పునీత చిన్న తేరేసమ్మ స్మరణ
ఫాదర్ పి.వినోద్
30 Sep 2024
శ్రీసభ పునీతులు, ప్రభుని బాటలో పయనించి,ప్రభుని ఆజ్ఞలు నెరవేర్చి, ప్రభుని కడవరకు అనుసరించి, ప్రభునిలో ఏకమైజీవించి, మరణించి ఇప్పుడు పరలోకంలో నిత్యము జీవిస్తూ, మన కొరకు ప్రార్థిస్తూ, మనకు మార్గదర్శకులుగా ఉన్నారు.
పునీత చిన్న తేరేజమ్మను చిన్న తేరేసమ్మ అని పిలుచుటకు కారణం ఏమిటంటే ఆమె తన కుటుంబంలోని పిల్లలందరిలో చిన్నది కావటం మరియు మరో అక్క పేరు కూడా మరియ లియోని తెరెసా కావటం వలన ఆమెను చిన్న తెరెసా అని చిన్న రాణి అని చిన్న పుష్పం అని పిలిచేవారు.ఆమె బొద్దుగా, అందముగా ఉండును. ఎల్లప్పుడూ ధీనత్వం, నిరాడంబరత కలిగి ఉండేది.
దైవసేవయే తల్లిదండ్రుల లక్ష్యం
................................................
పునీత చిన్న తేరేజమ్మ గారి తండ్రి దైవసేవలో గురువుగా సేవలు చేయాలని ఆమె తల్లి కన్యాస్త్రీగా దైవసేవలో ఉండాలని తలంచినా , దైవనిర్ణయం వేరగుటచేత వారు భార్యాభర్తలుగా వివాహ బంధములో ఏకమయ్యారు. వారికి తొమ్మిది మంది సంతానము కలిగి వారిలో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు కొన్ని నెలలకే మరణించగా చిన్న తేరేజమ్మ చివరి సంతానంగా 1873 వ సంవత్సరంలో జనవరి 2వ తేదీన ఫ్రాన్స్ దేశంలో జన్మించింది.తల్లిదండ్రులు ఇద్దరు మంచి వ్యాపారం చేయడం వల్ల బాగా సంపాదిస్తూ ధనవంతులుగా జీవించారు.కానీ చిన్న తెరెసా గారి తల్లి తన నాలుగవ ఏటనే మరణించగా తండ్రి కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, తన వ్యాపారాన్ని, భవనాన్ని లుసియాక్స్ నగరమునకు మార్చుకున్నారు.
దైవ మానవ సేవకే అంకితమైన కుటుంబం
...............................................
"నేను నా కుటుంబము ప్రభువును మాత్రమే ఆరాధింతుము (యెహోషువ 24:15) అని యెహోషువా చెప్పిన విధముగా పునీత చిన్న తెరేసమ్మ గారి సోదరీమణులు అందరూ కూడా దైవసేవలో మఠకన్యలుగా జీవింప నిశ్చయించుకున్నారు.వారిలో ముగ్గురు కార్మెల్ మఠంలో చేరగా మరొకరు , 'విజిస్ట్రేషన్ సభలో మఠకన్యగా సేవలు అందిస్తున్నారు.చిన్న తెరసా కూడా కార్మెల్ మఠంలో చేరడానికి ప్రయత్నంచగా,15 సంలు ఉండుట వలన, పెద్దల సలహా మేరకు, 12వ లియో పాపు గారి సలహా మేరకు, 16 సం॥లు నిండిన తరువాత 1889వ సంవత్సరము ఏప్రిల్ 9వ తేదీన లిసియుక్స్ పట్టణ కార్మెల్ మఠం లో చేరి 1889వ సంవత్సరం జనవరి 10న కన్యాస్త్రీగా మాట పట్టు స్వీకరించారు.
పునీత చిన్న తెరేసమ్మ గారిలో నుండి నేర్చుకోదగిన అన్ని పాఠాలు, సుగుణాలు
................................................
ప్రభువు అష్ట భాగ్యాలలో చెప్పిన విధముగా, "నా నిమిత్తము ప్రజలు ముమ్ము అవమానించినపుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు" (మత్తయి 5:11). చిన్న తెరేసమ్మగారు వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు , సహించారు. కన్యాస్త్రీగా దైవనేవ చేస్తున్న తాను కొన్నిసార్లు ఆమెపై వారి మఠసభ్యులు నిందలు మోపేవారు ,సరిగా పని చేసినా, చేయలేదని అవమానించేవారు, తాను పనిచేస్తున్న ప్రదేశంలో బట్టలు ఉతికి, మురికి నీరు పడేలా చేసినా, కొన్ని సందర్భాలు బాధించినా, వేదించినా చిరునవ్వుతో సహించేది తప్ప ఎదురుమాటలు పలికిన వ్యక్తి కాదు. కొన్నిసార్లు తన విరామ సమయం వదులుకొని వృద్ధ కన్యాస్త్రీల బట్టలు ఉతుకుతూ, వారికి సహాయపడుతూ వుండేది. ఆమె త్యాగ జీవితం చూసి వెద్దలు మఠకన్యలుగా ప్రవేశించే నోవీసులకు పెద్దగా నియమించగా,వారికి దైవప్రేమ, సోదర ప్రేమ,విశ్వాసం,ఇంటిపని, గుడిపని, తోటపని,నేర్పించి ఆమె త్యాగ జీవితమును గురించి పెద్దల ఆజ్ఞ మేరకు ఒక పుస్తకముగా వ్రాసినారు.
పునీత చిన్న తేరేసమ్మ గారి ప్రార్థన, ఆధ్యాత్మిక జీవితం
...........................................
పునీత చిన్న తేరేసమ్మ తన చిన్నతనంలో తన తల్లిలా చూసుకునే తన అక్క మరియ తనను వీడి వెళ్లడంతో అనారోగ్యం పాలై ఎన్ని మందులు వాడినా నయం కానీ సమయంలో తన గదిలో ఉన్న మరియతల్లి స్వరూపం చూస్తూ ప్రార్థించగా అద్భుతంగా స్వస్థత పొందుకుంది. ఒకసారి మఠ కన్యగా సేవలు చేస్తూ వారి తోటలో పనిచేస్తూ, దేవుని స్తుతిస్తూ ఉండగా, ఒక బాలుడు దర్శనమిచ్చి ఆయన పేరు అడగగా నా పేరు "చిన్న తేరేసమ్మ
యొక్క బాలయేసు" అని చెప్పడంతో ఆ దర్శనం బాల జేసుదే అని అర్థం చేసుకున్నది. చిన్న తెరెసా తన జీవితం ప్రభువు కోసమే అని, ఎక్కువగా ఆత్మల రక్షణ కొరకు, గురువుల కొరకు వారు చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఫలప్రదం కావాలని ప్రార్ధించేవారు. తన తండ్రి వృద్ధాప్యంలో మరణించగా, ఉత్తరించు స్థలంలో ఆత్మల నిమిత్తం ప్రార్థించడం ప్రారంభించారు.
పునీత చిన్న తేరేసమ్మ జీవిత చివరి ఘడియలు
................................................
చిన్న తేరేజమ్మ తన చిన్న వయసులో క్షయరోగం వలన 1897 సంవత్సరం జూలై 30న అవస్త అభ్యాంగణం స్వీకరించింది. 1897 సంవత్సరం సెప్టెంబర్ 30న సత్ప్రసాదం లోకొని ఇటు పిమ్మట కొన్ని గడియాలు గడిచిన పిమ్మట స్వర్గస్తురాలైనారు. వారి మరణాంతరం ఆమె విజ్ఞాపన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. 1923వ సంవత్సరం భక్తి నాథ పాపుగారు ధన్యతా పట్టం ఇవ్వగా, 1927 వ సంవత్సరం శ్రీసభ వారికి పునీత పట్టం ఇచ్చి గౌరవించింది. కనుక పునీత చిన్న తేరేసమ్మ ప్రార్ధన సహాయం ద్వారా మనం కూడా సహనంతో, పరిశుద్ధతతో జీవించుదాం ..