మత్తయి వలె నీవు సిద్ధంగా ఉన్నావా?

జోసెఫ్ అవినాష్
03 Jul 2025
సామాన్య 13వ శుక్రవారం
సువిశేష ధ్యానం
మత్తయి 9:9- 13
నేటి సువార్త పఠనంలో యేసు సుంకరికి శిష్యస్థానాన్ని ప్రసాదిస్తున్నారు. యేసుకు సుంకరులు, పాపులు వేర్వేరు కాదు అందరు సమానులే. యేసు వారి అంతరంగాన్ని చూచాడేగాని బాహ్యజీవితాన్ని కాదు. సుంకరులు పన్నులు వసూలు చేస్తారు కాబట్టి వారి మనసులు కఠినంగా ఉంటాయని అందరు భావిస్తారు. అక్కడ ఎంతోమంది ఉండొచ్చు. అయినా ప్రభువు దృష్టి సుంకరిపై పడింది. అతనిపై జాలి కరుణలు పొంగిపొర్లాయి. అవి సుంకరి హృదయాన్ని జ్వలింపజేశాయి. ప్రభు ప్రేమ అతనిని పలకరించింది. నా వెంట రమ్మని పిలిచింది. అసలైన జీవితమంటే ఏంటో చూపిస్తానని ఆహ్వానించింది. అతని అంతరంగం పవిత్రమైంది.
మత్తయి ఒక సుంకరి, ఒక్క పిలుపుతో, తన పదవిని, సంపదను, వదులుకొని యేసుని వెంబడించారు. కృతజ్ఞతగా తనతోటి సుంకరులందరిని విందుకు ఆహ్వానించారు. తాను సుంకరి వృత్తికి చెందిన వ్యక్తిని కాదని, తాను యేసుకి చెందిన వ్యక్తినని తెలియపరిచారు. అంటరానివాడైన సుంకరి మత్తయిని యేసు పిలచి తన శిష్యరికాని ఇచ్చి తన గురించి సువార్తను ప్రపంచానికి అందించే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు మత్తయిను దివించాడు.మారుమాటాడక తాను చేస్తున్న పనిని విడిచి యేసును వెంబడించేలా చేసింది. యేసు దృష్టి మనపై కూడా ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. మంచి వైపు మనల్ని ఆహ్వానిస్తూనే ఉంటుంది. ఆ ఆహ్వానాన్ని అందుకోడానికి నేడే సిద్ధంగా ఉందాం.