పునీతులు అంటే ఎవరు? (సకల పునీతుల పండుగ ప్రత్యేకం)

జోసెఫ్ అవినాష్
31 Oct 2025
శ్రీసభ సకల పునీతుల పండుగను ప్రతి ఏడాది నవంబర్ 1న కొనియాడుతోంది.ఈ ఉత్సవం శ్రీ సభ 5 మరియు 6 శతాబ్దాల నుండే జరుపుకుంటుంది.క్రీ.శ.827-844 లో జగద్గురువులైన 4వ గ్రెగోరి పోపు గారు క్రైస్తవ జనావళిని పుణ్యపధంలో నడపడానికి గాను పరలోక నాధుని సమక్షంలో నున్న పునీతులను ప్రార్థించమని ప్రప్రథమంగా ఏర్పరిచారు. గతంలో ఈ పండుగను మే 13న జరిపేవారు.కాని 4వ గ్రెగోరి పోపుగారు ఈ మహోత్సవాన్ని నవంబర్ 1కి మార్చారు 12వ శతాబ్ద క్రైస్తవులు ఈ పండుగకు ముందు రాత్రి జాగరణ చేసేవారు. 1955 నాటికి ఈ పద్ధతి మానుకోబడింది. ఆ తర్వాత 6వ పౌలు పోపు గారు "మన కష్టాలలో సకల పునీతులు ఆదుకొనగలరు" ఆ పునీతులే మనకు మార్గదర్శకులు" అని నుడివారు
పునీతులను శ్రీసభ ఎందుకు గౌరవిస్తుంది?
ఈ పండుగ మోక్షానికి చేరిన పునీతులందరినీ గౌరవించటానికి ఏర్పరపబడింది. ఎందరో పునీతులున్నారు. పలువురు పలు విధాలుగా భూలోకంలో క్రీస్తును అనుసరించి పరలోకాన్ని చేరారు. ప్రతి ఒక్కరికి భూలోక జీవితంలో ఒక పిలుపు ఉంది. ఆ పిలుపునసురించి ప్రతివాడు తన జీవితాన్ని మలచుకొని, దేవుని సహకారంతో వరప్రసాదాలతో తన కర్తవ్యాన్ని నెరవేర్చి తన గమ్యాన్ని చేరుకున్నాడు. వారి పవిత్రతలో, పరిపూర్ణతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు అందరూ క్రీస్తును అనుసరించినప్పటికీ అంతా ఒక మార్గంలో పయనించలేదు. ఒకే విధంగా జీవించలేదు కొందరు ఎన్నో తపస్సులు చేశారు,. ఉపవాసాలు చేశారు ప్రార్థనలు చేశారు. కొందరు వేదసాక్షులుగా తమ రక్తాన్ని క్రీస్తు కొరకు చిందిస్తే ,మరికొందరు సువార్త ప్రచారకులుగా ఎంతో శ్రమించి ఉత్తమమైన జీవితం జీవించారు. కొందరు సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ తమ అనుదిన కర్తవ్యాలను సక్రమంగా నెరవేరుస్తూ కాలం గడిపారు. అందరూ పరలోక జీవితానికి యోగ్యులుగా ఎంచబడ్డారు. పునీతులు క్రీస్తుని ప్రతిబింబాలు. కనుక పునీతులకు మనం చేసే గౌరవ మర్యాదలు క్రీస్తుకే చేరతాయి. ప్రొటెస్టెంట్ సహోదరులు మనం పునీతులను పూజిస్తున్నామని అబద్ధ సాక్షాలు పలుకుతారు. కతోలికలమైన మనం పునీతులను పూజించటం లేదు. దేవుని ప్రతినిధులుగా వాళ్లని మనం గౌరవిస్తున్నాం..
మన అనుకరణ-:
పునీతుల ఆదర్శాన్ని మనం అనుకరించటానికి ఈ పండుగ ఏర్పరపబడినది. వారిని గౌరవించనంత మాత్రాన సరిపోదు. వారి సహాయాన్ని వేడుకున్నంత మాత్రాన సరిపోదు.వారి జీవితాన్ని అనుసరించి వారు చేరిన స్థలానికి మనం కూడా చేరాలి. పునీత అగస్టీన్ గారు ఈ లోకంలో మొదట పాప జీవితాన్ని గడిపి తర్వాత పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందారు. అగుస్తీను తన పరివర్తనకు ముందు అనేకమంది పునీతులు తమ శారీరక వ్యామోహాలను వాంఛను ఎలా అణిచివేసుకుని దైవ సేవ చేశారో తలంచాడు. "వారు అట్లు చేయగలిగినప్పుడు నేను మాత్రం ఎందుకు చేయలేను" అని భావించి దృఢ నిశ్చయము చేసుకొని హృదయ పరివర్తన చెందాడు. పునీతుడయ్యాడు. పునీతులకు ఒసగిన అనుగ్రహాలను దేవుడు మనకు కూడా ప్రసాదిస్తారు. పరలోకంలో ఉన్న పునీతులలో రాజులున్నారు, పాలకులున్నారు ఉన్నతాధికారులు ఉన్నారు. పండితులు ఉన్నారు, చిన్నారి బిడ్డలున్నారు ,యువతి యువకులున్నారు బోధకులున్నారు, పోపుగార్లు పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు ఉన్నారు, సామాన్య విశ్వాసులు కూడా ఉన్నారు. మన స్థాయిలో ఉండి క్రైస్తవ జీవితాన్ని జీవించి పరలోకానికి చేరిన వారు ఎందరో ఉండగా మనం మాత్రం అచ్చటకు ఎందుకు చెరలేము అనే భావన మనలో కలగాలి అట్టి భావంతో దృఢ నిశ్చయం చేసుకోవాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి..
ముగింపు-:
పునీతులు ఉపయోగించిన రక్షణ సాధనాలు మనకు కూడా ఉన్నాయి.. అవే దేవుని వాక్కు,జపమాల, పవిత్ర సంస్కారాలు,దివ్యసత్ర్పసాదం వీటిని మనం ఉపయోగించుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఆప్రభువు ఆజ్ఞను పాటించుటవల్ల ప్రతి వ్యక్తి పునీతుడై తరిస్తాడు. దేవుని విశ్వసించిన నీతిమంతులు జీవిస్తున్న పునీతులే.
క్రైస్తవులు పునీతుల పేర్లు పెట్టుకోవాలి, అమితంగా గౌరవించాలి, వారి విశ్వాసాన్ని అనుసరించాలి. దేవునికి ప్రీతి పాత్రులైన వీరిని పిల్లల పేర్లతో ఇంట్లోకి పిల్చుకోవడం దేవుని పిల్చుకోవడం కాదా? వారితలంపు, భక్తి విశ్వాసాలకు ప్రోత్సాహం కాదా ? అవును మనం వారి మధ్యవర్తిత్వాన మేలులు పొందాలి. పదుగురికి పంచాలి. ప్రభు సాక్షులం కావాలి. (తీతు. 3:1-11, 1 పేతు. 2:5, 9-10)
పునీతుల జీవితాలను అనుసరించిన వారు పుణ్య జీవితం జీవించి పునీతులు కాగలిగారు. మనం కూడా పునీతుల పుణ్య బాటలో నడిచి లోకాశలను విడిచి ప్రభువును అంటిపెట్టుకొని జీవించాలి. తప్పక ప్రభు మనకు కూడా పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తారు.. అందరికీ పేరుపేరున సకల పునీతుల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
