగకు యెరుషలేము వెళ్లారు. వారితో పాటు బాలయేసును కూడా తీసుకు వెళ్లారు. పండుగ దినాలు ముగిశాక వారు తిరిగి ప్రయాణం అయ్యారు. కానీ బాలయేసు అక్కడే ఉండిపోయారు. ఈ సంగతి తల్లిదండ్రులకు తెలియదు. తమ ప్రాంతం నుంచి వచ్చిన తోటి యాత్రికులతో కలిసి వస్తున్నారు అనుకుని ముందుకు కదలి పోయారు. అలా ఒక రోజంతా ప్రయాణం చేశాక బాలయేసు కోసం వెతికితే ఆయన ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మరియతల్లి

అనుభవించిన మనోవేదన అంతా ఇంత కాదు! అందరికీ అసలే కొత్త ప్రాంతం. పైగా పసి వయసు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు అనే విషయాలు ఆమెకు తెలియక సమయానికి తిన్నారా లేదా అని కన్నీరు పెడుతూ తల్లడిల్లిపోయారు. చివరికి వేద బోధకుల మధ్య బాలయేసు కూర్చుండి వారి బోధనలను వింటూ వారిని తిరిగి ప్రశ్నలు వేస్తున్నప్పుడు వారు బాలయేసును కనుగొన్నారు.

4) క్రీస్తు కలవరి కొండకు సిలువ మోసుకునిపోతూ మార్గంమధ్యలో దేవమాతకు ఎదురుపడినప్పుడు..

కఠినమైన సిలువ మార్గంలో పక్క త్రోవ వెంట వచ్చి మరియతల్లి తన కుమారుని కలిసి ఉండవచ్చు. వాళ్లిద్దరూ ఒకరి నొకరు చూసుకున్నారేగాని నోరు తెరిచి మాట్లాడకొలేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలాంటివి. మరియతల్లి ఈ సృష్టిలో ఏ తల్లి చేయని గొప్ప త్యాగాన్ని కేవలం మన కొరకు చేశారు.

ఆమె తలుచుకుంటే పిలాతు దగ్గరికి వెళ్లి ఎందుకు నా కుమారుడికి ఇటువంటి శిక్ష వేస్తున్నారు?, అతడు ఏ తప్పు చేయలేదు అని వాదించేవారు. కానీ మరియతల్లి ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు అలనాడు అబ్రహాము కుమారుని దేవుడు బలిగా కోరినప్పుడు అబ్రహాము ఏమీ ఆలోచించకుండా బలిపీఠం చెంతకు తన ప్రియ కుమారుని తీసుకువచ్చి బలి ఇవ్వబోయారు. దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని మెచ్చి.. విశ్వాసాలుకు తండ్రిని చేశారు. క్రీస్తు సిలువలో మరణించటం దేవుని ప్రణాళికలో భాగమని మరియతల్లికి ముందే తెలుసు తన ప్రియ కుమారుడు ఇలా సిలువ శ్రమలను అనుభవిస్తారు అని కేవలం మన కోసం కడుపారా కన్న తన ప్రియ కుమారుని యుద్ధానికి వెళుతున్న సైనికుడు వలె తయారుచేసి ఈ లోకానికి త్యాగం చేసిన గొప్ప మాతృమూర్తి మరియతల్లి..

5) క్రీస్తును అన్యాయంగా సిలువపై అవమానంగా వ్రేలాడదీసినప్పుడు
ఇంతవరకు క్రీస్తు నడవనైనా నడుస్తూ కదలాడనైన కదిలాడాడు. కానీ ఇప్పుడు అవకాశం లేదు. కొరడా దెబ్బల వలన శరీరం గాయాలతో నుజ్జునుజ్జయింది, శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టడం వలన చాలా రక్తం బయటకు పోయింది. శత్రువులు సిలువ చుట్టూ చేరటంవల్ల కనీసం గాలి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. శత్రువులు క్రీస్తును సిలువకు అంటగొట్టి అర్ధనగ్నంగా వేలాడదీశారు. ఈ దృశ్యాన్ని మరియతల్లి చూడలేకపోయారు... మనసులో మౌనంగా నరకయాతన అనుభవించారు..

6) ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని సిలువ మీద నుండి దించి మరియతల్లి ఒడిలో పెట్టినప్పుడు -:
సిలువపై నుండి దించిన క్రీస్తును మరియతల్లి ఒడిలో ఉంచారు. తన ముందే పెరిగి, పెద్దయిన క్రీస్తు నాధుని పార్థివ దేహాన్ని చూసి మరియతల్లి తల్లడిల్లిపోయారు. ఒక కంటితో తన బిడ్డ కోసం మరొక కంటితో ఈ లోకం కోసం కంటతడి పెట్టుకున్నారు...

7) ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని భూస్ధాపనము చేసినప్పుడు

ఏ తప్పు చేయని తన కుమారుడు దుష్టులైన యూదుల చేతికి చిక్కి అవమానాలను భరించవలసి రావటం మరియతల్లిని తీవ్రమైన మనోవేదనకు గురిచేశాయి. క్రీస్తు ప్రభువు రక్తాన్ని ఆ పవిత్రమైన రక్తాన్ని ఆమె చూసినప్పుడు తన కళ్ళు దుఃఖ సాగరంలో నిండిపోయాయి. ప్రభు దేహాన్ని నిలువెత్తు గాయం చేస్తున్నప్పుడు, మరియమ్మ గారి హృదయం తట్టుకోలేక కడుపు కోతతో వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ బాధను వర్ణించటం ఎవరి వల్ల కాదు! కానీ ఇవన్నీ మరియమాత భరించారు ఆమె ప్రస్తుత దుఃఖాన్ని చూడలేదు. భవిష్యత్తులో వచ్చే దేవుని రాజ్యాన్ని చూశారు. మన కొరకు శ్రమలను సైతం మౌనంగా భరించారు.

ముగింపు-:

"నన్ను అనుసరింపగోరు వాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను" (మత్తయి సువార్త 16:24).

క్రీస్తు భగవానుడు పై వాక్యంలో చెప్తున్నట్లుగా మన జీవిత యాత్రలో ఎన్ని కష్టనష్టాలు మనకు ఎదురుపడిన దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ మన జీవన సిలువలు మనం మోయాలి. మరియతల్లి చాలా కష్టాలు అనుభవించారు ఎన్నో కన్నీళ్లు కార్చారు. ఆ తల్లి విశ్వాస జీవితాన్ని చూచి దేవుడు ప్రతి కన్నీటి బొట్టును తుడిచి సంతోషంగా మార్చి అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. మన జీవిత యాత్రలో ఎన్నో కష్టాలు శ్రమలు మనకు ఎదురు పడుతూ ఉంటాయి వాక్యం అనే ఖడ్గంతో వాటిని ఎదుర్కొని నిలబడదాం క్రీస్తు మార్గంలో పయనిద్దాం ఆ తల్లి మద్యస్థ ప్రార్ధనా సహాయాన్ని వేడుకుందాం ప్రియ విశ్వాసులందరికీ "వ్యాకులమాత " పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను...

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN