నిజమైన శిష్యులు ఎవరు?

జోసెఫ్ అవినాష్
09 Jun 2025
10వ సామాన్య మంగళవారము
సువిశేష ధ్యానం
మత్త. 5:13-16
ధ్యానము: నిజమైన శిష్యులు ఎవరు? సమాజంపట్ల బాధ్యత కలిగి యుండాలి. శిష్యులు భూమికి ఉప్పువలె, లోకమునకు వెలుగై యుండాలని యేసు కోరారు. నిజమైన శిష్యుడు పరిశుద్ధత కొరకు పోరాడుతాడు. పరిశుద్ధమైన శిష్యుడు భూమికి ఉప్పు, లోకమునకు నిజమైన వెలుగు. ‘విశ్వాసులు ఉప్పదనమును కలిగి యుండాలి’ (మార్కు. 9:50). ఉప్పులేని భోజనం రుచించునా! ఆహారం క్షీణించకుండా కాపాడే గుణం, నయంచేసే గుణం, మలినాలను శుద్ధిచేయు గుణం ఉప్పుకు కలదు. కనుక, ఉప్పదనమును కలిగియుండుట అనగా, ఇతరుల జీవితాలకు అభిరుచి కలిగించుట. వారి పవిత్రతను కాపాడుట. పాపముతో గాయపడిన వారికి స్వస్థత చేకూర్చుట. ఇది చేయడం ఎలా? విశ్వాసమునకు సాక్ష్యమివ్వు; ఇతరులపట్ల శ్రద్ధవహించు; వారిలో ధైర్యాన్ని నింపు; నీకున్నదానిని ఇతరులతో పంచుకో; ఇతరుల కొరకు ప్రార్ధించు.
పాపముతో అంధకారములోనున్న లోకమునకు పరిశుద్ధులు వెలుగుగా మారాలి. వెలుగు జీవితాన్ని జీవించాలి. ఇతరులకు మనం ఎలా వెలుగుగా ఉండగలం? ఇతరులకు రక్షణ మార్గమును చూపాలి. అనగా నిస్వార్ధముగా జీవించాలి. నిజ క్రైస్తవ ప్రేమ కలిగి జీవించాలి. అష్ట భాగ్యాల సత్యాలను జీవించాలి. విశ్వాసులు ఒకరికొకరు ఆదర్శముగా ఉండాలి. ప్రజలు వారి సత్కార్యములను చూచి పరలోక మందున్న తండ్రిని సన్నుతించెదరు. అనగా మన సత్కార్యములు దేవునికి మహిమ చేకూర్చును. సత్కార్యములు చేయనివాడు, గంప క్రింద ఉంచు దీపము వంటివాడు. “లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును” (యోహాను. 8:12) అని యేసు పలికెను.