బూడిదను చల్లుకోవడంలో అర్థమేమిటి?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

01 Aug 2025

ప్రశ్న-:
పూర్వ నిబంధనలో యూదులు, గోనె పట్టలు ధరించి, బూడిదను చల్లుకోవడంలో అర్థమేమిటి? ఇవి దేనిని సూచిస్తున్నాయి?

సమాధానం -:
గోనెపట్టలు ధరించడం, బూడిదను చల్లుకోవటం అనేవి విలాపాన్ని,అపరాధ భావాన్ని, మారుమనస్సును సూచిస్తూ చేసే క్రియలు.ఒక వ్యక్తి తన హృదయ పరివర్తనను చూపించడానికి గోనెపట్టలు ధరించేవాడు.బూడిదలో కూర్చునేవాడు.గోనెలు మేకచర్మానికున్న వెంట్రుకలతో చేయబడి,గరుకుగా ఉండేవి. ఇవి ధరించినపుడు ఎండిపోయిన ఈ వెంట్రుకలు గుచ్చుకుంటూ అసౌకర్యాన్ని కలిగించేవి.తాను చేసిన తప్పును,లేక తామున్న పరితాపకర స్మరించుకుంటూ ఆ వ్యక్తి ఈ అసౌకర్యాన్ని మనస్ఫూర్తిగా ఎన్నుకొంటాడు. ఎవరైనా మరణించినపుడు వారికోసం విలపిస్తూ తన సంతాపాన్ని తెలియజేయటానికి కూడా ఈ గోనెలను ధరించేవారు.అబ్నేరు వధింపబడినపుడు దావీదు, ఈవిధముగా చేయమని యోవాబుకు, అతని అనుచరులకు సూచించడం గమనించండి (2 సమూ 3:22-31) తన కుమారుడైన యోసేపు చనిపోయెనని తలంచిన యాకోబు కూడా అదే పనిచేశాడు. (ఆది 37:34), గోనెలను ధరించిన తరువాత,బూడిద చల్లుకోవడం లేదా అందులో కూర్చోవడం జరుగుతుంది. బూడిద వినాశనాన్ని, శిథిలావస్థను సూచిస్తుంది.దేశ పరిస్థితులు ప్రమాదంలో పడినపుడు, ప్రజలు, పశ్చాత్తాపపడుతూ దేవునికి మొరపెట్టుకోవడంలో ఇదొక భాగం (ఎస్తేరు 4:1) నినేవే ప్రజలు హృదయ పరివర్తనతో గోనెపట్టలు ధరించి,బూడిదలో కూర్చోవడం,యోనా ప్రవక్త గ్రంథంలో వివరించబడింది (యోనా 3:5-7),గోనెపట్టలను జంతువుల మీద కూడా కప్పి తమ పశ్చాత్తాపాన్ని దేవునికి తెలువడం విశేషం (యోనా 3:8)

సంక్షిప్తంగా,గోనె పట్టలు, బూడిద,మనిషిలోని అంతర్గత భావాలకు,స్థితికి,బహిరంగ సాక్ష్యం.మనిషిలోని పశ్చాత్తాపాన్ని,విచారాన్ని వ్యక్తం చేసే ఈ క్రియలు హృదయ పరివర్తనను సూచిస్తాయి.అయితే బయటకు కనిపించే ఈ క్రియలు కాకుండా, హృదయాన్ని మార్చుకొనుమని ప్రభువు సూచించడం గమనించాలి (యోవేలు 2:13).

నిజాయితీగల హృదయపరివర్తనకు సమాధానాన్ని దావీదు ఈవిధంగా వెల్లడిచేస్తాడు: "సంతాప సూచకముగా నేను తాల్చియున్న గోనెను తొలగించి,నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి" (కీర్తన 30:11). నిరసనను సూచించే ఇంకొక క్రియ వస్త్రములను చింపుకోవడం.ఇది తీవ్రమైన నిరసనకు, నిరాధరణకు, అసంతృప్తికి, విచారానికి నిదర్శనం. యేసుప్రభువు మాటలకు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని తీవ్రనిరసన తెలుపడం మత్తయి సువిశేషంలో గమనించగలం (26:65)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN