ప్రార్ధనా కందములు!
కొండవీటి అంతయ్య.సత్తెనపల్లి.
30 Jul 2024
స్వామీ! మా పాప హరా!
ప్రేమ, కరుణలకిల మారు పేరీవు గదా!
శ్రీ మరియా సుత! దేవా !
కామిత మీడేర్చి నన్ను కావగ రావా!
దేవా! మొక్కే నయ్యా!
రావా! నాకు వరమీయ రావా దేవా!
నీవే ! కరుణా మయుడవు !
దేవా!ఓ మరియ సుతుడ!దిక్కిక నీవే!
నీ సిలువ పాట్లు తలచిన
గాసిలు నా మది నిరతము కరుణామయుడా!
ఈ సమయంబున మ్రొక్కెద
ఆ సిలువధరుడగు నీకె అంజలి నొసగీ!
ఆరాధించెద ప్రభువా!
ఓ రాజా యేసు దేవ!ఓర్పుగ నిన్నే !
నోరారా నీ జపమే
ఏ రోజూ మరువకుండ నిలలో చేసీ!
పిత సుత ఆత్మల త్రిత్వపు
కతలే మదిలో తలచెద ఘనముగ నేనే!
వెతలను బాపగ వేడెద,
సతతం స్తుతి మీ కనుచును శరణము కోరీ!