దైవ సమయం కొరకు వేచి ఉండు.

ఫాదర్ గోపు ప్రవీణ్

15 Jun 2024

11 వ సామాన్య ఆదివారం,
యెహెజ్కె. 17:22-24;
2 కొరి. 5:6-10;
మార్కు 4:26-34

మనమంతా తక్షణమే పనులు జరిగిపోవాలన్న శకంలో ఉన్నాం. సమాచార విప్లవం, ఆధునిక పరికరాలతో క్షణాల్లో అటువైపు ఉన్న ఖండాల వారితో మాట్లాడుతూ, పనులు చేస్తున్నాము, చేయించుకుంటున్నాము. నేడు అందరికి సమయం విలువ తెలిసిపోయింది. ఫలితం - అసహనం, ఇతరుల కోసం ఎదురు చూడలేకపోవటం.

నేటి సువిషేశములో రెండు ఉపమానములను వింటున్నాము. మొదటిది "పండిన పంట" (4:26-29). ఇది కేవలము మార్కు సువార్తలో మాత్రమే చూస్తాము. రెండవది ఆవగింజ ఉపమానము (4:30-34). ఈ రెండు ఉపమానములద్వారా, ప్రభువు దైవరాజ్యము గురించి బోధిస్తున్నారు. రెండు వేల సం.ల క్రితమే దైవరాజ్యము అనే ఈ విత్తనాన్ని ప్రభువు ఈ లోకములో నాటారు. అలాగే, జ్ఞానస్నానము పొందినప్పుడు, ఆ విత్తనాన్ని మన హృదయములో నాటారు. దైవరాజ్యం శక్తిగలది. అది మనలో పెరుగుతూనే ఉంటుంది.

రెండు ఉపమానాలు కూడా గింజల గురించి చెప్పబడినవి. తన చుట్టూ చేరిన వారికి, దైవరాజ్యము ఎలా ఉన్నదో మొదటి ఉపమానము ద్వారా ప్రభువు తెలియ జేశారు. "దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి తన పనిపాటులతో మునిగిపోయెను. వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమిమీదనుండి మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును" (మార్కు. 4:26-28). ఉపమానములో విత్తనములపై ద్రుష్టి సారించడం చూస్తున్నాము. ఎందుకన, అవి స్వయముగా ఎదిగే శక్తిని కలిగి యున్నాయి. దేవుని రాజ్యము కూడా ఇలాగే యున్నది. ప్రభువు ఈ లోకములో ఉండగా, తన జీవితం, అద్భుతాలు, బోధనలు మరియు తన శ్రమల ద్వారా దైవరాజ్య విత్తనాలను వెదజల్లాడు. అయినను, దైవరాజ్యము ఇంకా పూర్తిగా స్థాపించబడలేదు. అది ఇంకా ఫలించ వలసి యున్నది. ఉపమానములోని విత్తనం పెరగడానికి సమయం అవసరమో, దైవరాజ్యానికి కూడా సమయం కావాలి.

దైవరాజ్యం పొలములో నాటబడిన విత్తనమును పోలియున్నది. విత్తనము మొలకెత్తి పెరిగి పెద్దదగును. మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును. దైవరాజ్యము కూడా నెమ్మదిగా, కాని స్థిరముగా అభివృద్ధి చెందును. ప్రకృతిలో ఎదుగుదల స్థిరముగా ఉంటుంది. అది పగలు, రాత్రి, ప్రజలు మేల్కొన్న, నిద్రిస్తున్న ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. మానవుని ప్రమేయం లేకున్నను, ప్రకృతిలో ఎదుగుదల స్థిరముగా ఉంటుంది. ఇదంతయు దైవకార్యము. తన కుమారుడైన క్రీస్తుద్వారా, ఈ ఎదుగుదలను దేవుడు కలుగజేయు చున్నారు. ఆధ్యాత్మిక జీవితములో, 'పంటకాలం' లేదా 'కోతకాలం', తీర్పు దినమును సూచిస్తుంది. మన ఎదుగుదలలో అనేకసార్లు, దేవుని తోడ్పాటు లేదని గ్రహిస్తాం. కాని, దేవుని తోడ్పాటు ఎప్పటికీ ఆగదు అని మనం గ్రహించాలి. దేవుని రాజ్యముకూడా స్థిరముగా ఎదుగుతూ, అంతిమ కాలము వరకు కొనసాగును. ఇక్కడ ప్రధానమైన అంశం, విశ్వాసము. విశ్వాసము పెరుగు కొలదీ, దైవరాజ్యము పెరుగును. విశ్వాసములో ఎదగడం అనేది జీవితకాల ప్రక్రియ! విత్తనము ఏవిధముగానైతే, భూమినుండి, పోషణను, బలమును పుంజుకొని పెరుగునో, అలాగే ఒక విశ్వాసి, ప్రార్ధన, వాక్కు, దివ్యసంస్కారాలద్వారా బలపడుచూ ఎదగాలి.

విత్తనములు మొలకెత్తి పెరిగి, పెద్దవి అయ్యేవరకు యజమాని ఎలా ఎదురు చూశాడో, ప్రేమగల దేవుడు మన కోసం అలా ఎదురు చూస్తున్నాడు. దేవుడు కోపగించడానికి, శిక్షించడానికి తొందర పడడు; వేచిచూస్తాడు. పాపి పశ్చాత్తాపానికి మరో అవకాశం ఇస్తాడు. మన లోపాలను భరిస్తాడు. పరితాప హృదయం కోసం ఎదురుచూస్తాడు. మనంకూడా దైవస్వభావంలో పాలుపంచు కోవాలి. ప్రభువు మనస్తత్వాన్ని కలిగియుండాలి (ఫిలిప్పీ. 2:5).

ఆవగింజ ఉపమానము: దేవుని రాజ్యం ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనములకంటే చిన్నదైనను, భూమిలో నాటబడినప్పుడు, మొక్కలన్నింటి కంటే పెద్దదై, కొమ్మలతో, రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. దేవుని రాజ్యం సకల జాతులకు, ప్రజలకు ఆశ్రయమిచ్చును. దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ఆయన వాక్యం ప్రకారం జీవించినప్పుడు, దేవుని రాజ్య అభివృద్ధిలో భాగస్థుల మవుతాము. దేవుని వాక్యం ప్రకారం జీవించాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్ధిస్తూ, మన జీవితాలను దేవునికి అర్పించుకోవాలి.
బంగారు భవిష్యత్తుకోసం అందరం కలలు కంటాం. ఆశగా ఎదురు చూస్తాం. 'మంచి రోజులు ముందున్నాయి' అన్న ఆశే మనలను ముందుకు నడిపిస్తుంది. ఈ ఆశకు, దైవరాజ్య పరిపక్వతకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎదుగుదల, పెరుగుదల, అభివృద్ధి - నిరంతరం జరిగే ప్రక్రియ. పుట్టిన పిల్లవాడు రోజురోజుకు పెరుగుతూనే ఉంటాడు. ఇది అనుదినం మన కళ్ళముందే జరిగే విషయం, కాబట్టి మనకు తెలియకుండానే ఈ మార్పు జరుగుతుంది. అలాగే, దైవరాజ్యం దేవుని కృప, అనుగ్రహము. అదికూడా క్రమక్రమంగా ఈ లోకములో విస్తరించును. దేవుని చిత్తమును మనం నెరవేరిస్తే, ఆ దైవరాజ్యంలో అది భాగమే అవుతుంది.
కనుక, దైవరాజ్యం, దాని విలువలు మన హృదయాల్లో, కుటుంబాల్లో, గ్రామాల్లో, దినదినం పెరుగుతూ, విస్తరిస్తూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, మన అనుదిన నిర్ణయాల్లో దేవునివైపు మరింతగా మ్రొగ్గుచూపుతూ ఉండాలి. "మన నిరీక్షణయందు విశ్వాసము కలవారమై ధైర్యము వహించినచో, మనమే ఆయన గృహము" (హెబ్రీ. 3:6). ఈ బృహత్తర దైవకార్యములో దైవాశీస్సులు మనకు తోడైయుండునుగాక!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN