అక్టోబర్ మాసం-: జపమాల అంకిత మాసం
జోసెఫ్ అవినాష్
30 Sep 2024
మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్టోబర్ మాసము రానే వచ్చింది. అక్టోబర్ నెల అనగానే కతోలిక విశ్వాసులకు జపమాల గుర్తుకు వస్తుంది... జగద్గురువు నుండి జపమెరిగిన జనం వరకు ఏ అంతస్థులో ఉన్న కతోలిక విశ్వాసి అయినా సరే జపమాలను మిక్కిలి భక్తితో జపిస్తారు... "ఎలా ప్రార్థించాలో తెలియని విశ్వాసులకు" ఇలా ప్రార్థించాలి అని చాటి చెప్పేదే జపమాల... చదవటం రాని విశ్వాసులు కూడా పుస్తకం చూడకుండా జపమాలను చక్కగా చెప్పగలుగుతున్నారు అంటే ఈ ప్రార్థనలో ఇమిడి ఉన్న దైవ శక్తిని మనమంతా గ్రహించాలి...జపమాల కతోలికులకు ఒక వరం లాంటిది.. ఈ మేరకు కొన్ని విషయాలను తెలుసుకుందాం
**జపమాల అక్టోబర్ మాసము ప్రాముఖ్యత-:
కతోలిక క్రైస్తవులు అక్టోబర్ మాసమును జపమాల అంకిత మాసముగా విశ్వసిస్తుంటారు. దీనికి కారణం ఏమనగా అక్టోబర్ 7వ తేదీ జపమాల మాత మహోత్సవం కావటం. చరిత్రను మనం పరిశీలన చేస్తే 1206వ సంవత్సరంలో విరివిగా ఐరోపా ప్రజలకు సవాలుగా మారిన "అల్బిజోన్సియన్" అనే తప్పుడు వేద ప్రచారం అంతం కావాలని అప్పటి పునీతుడు పునీత డొమినిక్ గారు చేసిన ప్రార్థనలు, ఉపవాసాలు, భక్తి క్రియలను చూసి సాక్షాత్తు మరియతల్లి డొమినిక్ గారికి దర్శనమిచ్చి జపమాలను తన చేతికి అందిస్తూ, దానిని ఒక ఆయుధంగా వాడమని అదే విధంగా జపమాల భక్తిని ఇతరులకు ప్రబోధించమని తనను ఆదేశించారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది.
ఆ పిదప 1213 వ సంవత్సరంలో అల్బిజోన్సియన్లు అపజయం పాలవ్వటం మనం చూస్తాం. అలాగే 1573 వ సంవత్సరంలో టర్కీలో ముస్లింలకు మరియు క్రైస్తవుల మధ్య జరిగిన పోరాటంలో జపమాల ప్రార్థన ద్వారా టర్కీలు అపజయం పాలవడం దానిని 5వ భక్తనాథ పాపు గారు జపమాల విజయంగా అభివర్ణించటం చరిత్ర మనకు తెలియజేస్తున్నది. అటు పిమ్మట 13 వ గ్రెగొరీ జగద్గురువు జపమాల పండుగను ప్రతి దేవాలయంలో జరపాలని అక్టోబర్ మాసమును మరియమాతకి అంకితమిస్తూ జపమాల మాత మాసముగా కొనియాడాలని ఆదేశించారు. 1671 వ సంవత్సరంలో పదవ క్లెమెంట్ జగద్గురు ఈ పండుగను స్పెయిన్ దేశమంతటా వ్యాపింపజేశారు. అటు పిమ్మట రెండవ సారి చరిత్రలో టర్కీల మీద రష్యా వలె క్రైస్తవులకు భయంగా మారిన వారిపై విజయాన్ని సాధించి నందుకు ఆగస్టు 5వ తేదీన 1716 వ సంవత్సరంలో యువరాజు యూజిన్ ఆధ్వర్యంలో వారిని ఓడించిన సందర్భంలో 11వ క్లెమెంట్ జగద్గురువు ఈ పండుగను ప్రపంచమంతటా వ్యాపింపజేశారు. ఈ విధంగా అక్టోబర్ నెలలో మరియమాత ఇచ్చిన శక్తివంతమైన ఆయుధం జపమాల ద్వారా సాధించిన విజయాలను బట్టి మన కతోలిక శ్రీ సభ అక్టోబర్ మాసమును మరియమాతకు అంకితమిచ్చారు.
***జపమాల ప్రార్థన ప్రాముఖ్యత-:
జపమాల ప్రార్థన పరలోకం నుండి దేవుడు మరియతల్లి స్వహస్తాల ద్వారా మనందరికీ అనుగ్రహించిన ప్రార్ధన పరలోక జపం, త్రికాల జపం, జపమాల రహస్యాలు క్రీస్తు జీవితం పై మరియతల్లి జీవితంపై ధ్యానించేవి. ధ్యానాంశాలన్నీ ఇరవై పరమ రహస్యాల్లో(సంతోష దేవ రహస్యాలు, దుఃఖ దేవ రహస్యాలు, వెలుగు దేవ రహస్యాలు, మహిమ దేవ రహస్యాలు) ఇమిడి ఉంటాయి. త్రీత్వస్తోత్రం, పరలోక జపం, 10 మంగళ వార్త జపాలు కలిపి ఒక గుర్తు.
జపమాల ప్రార్థనను దేవుడు వ్యక్తిగత ప్రార్థనగా, కుటుంబ ప్రార్థనగా, సంఘ ప్రార్థనగా తయారు చేశారు. జపమాల ప్రార్థనను పిల్లలు,పెద్దలు ప్రార్థించవచ్చు. పవిత్రాత్మ ప్రతి ఒక్కరిలో వ్యక్తిగతంగా మాట్లాడుతు క్రీస్తు జీవిత పరమ రహస్యాలను విశదపరుస్తుంది. జపమాల ప్రార్థన ద్వారా ఆత్మ జ్ఞాన వరాలు సిద్ధిస్తాయి.
1. జపమాల ప్రార్థన దేవుడు జపించమని కోరాడు.
జపమాల ప్రార్థన చేయు వారికి ఆత్మీయ అనుగ్రహం ప్రసాదిస్తారు.
2. ఆత్మీయ పాఠశాలలో పునీతులుగా తీర్చిదిద్ది కొనుటకు సామాన్యమైన మార్గం
3. సాతానుని ఎదురించుటకు తిరుగులేని ఆయుధం.
4. క్రీస్తు మరియ తల్లి జీవితాలను వ్యక్తిగతంగా ధ్యానిస్తూ, క్రీస్తు మరియ తల్లి జీవితాన్ని ఆచరించి అవలంబిస్తున్నాం
5. దేవుని ఒప్పందాన్ని దివ్యసత్ర్పసాదం ద్వారా జీవ వృక్షమైన మరియతల్లి గర్భ ఫలాన్ని స్వీకరించుటకు ఒక గొప్ప మార్గం.
జపమాల ప్రార్థన హృదయాన్ని మార్చే ప్రార్థన-:
"హృదయ శుద్ధి గలవారు ధన్యులు - వారు దేవుని దర్శింతురు".
(మత్తయి సువార్త 5 : 8)
హృదయశుద్ధి గలవారు దేవుని దర్శిస్తారు అని వాక్యం పలుకుతున్నది. జపమాల ప్రార్థన మనసుతో ధ్యానం చేయడం వలన మనసులో ఉన్నటువంటి పాపపు ఆశలు బయటికి వెళ్ళి పోయి హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
జపమాల ప్రార్థన హృదయాలను, జీవితాలను మార్చుతుంది. జీవితంలో ప్రతి సమస్యను క్రీస్తు సిలువ బాధలతో మిళితం చేయాలి. మరియతల్లి ప్రతి పనిని, సమస్యని దేవునికి సంపూర్ణంగా సమర్పించారు. ఆమె బిడ్డలమైన మనం కూడా ఇదే బాటలో నడవాలి .ఇందుకు జపమాల ప్రార్థన ఎంతగానో ఉపకరిస్తుంది. మరణం తర్వాత దేవుని సన్నిధిలో నిలుచుని ప్రభు తీర్పుకు న్యాయానికి గురి కావాలి. ఇది జపమాల ప్రార్థన ద్వారా సాధ్యపడుతుంది.
జపమాల-: మేలులు
పునీతులు, ఎందరో విశ్వాసులు జపమాలను ధ్యానించటం ద్వారా తమ జీవితాలను ధ్యానం చేసుకున్నారు...
1.జపమాల ప్రార్థన పాప మార్గంలో నడుచువారిని సన్మార్గంలోకి నడిపిస్తుంది..
2.సకల విపత్తులలోను, పిశాచి తంత్రములలోను,మరణావస్ధలోను మనలను కాపాడుతుంది..
3.ఇహలోక సమాధానమును, పరలోక ఆనందమును కుమారుని ద్వారా అనుగ్రహిస్తుంది.
ముగింపు-:
జపమాల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన.. మనము జపమాల ప్రార్థనలో పాల్గొన్నప్పుడు మనతో పాటు మరియతల్లి కూడా కూర్చుంటారు. మనకోసం ప్రార్ధిస్తారు...జపమాలను పట్టుకున్నప్పుడు సాక్షాత్తు మరియతల్లి చేతిని నేను పట్టుకున్నాను అనే భావన మనకు కలగాలి.. జపమాల మనకు విజయాలను అందించే జయమాల, దీవెనలు సమకూర్చే దీవెనల మాల..సాక్షాత్తు క్రీస్తు ప్రభుని సందేశ సుమమాల జపమాల.. కావున ప్రియ మిత్రులారా భక్తి విశ్వాసాలతో ఈ జపమాల మాసాన్ని కొనియాడదాం అందరి కొరకు ప్రార్థించుదాం ఆమెన్...