మన రక్షణ కవచాలు (కావలి దూతల పండుగ)
జోసెఫ్ అవినాష్
01 Oct 2024
ఈ సువిశాల భూ ప్రపంచాన్ని పరికించి చూచిన అదో అద్భుతమైన సృష్టిగా భావిస్తాము. అలాగే మనకు తెలియని మన చుట్టూ ఉండే మరో అద్భుతమైన ప్రపంచం దేవదూతలకు నిలయమై ఉన్నది. ఈ దూతల ప్రపంచమునకు మన ప్రపంచమునకు పెద్ద తేడా ఏమీ లేదు. మన చుట్టూ మన తోపాటుగా అదృశ్యం లో ఉండే అత్యంత రహస్యమైన ప్రపంచం ఇది. ఇలాంటి దేవదూతల గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక సంఘటనలు బోధింపబడి ఉన్నాయి. కానీ ఈనాడు ఈ దూతలను చూచిన వారు ఎవరైనా ఉన్నారా? ఏ బోధకులు కూడా దీని బోధించే స్థితిలో లేరు. కానీ దివ్య గ్రంధములో ఇంచుమించు ప్రతి ఒక్క దైవజనుడు దేవుని దూతల యొక్క పరిచర్యను పొందియున్నారు. మరి రక్షణ చరిత్రలో, పరిశుద్ధ గ్రంధంలో ఇంత ఉన్నత స్థానమును పొందిన దేవుని దూతలను గూర్చి, వారి పరిచర్యను గూర్చి మనమంతా తెలుసుకోవటం కనీస ధర్మం. అందుకే వీటిని దృష్టిలో పెట్టుకుని మన తల్లి శ్రీ సభ ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో రక్షణ చరిత్రలో దేవుని ప్రణాళికలో పాలు పంచుకొని తమదైన పాత్రను పోషించి వెలుగొందిన ప్రధాన అతి దూతలు(మిఖాయేలు- గాబ్రియేలు- రఫాయేలు) గార్ల ఉత్సవాన్ని కొనియాడుతూ వారి ఔన్నత్యాన్ని గూర్చి, రక్షణ చరిత్రలో , దేవుని ప్రణాళికలో వారు పోషించిన పాత్రను మనకు గుర్తు చేస్తుంది.తదుపరి అక్టోబర్ మాసంలో తల్లి శ్రీసభ 2వ తారీఖున " కావలి సన్మానస్కుల" ఉత్సవాన్ని కొనియాడుతూ కావలి సన్మానస్కులను మనం గౌరవించాలని, వారి పట్ల విశేష భక్తిని, గౌరవాన్ని మనం చూపాలని ఆదేశిస్తున్నది. ఈ మేరకు కొన్ని విషయాలను తెలుసుకుందాం...
కావలి సన్మనస్కులు నిర్వచనం-:
సన్మనస్కులకు కాపలా కాసే వాళ్ళు, మార్గదర్శకులు, సంరక్షకులు, సహాయకులు, కాపరులు, నావికులు, సేనాపతులు అనే పెక్కు పేర్లు, వివిధ అర్ధాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా పరిశీలన చేస్తే వీరి యొక్క పాత్ర, దేవుడు వీరికి అనుగ్రహించిన బాధ్యతలు మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి..
"ఎల్ల కీడులనుండి నన్ను తప్పించిన దేవదూత, ఈ బాలురను ఆశీర్వదించును గాక! వీరు నా పేరు నా పితరులైన అబ్రహాము, ఈసాకుల పేరు నిలబెట్టుదురు గాక! వీరు పెక్కుమంది బిడ్డలను కని మహాజాతిగా విస్తరిల్లుదురు గాక" అనెను.
(ఆదికాండము 48 : 16)
పై వాక్యాన్ని బట్టి యాకోబు గారిని ఒక ప్రత్యేక దేవదూత కాపాడినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది.
"చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
(మత్తయి సువార్త 18 : 10)
పై వాక్యాన్ని పరిశీలన చేస్తే చిన్న వారికి ప్రత్యేక దూతలు ఉన్నారని తెలుస్తున్నది.....
"'నీవు వెఱ్ఱి దానవు" అని లోపలివారు ఆ బాలికతో అనిరి. కాని ఆమె తాను చెప్పినది ముమ్మాటికి నిజమే అనెను. వారు "అది అతని దూతయై ఉండును" అని బదులు పలికిరి.
(అపొస్తలుల కార్యములు 12 : 15)
చరసాల నుండి బయటకు వచ్చిన పేతురు గారిని చూసి ప్రజలు ఇతడు పేతురు దూత అనుకున్నారు. అనగా పేతురు గారికి ఒక ప్రత్యేక దూత ఉన్నారని భావం..
పై మూడు వాక్యాలను మనం పరిశీలన చేస్తే వాటిలో ప్రస్తావించబడ్డ ఈ ప్రత్యేక దూతలే కావలి సన్మనస్కులు . మన పూర్వికులు వీరిని ఎక్కువగా నమ్మి భక్తి విశ్వాసాలు, గౌరవ ప్రపత్తులు చూపేవారు.ప్రారంభంలో చెప్పుకున్న విధంగా సన్మనస్కులకు మన పూర్వీకులు కాపలా కాసే వాళ్ళు, మార్గదర్శకులు సంరక్షకులు, సహాయకులు, కాపరులు, నావికులు అనే పెక్కు పేర్లు పెట్టారు. ఈ పేర్లను బట్టే కావలి సన్మనస్కులు సర్వమానవాళికి చేసే సహాయం ఏమిటో రక్షణ చరిత్ర లో వారికున్న ప్రాధాన్యత ఏమిటో అర్థం అవుతున్నది.సన్మనస్కుల సేవలు మూడు రకాలుగా విభజించబడ్డాయి
1. దూతలు అనుక్షణం మనలను ఆపదల నుండి అపాయాల నుండి కాపాడుతుంటారు. మనం చేసే ప్రయాణాలలో తోడుగా ఉండి మనకు భద్రతను, రక్షణను కల్పిస్తారు. ఉదాహరణకి అగ్ర దూతైన రఫాయేలు గారు తోబీయాకు రక్షగా ఉన్నారు. 91 వ కీర్తన 11, 12 వచనాలు దూతల గురించి ఈ విధంగా బోధిస్తున్నాయి
"ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్లిన వారు నిన్ను కాపాడుచుందురు.నీ కాళ్లు రాతికి తగిలి నొవ్వకుండునట్లువారు నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొందురు".
(కీర్తనల గ్రంధము 91 :11- 12)
నిర్గమకాండములో ధ్యానం చేసినట్లైతే దూత ఇశ్రాయేలీయులను నడిపించాడు- నిర్గమ 20,20-22 దూతలు మనలను పిశాచం నుండి కాపాడతారు సైతానుకు మనకు నిరంతరం యుద్ధం జరుగుతుంది. ఈ పోరులో దూతలు మన పక్షాన నిలుస్తారు మన కష్టాల్లో వాళ్లు మనకు శాంతిని, ఆనందాన్ని దయ చేస్తారు.
2. మనము ఈ లోక సంబంధమైన విషయాలకు బందీలై పాపములో పడిపోయినప్పుడు దేవదూతలు మనకు పశ్చాత్తాపం ,పరివర్తనం కలిగిస్తారు పాపమువలన గాయపడిన మన ఆత్మకు చికిత్స చేస్తారు.
3. మన ప్రార్ధనలను దేవునికి అర్పిస్తారు. రఫాయేలు సన్మనస్కుడు తోబీతు ప్రార్థనలను దేవునికి అర్పించాడు-: తోబీ 12:12. ఒక దేవదూత దైవ ప్రజల ప్రార్థనలను దూప కలశంలో పెట్టి దేవునికి అర్పించారు-: దర్శన 8:3 పిశాచం,కావలి సన్మనస్కులు వీరిరువురు ఎప్పుడూ మన చుట్టూ ఉంటారు. పిశాచము మనకు చెడు ఆలోచనలు, చెడు ప్రేరణలు పుట్టిస్తుంది.సన్మనస్కులు మంచి ఆలోచనలు ,ప్రబోధాలు కలిగిస్తాడు .ఈ లోకములో మనకు ఒకరు ఇద్దరు మంచి స్నేహితులు ఉండవచ్చు కానీ వారి కంటే మంచి స్నేహితుడు కావలి సన్మనస్కుడు. అతన్ని మనం గుర్తించకపోతే అతని సహాయాన్ని పొందకపోతే చాలా నష్టపోతాము
సన్మనస్కుల సేవలు-: బైబిల్ ఆధారాలు-:
సన్మనస్కులు సృష్టి లోని భౌతిక పదార్థాలైన నేల, నిప్పు వాయువు, జలము మొదలైన వాటిని కూడా కాపాడుతుంటారు అని కొందరు వేదశాస్త్రలు చెప్పారు.
1. ఇశ్రాయేలు సంరక్షకులు. దేవదూతలు...... ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేక విధంగా కాపాడారు. ఎందుకంటే వాళ్లు దేవుడు ఎన్నుకున్న ప్రజలు కాబట్టి వారి దేవాలయాన్ని, నిబంధనని జాగ్రత్తగా దేవదూతలు పరిరక్షించారు. ఇంకా ఆ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అందించింది కూడా దూతలే -: గలతీయులు 3:19
2. అన్య జాతుల మతాల్లో, ఒక్క యూదుల జీవితం లోనే కాక అన్యజాతుల జీవితాల్లోను,మతాల్లోను దేవదూతల ప్రమేయం ఉంది. ద్వితీయోపదేశ కాండం 32 వ అధ్యాయం 8 వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ విధంగా బోధిస్తున్నది
మహోన్నతుడు వివిధ జాతులకు దేశాలను ఇచ్చినప్పుడు. ఏ జాతులు ఎచట నివసించాలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్క దేవదూతను ఇచ్చారు. దూతలు అన్య జాతి ప్రజల మనసులను దేవుని వైపు త్రిప్పుతూ వచ్చారు.
3. మనుష్య అవతారంలో అనగా దేవుడు ఈ లోకంలోకి నరవతారంలోకి దిగి రావడం అలా నరవతారంలోకి దిగివచ్చిన క్రీస్తును చూసి దేవదూతలు సంతోషించారు. ఆ దైవ శిశువు చుట్టూ ప్రోగై మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకములో ఆయన అనుగ్రహానికి నోచుకున్నవారికి సమాధానం అని దేవుని కీర్తించారు -: లూకా 2,13-14 వాళ్లు దేవుని నరావతార రహస్యాన్ని జకరియాకు, మరియ తల్లి యోసేపు గారికి అదే విధముగా పొలాల్లో గొర్రెలు కాచుకునే కాపరులకు తెలియజేశారు. క్రీస్తు రాక ముందు వాళ్ళు దేవునికి నరులకు నడుమ మధ్యవర్తులుగా తమ యొక్క విధులను నిర్వర్తించారు...
4.శ్రీసభ సంస్కారాలలో సన్మనస్కులు మన కంటికి కనిపించకుండానే మన ఆరాధనలో పాల్గొంటారు. మనము చదివే వేద పఠనాలను, గురువులు చెప్పే ప్రసంగాలను వాళ్ళు వింటుంటారు. మనలను జ్ఞాన స్నానం స్వీకరణకు సిద్ధం చేస్తారు .ఈ సంస్కారం ద్వారా మనం దైవ ప్రజలమైనందుకు సంతోషిస్తారు..
5. పునరుత్థాన కాలంలో మనం చనిపోయాక చాలా ఏళ్ళకు దేవుని చిత్త ప్రకారం ఉత్ధానం వస్తుంది. అంతకాలం దూతలు మన దేహాలను కాపాడుతు మన పునరుత్థానం కొరకు వేచి చూస్తూ ఉంటారు. ఆ దినం వచ్చినప్పుడు మనలను శరీర ఆత్మలతో దేవుని చెంతకు కొని పోతారు-: మత్తయి 24,31
పునీతుల జీవితాలలో సన్మనస్కులు-:
ఎందరో పునీతులు సన్మనస్కులను భక్తి, విశ్వాసాలతో గౌరవించారు.పునీత జాన్ బర్కుమాన్సు గారు తన గది అందు నిలిచి ఉండి తన కంటే ముందుగా తన కావలి సన్మనస్కుడు గదిలోకి ప్రవేశించాలని బ్రతిమాలు కొనేవాడు. పునీత ఇగ్నేషియస్ గారు త్రోవలో తనకు ఎదురుపడిన వారి సన్మనస్కులకు నమస్కరించే వాడు. పునీత బెర్నార్డ్ గారు చెప్పినట్లు అన్ని తావుల్లో అన్నివేళలా మనము సన్మనస్కులను గౌరవించాలి. పునీత చిన్న తెరేసమ్మ తన ఆత్మ కథలో "నేను బలహీనపు బాలిక నని ఎరిగి బలవంతుడైన నీవు నన్ను ముందుకు నడిపించుకుని పోతున్నావు" అని రాసుకుంది.
పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు తనకి మిక్కిలి ఇష్టమైన హిందూ జపాను దేశాల కావలి సన్మనస్కులకు ప్రతిరోజు చెయ్యెత్తి నమస్కారం చేసేవాడు.
చివరిగా-:
నీ కావలి దూతలను గౌరవించు. నీ కోసమై తాను కల్పిస్తున్న భద్రతకై కృతజ్ఞుడవైవుండు. వారిపట్ల, ప్రేమ, నమ్మకము కలిగియుండుము. శోధనలోను, కీడులలోను వారి సహాయము కొరకు ప్రార్థించు అని పునీత బెర్నార్డ్ గారు పలుకుతున్నారు "ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు” అని కీర్తనకారుడు తెలుపుచున్నాడు... కావున శ్రీ సభ ధర్మాన్ని, ప్రబోధాన్ని గౌరవిద్దాం కావలి సన్మానస్కులతో స్నేహం చేద్దాం వారిని విశ్వసిద్దాం ,గౌరవిద్దాం వారి సంరక్షణలో మనకు ఎటువంటి ఆపదలు అపాయాలు ఉండవు.