సకల ఆత్మల స్మరణ పండుగ ప్రత్యేకం

జోసెఫ్ అవినాష్

01 Nov 2025

తల్లి తిరుసభ ఆరంభం నుండే ఉత్తరించు స్థలం గురించి బోధిస్తున్నది.చాలా కొద్దిమంది మాత్రమే,పాపమునుండి పరిపూర్ణముగా శుద్ధీకరింపబడినవారిగా మరణించి దేవుని రాజ్యములో ప్రవేశించెదరు.చాలామంది పాపములోనే మరణిస్తూ ఉంటారు. అలాంటి వారి ఆత్మలు శుద్ధీకరింపబడాలి.దేవుని దయగల ప్రేమాగ్నిలో వారి పాపాలు దహింపబడాలి.ఇదియే ఉత్తరించు స్థలముగా తల్లి శ్రీసభ బోధిస్తున్నది.ఉత్తరించే స్థలంలోని ఆత్మల పాపపరిహారం కొరకు మనం చేసే పుణ్యక్రియలు ఆ స్థలంలో అలమటిస్తున్న ఆత్మలకు ఉపయోగపడతాయనేది విశ్వసనీయమైన వేదసత్యం.ఉత్తరించే స్థలంలోని ఆత్మలు తమకుతాము ఏలాంటి సహాయమూ చేసికోలేరు, తమ పాపావశేషాలకొరకు బాధలుమాత్రం అనుభవించగలరు, అంతే. వాళ్లకు వాళ్లు సహాయం చేసికోలేరు కనుక, మన సహాయం వాళ్ళకు అవసరమౌతుంది. పితృపాదుల బోధనల ప్రకారం ఉత్తరించు స్థలం “పరలోకమునకు ముందు గది” అని చెప్పవచ్చు! ఈ గది తాళం వేయబడి ఉంటుంది. ఆ గదిలోని ఆత్మలు మోక్ష భాగ్యానికై వేచి చూస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు ఆ గదిలోని ఆత్మలను ఖాళీ చేయించి ,పరలోకానికి పంపే తాళం చెవి మనందరి చేతుల్లోనే ఉంది.

శ్రీసభలో పండుగ ఏర్పాటు:
తల్లి శ్రీ సభ ప్రారంభం నుండే ఉత్తరించు స్థలం గురించి బోధిస్తున్నది. ఎందరో వేద పండితులు, పునీతుల సైతం ఈ స్థలం పై అనేక రచనలు వ్రాశారు. ఫ్రాన్స్ లోని క్లూని అనే గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బెనెడిక్టియన్ మఠం వుంది .ఆ మఠ శ్రేష్టులు పునీత ఒడిలో గారు మరణించిన మఠవాసుల కోసం ప్రత్యేక విధంగా పూజ ప్రార్థనలు చేయమని ఆదేశించారు. క్రమేనా అది ప్రపంచవ్యాప్తంగా అధికార పూర్వకంగా పరిశుద్ధ పాపు గారి ఆనతి మేరకు దైవార్చన ఆరాధన క్రమంలో భాగమైంది.

మూడు పూజలు ఎందుకు అర్పిస్తారు?
సకల ఆత్మల స్మరణ సందర్భంగా గురువు మూడు పూజలను సమర్పిస్తారు. ఈ దినం మూడు పూజలు చేయవచ్చునని 15వ బెనెడిక్ట్ పాపుగారు ఆగస్టు నెల 10వ తేదీ 1915 వ సంవత్సరంలోఅనుమతించారు .సాధారణంగా గురువు ఒకరోజులో ఒకే పూజ సమర్పించాలి ప్రజల కోసం తప్పనిసరి పరిస్థితులలో అవసరతను బట్టి సమర్పించే అనుమతి శ్రీసభలో ఉంది. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన అనేకమంది సైనికులు, పౌరులు ముక్తిభాగ్యం పొందేందుకు గురువు మూడు పూజలు సమర్పించవచ్చునని పరిశుద్ధ పాపుగారు సెలవిచ్చారు. ఒక పూజ తన తలంపు కోసం, మరొకటి ఉత్తరించు ఆత్మల కోసం, మూడవది పరిశుద్ధ పాపు గారి తలంపుల కోసం.

ఆత్మలు పరలోక ప్రాప్తి పొందుటకు మనం చేయవలసింది ఏంటి?-:
మనలో చాలామంది ఈ ఒక్కరోజు పూజలో పాల్గొని సమాధులను పూలతో అలంకరించి మరణించిన ఆత్మల కొరకు ప్రార్ధించి ఇక మరుసటి దినం నుండి అన్నీ మర్చిపోతారు. ఇది తప్పు ఉత్తరించు స్థలంలో ఎన్నో ఆత్మలు మన సహాయం కొరకు మన ప్రార్థనల కొరకు వేచి చూస్తూ ఉంటాయి. ఆ ఆత్మలలో మరణించిన మన తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, ఆత్మీయులు ఉండవచ్చు. ఉత్తరించు స్థలంలో ఆత్మలు అనిత్య శిక్షణ తగ్గించుకొని పరలోక ప్రాప్తితో ఉండాలంటే మనం భక్తిశ్రద్ధలతో ఈ క్రింది పనులు చేయాలి

1. పూజలు సమర్పించాలి-:
ఆరాధనలన్నిటికంటే శ్రేష్టమైనది దివ్యబలిపూజ. ఆత్మల రక్షణ కోసం పూజ పెట్టిస్తే అవి త్వరగా విడుదల పొందుతాయి.చాలామంది పూజ పెట్టిస్తారు. కానీ ఆ పూజలో పాల్గొనరు.డబ్బులు ఇచ్చాం ఇక గురువు చూసుకుంటారులే అనుకుంటారు.ఇది పొరపాటు పూజను పెట్టించే మనం ఆ పూజలో తప్పనిసరిగా పాల్గొని మరణించిన మన కుటుంబీకుల ఆత్మల మోక్ష ప్రాప్తికై విశ్వాసంతో ప్రార్ధించాలి.

2.పరిశుద్ధ జపమాల-:
జపమాల క్రైస్తవుని శక్తివంతమైన ఆయుధం. దివ్యబలిపూజ తరువాత జపమాల ప్రార్థనకు అంత బలం ఉంది. అందుకే మంగళవార్త జపంలో మనమంతా కూడా "ఇప్పుడును, మా మరణ సమయమందును ప్రార్థించండి తల్లి" అని మరియతల్లిని వేడుకుంటాం..ఉత్తరించు ఆత్మలను జపమాల ద్వారా ఆ తల్లికి సమర్పిస్తే అవి విడుదల పొంది మోక్షానికి చేరుకుంటాయి..

3.దివ్యసత్ర్పసాద ఆరాధన-:
పునీతులు దివ్య మందసం ముందు మోకరించి గంటలు తరబడి ప్రార్థించే వారు. ముఖ్యంగా మరణించిన ఆత్మలు మోక్షానికి చేరుకోవాలని బలంగా ప్రార్థించేవారు."దివ్యసత్ర్పసాద " ఆరాధన చాలా శక్తివంతమైనది."దివ్యసత్ర్పసాదం" క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువు.దివ్యసత్ర్పసాద ఆరాధనలో కూర్చోవడం అంటే సాక్షాత్తు క్రీస్తుతో కలిసి కూర్చోవడమే "దివ్యసత్ర్పసాద" ఆరాధనలో "ఉత్తరించు" ఆత్మల విముక్తికై ప్రార్థిస్తే తప్పక ప్రభువు ఆలకిస్తారు..

దానధర్మాలు-:
మృతుల ఆత్మ శాంతి కోసం మనం అన్నదానాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మృతుల ఆత్మలను అనిత్య గుండం నుండి కాపాడాలంటే మంచి మనసుతో దానధర్మాలు చేయాలి తప్పక ఆత్మలు రక్షణ పొందుతాయి..

చివరిగా-:
పూలతోటలో, మనకు ఇష్టమైన, అందమైన పూలు కోయబడినప్పుడు మనకి ఎంతో బాధ, దు:ఖము కలుగుతుంది. కాని, పూలతోట అధికారి వాటిని కోసి, వాటిని తగిన స్థలములో ఉంచినప్పుడు, సంతసిస్తాము. అలాగే, జీవితమనే అందమైన ఈ పూలతోటలో, అందమైన పూలలాంటి మన ఆప్తులు మరణించినప్పుడు మిక్కిలిగా బాధపడుతూ ఉంటాము. కాని ఈ జీవితాలకు సృష్టికర్త అయిన దేవుడే స్వయముగా వారిని పిలచి, వారికి తన రాజ్యములో తగిన స్థానమును ఒసగినప్పుడు మనము మిక్కిలిగా సంతోషించాలి. వారు దేవుని సమక్షములో క్షేమముగా ఉన్నారని భావించాలి.మరణం ఓ గమ్యాన్ని ఏర్పరుస్తుంది. అది దేవుని సన్నిధికి చేరుస్తుంది. చాలామంది మరణానికి భయపడుతుంటారు.పునీత అవిలాపురి తెరసేమ్మ గారు ఈ విధంగా పలుకుతున్నారు. "నేను దేవుని చూడాలని కోరుకుంటున్నాను". కానీ ఆయన చూడాలంటే నేను మరణించాలి అని అన్నారు. పునీత పౌలు గారు మరణించటం నాకు లాభదాయకం అన్నారు. మరణం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. ఆ గడియను దేవుడు నిర్ణయిస్తారు. మంచి మరణానికి మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి. మంచి మరణానికి పాలకులైన జోజప్ప గారి ప్రార్థనా సహాయాన్ని అనునిత్యం వేడుకోవాలి.మరణించిన మన స్నేహితులు, కుటుంబీకులు గుర్తుకు వస్తే బాధతో ఏడుస్తాం బాధపడకండి ఖచ్చితంగా మనం వారిని పరలోకంలో కలుస్తాం. అబ్రహం గారు మరణించి మోక్షంలో తన పూర్వీకులను కలుసుకున్నారు(ఆది 25:8) ఈనాడు ఉత్తరించు స్థలంలో వున్న ఎన్నో ఆత్మలు మోక్షానికి చేరుకోవాలని మనమంతా ప్రార్థించుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN