"సూది బెజ్జములో - ఒంటె ప్రవేశించడం" భావమేమిటి

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
04 Jul 2025
ప్రశ్న -
ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే, ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము..." (మత్తయి 19:24). ఈ భావంలో ధనవంతులకు దైవరాజ్య ప్రవేశం లేదని అర్ధమున్నదా?
సమాధానం -
"సూది బెజ్జములో - ఒంటె ప్రవేశించడం" అనే ఈ భావం, వినటానికే ఇదేదో అసాధ్యమయిందని తెలిసిపోతుంది. అయితే సామెత రూపంలో ఉన్న ఈ పోలిక వెనుకనున్న కథనం తెలుసుకోవాలి. సూదిబెజ్జము అనేది యెరూషలేము పట్టణ ప్రాకారానికున్న ఒక ద్వారము యొక్క పేరు. పట్టణ ప్రహరీ గోడకు తొమ్మిది లేక అంతకుమించి ద్వారాలుండేవి: (చదవండి: నెహెమ్యా 3వ అధ్యాయం). వాటిలో కొన్ని పేర్లు అందమయిన ద్వారము (Golden Gate - అపో. కా5.3:2), గొర్రెల ద్వారము (Sheep Gate నెహెమ్యా 3:32) లోయ ద్వారము (Dung Gate - నెహెమ్యా 3:13) మొదలయినవి. ప్రాకారపు ప్రధాన ద్వారాన్ని రాత్రిపూట శత్రువులు నుండి రక్షణ కోసం మూసివేసేవారు.అయితే ప్రజలలోనికి వెళ్ళడానికి ప్రధానద్వారం ప్రక్కగా ఒక చిన్న ద్వారాన్ని తెరిచేవారు. అది ఇరుకుగా, ఒక మనిషి పట్టేంతగా మాత్రమే ఉండేది. దీనినే "సూది బెజ్జము" అనేవారు. ఒంటె యూదులెరిగిన అతిపెద్ద జంతువు. యేసుక్రీస్తు, ధనం గురించి చెబుతూ, ధనానికి అంటుకుపోయిన హృదయం, పరలోకానికి చెందడం కష్టమంటారు. అది ఎంత కష్టమంటే, పెద్ద జంతువైన ఒంటె కూడా సూదిబెజ్జమనే ద్వారం గుండా వెళ్ళగలదేమోగాని, ధనాకాంక్షగలవారు, పరలోక ప్రవేశం పొందలేరు అని చెప్పినట్లుంటుంది. ఈ ద్వారం గుండా వెళ్ళడానికి ఒంటె ఎంత ఇబ్బందిపడుతుందో, ధనాపేక్షగలవారు పరలోకంలో ప్రవేశించడానికి అంతే కష్టపడతారు అన్నది ఈ సామెత సారాంశం. ఈ విషయం చెప్పేటప్పుడు ప్రభువు ఆ ద్వార సమీపంలో ఉండి ఉండాలి లేదా ఇది సామెతరూపంలో ప్రజావాడుకలో ఉండి ఉండాలి.
మనిషి తన అవసరం కోసం ధనాన్ని సృష్టించుకున్నాడు. కానీ తాను సృష్టించుకున్న సౌకర్యానికి తానే బానిస కాకూడదు. దాని అవసరత ఎంతవరకో తెలుసుకొని మసలుకోవాలి. ధనానికి దాసోహమంటే ఇక ప్రాధాన్యతలున్న విషయాలను మరచిపోతాడు. ధనం తానంతట తానే చెడ్డదికాదు. ధనవంతులంతా చెడ్డవారు కారు. యేసుప్రభువుకు కూడా ధనవంతులయిన స్నేహితులుండేవారు. పరిసేయుడైన సీమోను, జక్కయ్య, అరిమత్తయిలాంటి వారంతా ధనవంతులే! యేసుక్రీస్తు ధనవంతుల్ని ఆదరించాడు. కానీ ధనాన్ని అంటిపెట్టుకున్న వ్యామోహాన్ని తిరస్కరించాడు. ధనవ్యామోహం మూడు దౌర్భాగ్యాలను కలుగజేస్తుంది:
ధనాపేక్ష తప్పుడు ఆధారానికి దారితీస్తుంది. ధనాపేక్షగలవారు దేవునిమీద కాక, ధనంమీద, ధనంతో తానేమైనా చేయగలననే అహంభావం మీద ఆధారపడతారు. ధనంతో కళ్ళుమూసుకుపోయిన వ్యక్తిని “ఓరీ! అవివేకీ!” అంటూ పిలిచింది దైవవాక్యం (లూకా 12:20).
ధనాపేక్ష మనిషిని పతనావస్థకు చేరుస్తుంది. "నీ సంపదలున్న చోటునే నీ హృదయం ఉంటుంది" అన్నాడు ప్రభువు (మత్తయి 6:21). అటువంటి వారు ఇహలోకమే సర్వస్వమని భావించి, ఇక పరలోకం గురించి ఆలోచించడం మానుకునే ప్రమాదముంది.ధనాపేక్ష స్వార్ధాన్ని ఆవహింపజేస్తుంది. ధన వ్యామోహం "ఇక చాలు" అనే భావాన్ని రానీయదు. "ఇంకా కావాలి" అనే ధనాకాంక్షతో ఇతరులపట్ల ప్రేమను తుడిచివేస్తుంది.
