చెప్పేవి నీతులు....!(మినీ కథ)
కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
01 Oct 2024
అదొక దేవుడి గుడి.ఆ గుడిని నిర్వహించే స్వాములవారు పీఠం ఎక్కి ప్రసంగిస్తుంటే భక్తులంతా శ్రద్ధగా వింటున్నారు. ఆయన పెద్దగా గొంతెత్తి " భక్తులారా! మనమంతా పరలోకంలో ఉన్నదేవుని బిడ్డలం.ఈ లోకంలో మనం ఆయన్ని భక్తితో పూజించి, స్వర్గ లోకంలో ఆయన దరికి చేరి,ఆ తండ్రి ప్రేమను సంపూర్ణంగా పొందాలి.కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దైవం కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. డబ్బును పూజిస్తూ, దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం. అసలు ఆ డబ్బును మనకు ఇస్తున్నది ఎవరు? ఆ దేవుడే కదా! మరి ఆ డబ్బులో కొంతైనా దేవునికి దక్షిణగా, అర్పణగా ఇవ్వడానికి మనకు ఎందుకో చేతులు రావు.మీరు బయట అనేక విషయాల్లో వందలు వేలు ఖర్చు పెట్టడానికి వెనుకాడరు కానీ, ఇక్కడ గుడిలో పది రూపాయలు చందా వేయడానికి, మీకు చేతులు రావు.చందా పెట్టెలో చిల్లర నాణేలు రాల్పుతూ ఉంటారు. అందాక ఎందుకు? ప్రతి వారం ఇంతమంది గుడికి వస్తుంటారు,కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియ కూడదు గనుక, చందా పెట్టెలో రహస్యంగా డబ్బులు వేస్తుంటారు గదా! ఇంత మంది భక్తులు మీరంతా పోయిన వారం ఇచ్చిన చందా ఎంతో తెలుసా? 435 రూపాయలు,అక్షరాలా నాలుగొందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే! ఇకనుంచైనా, కాస్త డబ్బు మీద వ్యామోహం వదిలి కాస్త మెండుగా గుడికి చందాలు ఇస్తూ వుండండి. దేవుని ఆశీస్సులు దండిగా పొందండి" అంటూ ఆ స్వామి ప్రసంగం ముగించాడు. భక్తులు సరేనంటూ తలలూపుతూ ప్రార్ధనలో మునిగారు.
ఆ ప్రార్ధనా కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఒక పెద్దాయన ఆ స్వామి దగ్గరకు వెళ్లి, "స్వామీ, పోయిన వారం గుడి చందా ఎంత వచ్చింది?"అని అడిగాడు. "ఎంత? నాలుగొందల ముప్పై ఐదు రూపాయలే.నేను ప్రసంగంలో చెప్పానుగా వినలేదా?" అన్నాడు ఆ స్వామి. "కాదు స్వామీ, పోయిన వారం మా అమ్మాయికి కొడుకు పుట్టాడనే సంతోషంతో దేవునికి కృతజ్ఞతగా నేను చందా పెట్టెలో నాలుగు 5 వందల రూపాయల నోట్లు, అంటే రెండు వేలు వేసాను.మరి అవి ఏమయ్యాయంటారు?" ఆ పెద్దాయన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తేలు కుట్టిన దొంగలా మిన్నకుండి పోయాడు-వచ్చిన చందా గురించి దొంగ లెక్క చెప్పిన ఆ స్వామి! "డబ్బు మీద వ్యామోహం ఉండకూడదని ప్రసంగాలు చెప్పే మీరు ముందు ఆ వ్యామోహం తగ్గించుకుంటే బాగుంటుందిగా స్వామీ" అని నీతులు చెప్పే స్వామికే నీతి గరిపి వెళ్లి పోయాడా పెద్దాయన!