"శిష్యుల‌ ఎన్నిక - సువార్త పరిచర్యకు ఆహ్వానం"

ఫాదర్ పూదోట దాసయ్య

10 Jul 2024

సామాన్య 14వ బుధవారము
1. హోషేయ గ్రంథము 10:1-3, 7-8, 12
2. పునీత మత్తయి సువార్త 10:1-7
యేసుక్రీస్తు రక్షణ ఉద్యమంలో, శిష్యుల భాగస్వామ్యాన్ని ధ్యానించుదాము. ప్రభువే ప్రత్యేక విధముగా తనను అనుసరిస్తున్న వారిలో నుండి పండ్రెండు మందిని, తనతో ఉండుట కొరకు, సువార్త పరిచర్య నిమిత్తము ఎన్నుకున్నాడు. వారికి "అపోస్తులు" అని పేరు పెట్టాడు. సువార్త పరిచర్య నిమిత్తము పంపబడిన వారిగా, యేసు వారిని నియమించాడు. ప్రభువు చేత ప్రత్యేక విధముగా ఎన్నుకొనబడిన ఈ శిష్యులకే, సువార్త పరిచర్య బాధ్యతలను అప్పజెప్పాడు. అయితే ఈ బాధ్యతను తమ సొంత శక్తితో చేయలేరు. కనుక ప్రభువే వారికి అధికారాన్ని, శక్తిని ఇచ్చాడు.

సువార్త పరిచర్యకై అధికారికంగా నియమింపబడిన శిష్యులు:
యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారాన్ని ఇచ్చాడు. యేసు వారికి ఇచ్చిన ఈ అధికారంతోనే, శిష్యులు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. దైవ రాజ్యమును స్థాపించారు. సత్య సువార్తను బోధించారు. దేవుని మహిమ పరిచారు.

- యేసు, తన శిష్యులకి ఇచ్చిన ఈ అధికారము వలన, వారు యేసు నామమున ఆ అధికారాన్ని వినియోగించాలి.
- యేసు అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకూడదు.
- యేసు, వారికి ఇచ్చిన అధికారముతో, సాహసోపేతమైన సువార్త పరిచర్యను కొనసాగించాలి.
- ఎటువంటి పక్షపాతము లేకుండా, శిష్యులు తమ బాధ్యతను నిర్వహించాలి.
- వారికున్న అధికారముతో, దైవ రాజ్యమును స్థాపించాలి.
- అధికారమంటే పెత్తనం చేయడం కాదు, దైవ ప్రజల ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడాలి.
- యేసు వారికి ఇచ్చిన అధికారంతో, దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా వ్యవహరించాలి.
- యేసు పేరిట చేసే ప్రతి కార్యము, దైవ మానవ ప్రేమ ప్రతిబింబముగా ఉంటుంది.

సువార్త పరిచర్యకై శిష్యులకు సూచనలు:
యేసు ప్రత్యేక విధముగా ఎన్నుకున్న పన్నిద్దరు శిష్యులు, ప్రత్యేక అధికారాన్ని పొందారు. అంతేకాకుండా వారు సువార్త పరిచర్యను కొనసాగించడానికి యేసుప్రభువు వారికి తగిన సూచనలు చేశారు. శిష్యులు ఆ సూచనలను పాటిస్తూ యేసు పేరిట సువార్త పరిచర్య కొనసాగించాలి. అప్పుడే, వారి బాధ్యతను సక్రమముగా నిర్వహించినట్లు. యేసు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రభువు వారితో పాటే ఉంటూ, వారి బోధ యదార్ధమని నిరూపించాడు. ఆ విధంగా శిష్యుల విశ్వాసాన్ని బలపరిచాడు. వారు యేసు పాఠశాలలో తగిన శిక్షణను పొంది, యేసు పేరిట రక్షణోద్యమంలో పాలుపంచుకున్నారు. ఆ విధంగా ప్రధమ శిష్యులు, దైవరాజ్య సారథులుగా ముందుకు సాగారు. "చెదిరిపోయిన గొర్రెల వలే నున్న ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించండి" ఈ మాటలతో యేసు, శిష్యుల పరిచర్యను ప్రోత్సహించాడు. యేసు ప్రత్యేక విధముగా వారికి ఇచ్చిన ఈ బాధ్యతను నిర్వహిస్తూ, ప్రభువు ప్రతిరూపాలుగా తమ జీవితాన్ని మలుచుకోవాలి. ఈ గొప్ప అవకాశాన్ని మానవమాత్రులమైన మనకు ఆయన అనుగ్రహించడం, లోక రక్షణ ఉద్యమంలో మనము పాలుపంచుకోవడం, దేవుని కృపగా భావించుదాం.

యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రచారము నిమిత్తము శిష్యులను పంపుచు, అన్యజనులుండు ప్రదేశాలకు వెళ్ళకూడదు అన్నాడు. అదేవిధంగా సమరియ పట్టణాలకు కూడా వెళ్లవద్దని సూచించాడు. అంటే వాళ్లు రక్షణ పొందకూడదని ప్రభువు ఉద్దేశముగా భావించకూడదు.‌ మెస్సయ్య రాకడ గురించి ఇంకను వారికి ఎటువంటి అవగాహన లేదు. కావున శిష్యులు వారి మధ్యకు సువార్త ప్రచారముకై వెళ్ళుట వలన, ప్రజలలో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. అన్యులకు, యూదులకు మధ్య ఉన్న ఎన్నో భేదాభిప్రాయాలు తొలగి పోవాలంటే, కాలక్రమేనా ప్రజలందరినీ ఒకే సంఘముగా ఐక్య పరచాలి. ఈ పరిచర్యను యేసు శిష్యులకు పెద్ద కోస్తూ పండుగ రోజున వారిపై పవిత్రాత్మ దిగివచ్చిన తర్వాత ఆరంభింపవలసి ఉన్నది. ఆరంభములోనే శిష్యులు అన్యుల ప్రాంతాలను సందర్శించడం ద్వారా, ‌‌ వారి ప్రబోధాల ద్వారా ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. పవిత్రాత్మ వారిపైకి దిగివచ్చిన తరువాత, పవిత్రాత్మ నడిపింపులో లోకమంతటా సువార్త ప్రచారాన్ని కొనసాగించాలి. అంచేత ముందుగా శిష్యులకు, చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలకు సువార్తను బోధించండని యేసు చెప్పాడు. మొదట శిష్యులకు ప్రభువు శిక్షణ ఇస్తున్నాడు. ఆ పరిచర్య లోకమంతటా విస్తరిస్తుంది. శిష్యులు తమ క్రియల ద్వారా యేసుక్రీస్తు లోక రక్షకుడని, ప్రజలకు సాక్ష్యముగా జీవించాలి. అప్పుడు వారి జీవితమే గొప్ప ప్రబోధంగా మారుతుంది.

సువార్త పరిచర్యలో ప్రధానంగా, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించాలి. పరలోక రాజ్యం అంటే తినుట, త్రాగుట కాదు, పవిత్రాత్మ వొసగు నీతి, శాంతి సంతోషాలు. ఈ బాధ్యతను శిష్యులు సమర్థవంతంగా నిర్వహించాలంటే, యేసు వారికి ఇచ్చిన అధికారాన్ని, శక్తిని, విశ్వాస పాత్రులైన సేవకులుగా ఉపయోగించాలి. యేసు వారికి చేసిన సూచనలను పాటిస్తూ, ఈ పవిత్ర కార్యాన్ని కొనసాగించాలి. నేడు క్రైస్తవ ప్రబోధకులందరికీ ఇదే వర్తిస్తుంది. ప్రభువు పిలుపును అందుకున్న తర్వాత, దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలను సేవాభావంతోనే చేయాలి. స్వప్రయోజనాలను ఆశించడం కానీ, బందు ప్రీతితో ఆ పరిచర్యను బ్రష్టు పట్టించడం కానీ, సువార్త సేవకు ఆటంకములుగా మారడం కానీ, వారికున్న అధికారాన్ని ఈ లోక పేరు ప్రతిష్టలకు వాడుకోవడం కానీ చేయకూడదు. అంతేకాకుండా దైవ ప్రజలు కూడా, సువార్త సేవకులను, ప్రభువు శిష్యులుగా ఆదరించాలే కానీ, లోక సంబంధమైన వ్యవహారాలకు, అవసరాలకు ఉపయోగించుకోకూడదు. సువార్త పరిచర్య బలహీన పడకుండా ఉండాలంటే, తొలినాటి శిష్యులు ఏ విధంగా క్రీస్తుపై ఆధారపడి తమ పరిచర్యను కొనసాగించారో, అదేవిధంగా సువార్తీకులందరూ, ఈ పరిచర్యను తమ కార్యముగా కాకుండా, దైవ కార్యముగా చేయాలి. సకల సృష్టి రక్షింపబడాలని, ఆత్మల రక్షణ ఉద్యమంలో దేవుడు మనకు ఇచ్చిన ఈ భాగస్వామ్యాన్ని విశ్వాస దీక్షతో కొనసాగించుదాం. దేవుని రాజ్యం వర్ధిల్లాలి. సత్య సువార్త ప్రకటింపబడాలి. అందరూ ప్రభువు శిష్యులుగా దేవుని మహిమ పరచాలని ఆశించుదాం. ఆమెన్.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN