మెరిసిన నక్షత్రం మురిసిన ప్రపంచం

జోసెఫ్ అవినాష్
03 Dec 2025
ప్రశ్న-:
క్రిస్మస్ కాలంలో క్రైస్తవులు స్టార్స్ ను ఎందుకు పెడతారో తెలుసా?
సమాధానం-:
క్రిస్మస్ వెలుగుల పండుగ దానికి సంకేతంగా మన గృహాలలో దేవాలయాలలో,గ్రామపుర వీధులలో క్రిస్మస్ స్టార్స్ ను అమర్చి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తాం.అయితే అసలు ఈ స్టార్‌ని ఎందుకు పెడతారు..?. దాని వెనుక ఆసక్తికరమైన కోణం ఏమైనా ఉందా..?ఈ వ్యాసంలో తెలుసుకుందాం
"ప్రభువు ఇట్లనుచున్నాడు: బేత్లెహేము ఎఫ్రాతా! నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు అయినను యిస్రాయేలును ఏలబోవువాడు నీ నుండియే ఉద్భవించును పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము వరకు ఆయన సాక్షాత్కరించువాడు" (మీకా 5:2)
లోకరక్షకుడైన దైవ కుమారుడు క్రీస్తు బెత్లహేములో జన్మిస్తారని ప్రవక్తలు క్రీస్తు పుట్టక మునుపే ప్రవచించారు.ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ క్రీస్తు బెత్లెహేములో జన్మించారు(మత్తయి 2:1).పశువుల తొట్టెలో యేసుక్రీస్తు జన్మించుట ద్వారా ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడని రుజువు చేయబడింది.ఆయన జన్మించిన తరువాత మొట్టమొదటగా ఆయన్ను దర్శించినవారు సామాన్యులైన గొర్రెల కాపరులు.క్రీస్తు ఎక్కడో రాజభవనంలో పుట్టి ఉన్నట్లయితే సామాన్యులు ఆయన్ను చూడగలిగేవారు కాదు.యేసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టింది.మిగతా నక్షత్రాలకంటే అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ నక్షత్రం వైపే అందరి దృష్టిపడింది.ఎప్పటి నుండో నక్షత్రాలపై పరిశోధన చేస్తున్న జ్ఞానులకు ఆకాశంలో ఓ విచిత్ర నక్షత్రం తారసపడింది.అది ఒక ప్రత్యేక నక్షత్రం అని వారు గుర్తించి దానిని వెంబడించడం ప్రారంభించారు(మత్తయి 2:2).ఆకాశంలో నక్షత్రం కొత్తగా ప్రకాశవంతంగా పుట్టిందని జగతిని కాపాడేందుకు గొప్పవారు జన్మించరానే నమ్మకంతో ఆ తార వైపు పయనించసాగారు జ్ఞనులు. తూర్పుదేశ జ్ఞానులు ఆకాశంలో ప్రకాశిస్తున్న తార ఎటు కదిలితే అటు పయనించారు.ఈ నక్షత్రం జెరుసలెంలోని బెత్లహంలో పశువులకొట్టం వద్ద తనప్రయాణాన్ని ఆపింది. పశువుల కొట్టం వద్ద తూర్పుదేశ జ్ఞానులు అప్పుడే జన్మించిన క్రీస్తును కనుగొన్నారు.సాష్టాంగ పడి బాలయేసును ఆరాధించి కానుకలు సమర్పించారు.క్రీస్తు జన్మించిన ప్రదేశానికి జ్ఞానులకు దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా మనం మన ఇళ్లల్లో, దేవాలయాలలో క్రిస్మస్ స్టార్స్ ఏర్పాటు చేస్తాము. క్రిస్మస్‌కు నెలరోజుల ముందుగానే ఈ స్టార్‌ను ఏర్పాటు చేస్తాము.
