క్రీస్తు తిరు హృదయ చిత్రపటం,విశేషాలు

ఫాదర్. డా.సగినాల ప్రకాశ్
04 Feb 2025
క్రైస్తవుల గృహాలలో క్రీస్తు తిరు హృదయ చిత్రపటాన్ని తప్పక చూడవచ్చు.ప్రత్యేకించి కతోలికులకు యేసు తిరుహృదయం ఆరాధ్యనీయం.ఎక్కడ యేసు తిరుహృదయం ఆవిష్కరించబడి, గౌరవించబడుతుందో అక్కడ ఆ గృహాన్ని యేసుక్రీస్తు ఆశీర్వదిస్తాడని కతోలికులు విశ్వసిస్తారు.చిత్రంలోని యేసు తిరుహృదయం,ఆయనకు మానవులపైగల ప్రేమను సూచిస్తుంది.ఇందులో కనిపించే ఆయ హృదయం సిలువతో పొడవబడి ఉంటుంది. ఆ సిలువ చుట్టూ ముళ్ళు చుట్టబడి ఉండటం గమనించవచ్చు.ఇది ఆయనకు మానవాళి మీదున్న ప్రేమకు చిహ్నం.ఆ ప్రేమలోని గాఢతను అర్థం చేసుకొనుమని పలు సంజ్ఞలు సూచిస్తాయి. మనుషుల మీద ప్రేమ కోసం బాధలనుభవించి,మరణించడానికి ఆయన చూపిన సంసిద్ధతను అవి వివరిస్తాయి. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను.తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెను" అంటుంది యోహాను సువిశేషం (18:16), మనిషిపట్ల దైవప్రేమ అనితరసాధ్యం, అమరం,అది నిరంతర ప్రవాహం.ఇక చిత్రపటంలోని అంశాలకొస్తే ప్రభును కుడిచేతిలోని మూడు వ్రేళ్ళు పైకి చూపబడి ఉంటాయి.అవి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులను సూచిస్తున్నాయి. పైనున్న త్రిత్వేక దేవుడు అంటూ పైకి చూపుతూ,ఆ దేవుడే క్రిందకు దిగి వచ్చాడు అంటూ రెండు వ్రేళ్ళు క్రిందికి చూపిస్తూ ఉంటాయి.ఈ రెండు వ్రేళ్ళు,యేసుక్రీస్తుకున్న రెండు స్వభావాలు.ఒకటి దైవస్వభావం,రెండవది మానవ స్వభావంఈ రెండు స్వభావాలున్న యేసుక్రీస్తులో ముగ్గురు వ్యక్తులు దాగున్నారు అని దీని అర్ధం.తన హృదయాన్ని తెరచి, మానవులకై అగ్నిలా రగిలే ఆ హృదయాన్ని చూడమని ప్రభువు ఆహ్వానించినట్లుండే ఈ చిత్రపటం మనుషుల పట్ల తనకున్న ప్రేమకు చిహ్నం.ఈ చిత్రపటము లేక స్వరూపము ఉన్న ప్రతి గృహము, ఆ దైవసుతుని చేత ఆశీర్వదించబడుతుందని కతోలికుల విశ్వాసము.