ఆగమన కాల ధ్యానాంశము- 3వ రోజు

గిడుతూరి అమల జ్యోతి

03 Dec 2025

*"దేవుని రాకకై ఎదురుచూపు!"*

*( కీర్తనలు 23:1-6 )*
*- "ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయులేదు.*
*అతడు నన్ను పచ్చికపట్టులలో ప్రవేశింపచేయును‌*
*శాంతికరమైన జలములయొద్దకు*
*నడిపించుకొనిపోవును.*
*- నా ఆత్మను సేద తీర్చును‌*
*తన నామగౌరవార్థము*
*నన్ను ధర్మమార్గమున నడిపించును.*
*- గాఢాంధకారపు లోయలో పయనించునపుడును*
*నేనెట్టి అపాయమునకు భయపడను.*
*ఎందుకన నీవు నాకు తోడుగానుందువు.*
*నీ బడితయు, నీ కోలయు*
*నన్ను కాపాడుచుండును."*

- దేవుడు అనంత ప్రేమామయుడు! ఆయన సృష్టించుకున్న ఆయన ప్రజలమైన మన యెడల ఆయనకు ఉన్న ప్రేమ! దయ, కారుణ్యము, క్షమాపణ, ఈ సృష్టిలో ఒకరి యెడల మరొకరికి, లేవు, ఉండవు. ఈ లోక ప్రేమలు స్వార్థపూరితమైనవి. పొందుకొనుటమే కానీ, ఇవ్వడానికి ఇష్టపడరు.

- ఒక్కసారి మనల్ని మనవారు కానీ, వేరే వారు ఎవరైనా కానీ, బాధ పెడితే జీవితాంతం మరచిపోము.

- కానీ, మన దేవుడు! మనం చీకటిలో జీవించుచున్నప్పుడు కూడా, పాపములు చేస్తున్నప్పుడు కూడా, దుర్మార్గములు చేస్తున్నప్పుడు కూడా, మనల్ని విడువక, ఎడబాయక, మనకు నిత్య తోడై ఉండి, మనల్ని రక్షిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. క్షమిస్తున్నారు.

- దేవుడు! మన నిత్య కాపరి. మనల్ని కాపాడుతూ... మనకు ఏ అపకారము రాకుండా... మనకు సమస్తమును దయచేయుచూ... మనము శాంతిగా... సంతోషంగా ఉండడానికి మన మంచి కాపరి అయిన మన రక్షకుడు నిత్యము మనకు తోడుగా ఉన్నారు.

- ఈ లోక మనుషులు మనల్ని చీదదరించుకున్ననూ... ఈ లోక మనుషులు మనల్ని మోసం చేసిననూ... కలత చెందవలసిన అవసరం మనకు ఏమాత్రం లేదు. ఎందుకంటే మన మంచి కాపరి! మనకు నిత్యమూ... తోడై ఉన్నారు. ఈ లోక ప్రేమలకు, ఈ లోక వ్యామోహాలకు, ఈ లోకమాయలకు, ఈ లోక ఇష్టాలకు, ఈ లోక కల్లబొల్లి కబుర్లకు, మనం దూరముగా ఉండి.... ఆ దేవుని ప్రేమలో కరిగిపోదాం. ఆ విధంగా జీవించడానికి కావలసిన దైవ ప్రేమను అర్థం చేసుకొనే హృదయములను, మనకు దయచేయుమని, ఆ దేవునికి ప్రాధేయపడి ప్రార్థించుకుందాం.

- దేవుడు మన కొరకు ఏర్పాటుచేసిన రాజ్యములో చోటు సంపాదించుకొనుటకు, ఆయన రాకకై నిరీక్షిస్తూ... నా కాపరి నీవే దేవా! నన్ను కాయుము. నన్ను మీ వద్దకు చేర్చుకొనుము అని, నిత్యమూ.... మన హృదయంలో ఆశ కలిగి... నిత్యమూ... ఆ ప్రభువును వేడుకుంటూ... జీవిద్దాం. ఆమెన్.

పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమునకు, మహిమ కలుగునుగాక! ఆమెన్.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN