సికింద్రాబాద్ లో ఘనంగా క్రైస్తవ దినోత్సవం

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
04 Jul 2025
జూలై 3,2025 గురువారం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు సికింద్రాబాద్ లోని YMCA గ్రౌండ్లో భారతీయ క్రైస్తవ దినోత్సవం చాలా గొప్పగా జరిగింది. వివిధ క్రైస్తవ మత శాఖల నుండి బిషప్ లు, గురువులు, పాస్టర్లు, సిస్టర్లు, బ్రదర్ లు సకల విశ్వాసులు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.క్రీ.శ 52వ సంవత్సరంలోనే భారతదేశానికి ఏసుప్రభుని 12 మంది అపోస్తులలో ఒకరైన పునీత తోమస్ గారు కేరళ రాష్ట్రానికి వచ్చి క్రీస్తు సందేశాన్ని తమ వ్యక్తిగత జీవితము ద్వారా అనేక మందికి బోధించారని, క్రైస్తవ్యం అంటే ప్రేమ,సేవ.భారతదేశానికి విద్యా, వైద్య ,సాంఘిక ,ఆర్థిక ,రాజకీయ రంగాలలో ఎంతో గొప్ప సేవలను క్రైస్తవ మిషనరీలు చేస్తారని అనేక ఉదాహరణలతో వక్తలు ప్రసంగించారు. వివిధ క్రైస్తవ శాఖలకు చెందిన పలువురు మత బోధకులు అలనాటి క్రైస్తవ మిషనరీలు ఎంతో కష్టపడి భాష రాకపోయినా సరే వారు చూపిన ప్రేమ, చేసిన నిస్వార్ధ సేవల ద్వారా అనేక మందిని క్రైస్తవులుగా స్వచ్ఛందంగా మార్చారని. అలనాటి రాజులు, గొప్ప గొప్ప కులాలకు చెందిన వారు కూడా అలనాటి క్రైస్తవ మత బోధకుల సత్ప్రవర్తనలకు ఆకర్షితులయ్యారు, క్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించారు.ఈనాడు మనందరం ధైర్యముగా క్రీస్తు సత్య సువార్తను మన మాటల ద్వారానే కాక సేవలు ద్వారా కూడా దేశమంతా ప్రకటించడానికి ధైర్యముగా అందరం ఐక్యమత్యంతో కలిసి మెలిసి క్రీస్తు సాక్షులుగా జీవిద్దాం. ప్రతి సంవత్సరం జూలై 3 వ తేదీన భారతీయ క్రైస్తవ దినోత్సవంగా అధికార పూర్వకముగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు తెలియజేశారు.అద్భుత రీతిగా వచ్చిన వర్షం కూడా ఆగిపోయింది. క్రైస్తవ జానపద గాయకులు క్రైస్తవ మిషనరీలు చేసిన నిస్వార్థ సేవలను, జానపద గీతాలతో పాడుతూ ఉత్సాహపరిచారు.అనేకమంది ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్పంచుకున్నారు.